Nagendra Babu : నేటి తరంలో ఒక సినీ హీరో రాజకీయ పార్టీ ని పెట్టి, ప్రభుత్వాన్ని స్థాపించే పరిస్థితులు లేవు. అప్పట్లో ఎన్టీఆర్, ఎంజీఆర్ లాంటి మహానుభావులకు తప్ప, మళ్ళీ అలాంటి ఛాన్స్ ఎవ్వరికీ రాలేదు. అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. అయితే మెగాస్టార్ చిరంజీవి కి మాత్రం 2009 వ సంవత్సరం లో ఒక అవకాశం దక్కింది. ఆయన ముఖ్యమంత్రి అవుతాడని లక్షలాది మంది బలంగా నమ్మారు. ఆయన రాజకీయ అరంగేట్రం రాజకీయ పార్టీల గుండెల్లో గుబులు పుట్టించింది. అటు కాంగ్రెస్, ఇటు తెలుగు దేశం పార్టీల నుండి అత్యధిక శాతం మంది నాయకులు చిరంజీవి(Megastar Chiranjeevi) స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ(Prajarajyam Party) లో చేరారు. ఆ రెండు పార్టీలకు ఉన్నట్టుగా దశాబ్దాల తరబడి బలమైన నాయకత్వం ప్రజారాజ్యం పార్టీ కి లేదు. ఆ రెండు పార్టీలకు ఉన్నట్టుగా మీడియా సపోర్టు కూడా ఈ పార్టీ కి లేదు.
ఆరోజుల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి వేవ్ మామూలు రేంజ్ లో ఉండేది కాదు, మరో పక్క ‘మహాకూటమి’ ద్వారా తెలుగు దేశం, టీఆర్ఎస్, సిపిఐ, సీపీఎం పార్టీలు కలిసి పోటీ చేసాయి. జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ వంటి వారు సుడిగాలి పర్యటనలు చేసారు. ఇంత కఠినమైన ఎన్నికలు ఎదురైనప్పటికీ ‘ప్రజారాజ్యం’ పార్టీ తన సత్తా ని చాటింది. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కి కలిపి 18 శాతం ఓటు బ్యాంకు, 78 లక్షలకు పైగా ఓట్లు, 18 అసెంబ్లీ స్థానాలు ఆ పార్టీ కి వచ్చాయి. కేవలం ఆంధ్ర ప్రదేశ్ ప్రాంతం నుండే ఆ పార్టీ 21 శాతం కి పైగా ఓటు బ్యాంకు వచ్చిందంటే సాధారణమైన విషయం కాదు. అయితే ఎన్నికలు అయిపోయాక, సంవత్సరం పూర్తి కాగానే చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ని కాంగ్రెస్ పార్టీ లో విలీనం చేయడం అప్పట్లో సంచలనం గా మారింది.
వై ఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత అనేక ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి కూడా ఏర్పడింది. అలాంటి సమయంలో చిరంజీవి కాంగ్రెస్ కి మద్దతుగా నిలబడడమే కాకుండా, ఆ పార్టీ ని అందులో విలీనం చేసాడు. ఓపిక గా ఉండుంటే ఈరోజు ఆయన్ని ముఖ్యమంత్రి స్థానంలో కూడా మనం చూసేవాళ్ళం. కానీ పరిస్థితులు అలా ఏర్పడ్డాయి. విలీనం చేసిన తర్వాత కాంగ్రెస్ అధిష్టానం ఆయన్ని రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేస్తుందేమో అని అనుకున్నారు కానీ, కేంద్ర మంత్రిని చేసింది. అయితే ప్రజారాజ్యం వైఫల్యం వెనుక అల్లు అరవింద్(Allu Aravind) హస్తం ఉందని అప్పట్లో ప్రచారం జరిగేది. దీనిపై నాగబాబు(Nagababu) ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ప్రస్తావించాడు. ఆయన మాట్లాడుతూ ‘అల్లు అరవింద్ గారు ప్రజా రాజ్యం పార్టీ లో అన్నయ్య ఇచ్చిన ప్రతీ బాధ్యతను సమర్థవతంగా నిర్వహించాడు. ఆయన వల్ల పార్టీ విలీనం అయ్యింది అనే రూమర్ రావడం బాధాకరం. అల్లు అరవింద్ గారు గొప్ప వ్యాపారవేత్త. పార్టీ వైఫల్యం చెందడం వెనుక మా అందరి హస్తం ఉంది. ఒకరినే దానికి బాద్యుడిని చేయడం ముమ్మాటికీ తప్పు’ అంటూ చెప్పుకొచ్చాడు.