Movie Shoot In Space: స్పేస్, ఇతర గ్రహాలు సబ్జెక్టుతో హాలీవుడ్లో పదుల సంఖ్యలో చిత్రాలు తెరకెక్కాయి. అంతరిక్షంలో దూసుకుపోయే నౌకలు, వ్యోమగాముల సాహసాలు, విచిత్రమైన మనుషులు, జంతువులు, వాతావరణ పరిస్థితులు మనం ఆ చిత్రాల్లో చూశాం. అయితే అవన్నీ భూమి మీదే తెరకెక్కించిన చిత్రాలు. సెట్స్ లో షూటింగ్ జరిపి, విజువల్ ఎఫెక్ట్స్, కంప్యూటర్ గ్రాఫిక్స్ తో మనకు నిజంగా స్పేస్ లో జరిగిన భావన కల్పిస్తారు. వాస్తవంలో స్పేస్ లో మనిషి మనుగడ అంత సులభం కాదు. వ్యోమగాములు జీరో గ్రావిటీ, ఆక్సిజన్ లేని వాతావరణంలో జీవించేందుకు ఏళ్ల తరబడి శిక్షణ పొందుతారు.
కాగా అమెరికా-రష్యా దేశాల మధ్య ఎప్పటి నుండో ఆధిపత్యపోరు ఉంది. ప్రతి విషయంలో పోటీపడుతుంటారు. స్పేస్ లో నేరుగా షూటింగ్ చేసి చరిత్ర సృష్టించాలని అమెరికా ఎప్పటి నుండో భావిస్తుంది. దీని కోసం టామ్ క్రూజ్, స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ తో చర్చలు జరిపారు. 2020లో ఈ ప్రాజెక్ట్ ప్రకటించారు. అయితే అమెరికా కంటే ముందు మనం స్పేస్ లో సినిమా తీయాలని రష్యా కంకణం కట్టుకుంది. అమెరికన్ ప్రాజెక్ట్ పట్టాలెక్కడానికి ముందే రష్యా అంతరిక్షంలో ఓ మూవీ షూటింగ్ చేసింది.
అంతరిక్షంలో మొదటిసారి షూటింగ్ చేసిన ఘనత మాదే అని వారు చెప్పుకుంటున్నారు. ఈ సినిమా పేరు ‘ది ఛాలెంజ్’. రష్యన్ స్టార్ హీరోయిన్ యూలియా పెరెసిల్డ్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రానికి క్లిన్ షిపెంకో దర్శకత్వం వహించారు. అంతరిక్షంలోకి వెళ్లే ముందు నటి యూలియా, డైరెక్టర్ క్లిన్ షిపెంకో నాలుగు నెలల పాటు సోయజ్ స్పేస్ క్రాఫ్ట్ లో శిక్షణ పొందారు. ఇక ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ లో ఉన్న ముగ్గురు రియల్ వ్యోమగాములు అతిథి పాత్రలు చేయడం మరొక విశేషం.
షూటింగ్ సమయంలో దర్శకుడు కెమెరా, లైటింగ్, సౌండ్ విభాగాలను కూడా పర్యవేక్షించారు. మొత్తంగా 30 గంటలు స్పేస్ లో షూటింగ్ చేశారు. ఫైనల్ కట్ లో 50 నిమిషాల ఫుటేజ్ రాబట్టారట. హీరోయిన్, దర్శకుడిని తిరిగి భూమి మీదకు తెచ్చిన సోయజ్ ఎంఎస్ 18 వ్యోమనౌకను సందర్శనార్ధం మాస్కోలో సందర్శనార్థం పెట్టారు. ఇక ఈ చిత్ర బడ్జెట్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు. కేవలం 12 మిలియన్ డాలర్స్ అట. అంటే ఇండియన్ కరెన్సీలో రూ. 100 కోట్లు. ఆర్ ఆర్ ఆర్ బడ్జెట్ లో కేవలం నాలుగో వంతు అని చెప్పాలి.