
Tollywood: చూస్తుండగానే 2021 కూడా ముగింపు దశకు వచ్చేసింది. కాలం మనసుకు తెలియకుండానే వేగంగా కరిగిపోతుందని ఓ కవి చెప్పినట్టు.. ప్రస్తుతం ఈ ఏడాది అప్పుడే చివరి దశకు చేరుకుంది. సినిమాల విషయానికి వస్తే.. కొన్ని సినిమాలకు ఈ ఏడాది పర్వాలేదు అనిపించినా.. ఎక్కువ సినిమాలకు మాత్రం కలిసి రాలేదు. దీనికి తోడు ఈ సంవత్సరంలో కూడా సగం రోజుల్ని కరోనానే లాగేసుకుంది.
కరోనా భయంతో టాలీవుడ్(Tollywood) కి థియేటర్ల సమస్య కొన్నాళ్ళు వెంటాడి ఇబ్బంది పెడితే.. ప్రస్తుతం ఏపీలో టికెట్ రేట్ల వ్యవహారం సినిమా వాళ్ళ మనసులను బాగా కలిచి వేస్తోంది. అన్నిటికి రేట్లు పెరుగుతున్నాయి. అలాగే వస్తువులతో పాటు ఉద్యోగుల వేతనాలు కూడా పెరుగుతున్నాయి. మరి సినిమా టికెట్ రేట్లు మాత్రం పెరగడానికి కుదరదు అనడం దారుణమే.
చివరకు పెద్ద సినిమాలు రావడానికి కూడా భయపడేలా చేసింది జగన్ ప్రభుత్వం. థియేటర్లు తెరచుకున్నాక, చిన్న సినిమాలే థియేటర్లకు ఆహరం అయ్యాయి. అయితే, రానున్న రెండు నెలల్లో మాత్రం భారీ సినిమాలు రిలీజ్ కు సిద్ధం అయ్యాయి. క్రేజ్ ఉన్న క్రేజీ సినిమాలు కాబట్టి.. వాటి పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా బాలయ్య ‘అఖండ’, బన్నీ పుష్ప, నాని శ్యాం సింగరాయ్ లాంటి పెద్ద సినిమాలు రేసులో ఉన్నాయి.
ఈ సినిమాల విజయాలు సినిమా ఇండస్ట్రీకి చాలా అవసరం. మొత్తమ్మీద 2021 టాలీవుడ్ క్యాలెండర్ ఫలితం కూడా ఈ మూడు సినిమాల ఫలితాల పైనే ఆధారపడి ఉంది. కరోనా రెండో సీజన్ తర్వాత వరుసగా వస్తోన్న పెద్ద సినిమాల జాతర ఇదే. కాబట్టి.. బరిలో నిలిచిన ఈ చిత్రాలను హిట్ చేయడానికి అభిమానులు కూడా బాగా ఉత్సాహం చూపిస్తున్నారు.
ఒకవేళ, ఆశించిన స్థాయిలో ఈ మూడు చిత్రాలు విజయాలు సాధించలేకపోతే 2021 సినిమా వాళ్లకు బాధాకరంగానే ముగుస్తోంది. మరి 2021 ముగింపు బాలయ్య, బన్నీ, నానిల పైనే ఉంది. పైగా ఈ ముగ్గురు సినిమాల తర్వాత వచ్చేది సంక్రాంతి సీజన్. సంక్రాంతికి ఏ రేంజ్ సినిమాలు వస్తున్నాయో తెలిసిందే. కాబట్టి.. ఆ సినిమాలకు ఊపు రావాలంటే ఈ సినిమాలు ఒక ఊపు ఊపాల్సిందే.
Also Read: బన్నీకి కుడి భుజం సరిగా పనిచేయదు !