Tollywood shootings closed : కరోనా తర్వాత ప్రేక్షకుల అభిరుచి మారింది. జనాలు ఓటీటీలకు అలవాటుపడ్డారు. ఇక పెద్ద సినిమాలకు కలెక్షన్ల కోసం టికెట్ల రేట్లు పెంచారు. ప్రభుత్వాలను అభ్యర్థించారు. వాళ్లు సహకరించారు. దీంతో థియేటర్ కు వెళ్లడం ఇప్పుడు ప్రజలకు పెనుభారమైంది. రాజమౌళి లాంటి దర్శకులు, టాలీవుడ్ అగ్రహీరోల సినిమాలకు తప్పితే.. అదీ హిట్ టాక్ వస్తేనే జనాలు థియేటర్లకు వస్తున్నారు. ఈ పరిణామంతో మొత్తంగా సినిమా పరిశ్రమనే కుదేలైంది.

ఇప్పుడు టికెట్లు రేట్లు తగ్గించినా కూడా ప్రేక్షకుడు థియేటర్ కు రావడం లేదు. థియేటర్లో సైకిల్ స్టాండ్ నుంచి తినే ఆహారం వరకూ మరీ ఖరీదుగా మారింది. ఒక కుటుంబం మొత్తం కలిసి సినిమాకు వస్తే వారి జీతంలో పావుల వంతు ఖర్చైపోతున్న పరిస్థితి నెలకొంది. అందుకే ప్రేక్షకుడు మంచి సినిమాలకు తప్పితే యావరేజ్, మామూలు హీరోల సినిమాలకు థియేటర్ కు రావడం లేదు.ఓటీటీలు మంచి కంటెంట్ తో రావడంతో జనాలు థియేటర్ వైపే చూడడం లేదు. ఎలాగూ నెల తర్వాత థియేటర్లోని సినిమా ఓటీటీలో రావడంతో ఇక దాన్ని ఎవరూ చూడడం లేదు.
వీటికి తోడు.. హీరోల రెమ్యూనరేషన్లు, ఆర్టిస్టుల వ్యయాలు, బడ్జెట్ మించిపోయి సినిమా అనేది ఇప్పుడు పెనుభారమైపోయింది. నిర్మాతలు తమతో కాదని షూటింగ్ లు బంద్ పెట్టిన పరిస్థితి నెలకొంది. దీనంతటికి కారణం ఏంటో తాజాగా బడా నిర్మాత అశ్వినీదత్ బయటపెట్టారు.
సినిమాలపై ప్రేక్షకుల్లో విరక్తి కలిగిందని.. వారిని థియేటర్ కు రప్పించడం ఇప్పుడొక సవాల్ గా మారిందని ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు రాష్ట్రాల సీఎంల వద్దకు వెళ్లి టికెట్ ధరలు పెంచుకోవడమే ప్రస్తుత పరిస్థితికి కారణమని అశ్వినీదత్ అన్నారు. తన బ్యానర్ లో నిర్మించిన ‘సీతారామం’ సినిమా ప్రమోషన్ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
సినిమా టికెట్ల ధరలు పెంచి.. మరోసారి తగ్గించడం వల్లే సినిమాపై ప్రేక్షకుల్లో విరక్తి కలిగిందని నిర్మాత అశ్వినీదత్ కుండబద్దలు కొట్టారు. నాడు నిర్మాతలు టికెట్ ధరలు పెంచిన వాళ్లే ఇప్పుడు ‘షూటింగ్స్ బంద్’ అని ఆందోళన చేస్తున్నారని.. దీనికి నిర్మాతల తీరే కారణమని అన్నారు. ధరలు పెంచకముందే ఒక సెక్షన్ ప్రజలు థియేటర్ కు రాలేదని.. ఇప్పుడు మరింతగా దిగజారి ఎవరూ రావడం లేదన్నారు. హీరోల రెమ్యూనరేషన్లు కారణం కాదని.. వారివల్లే టికెట్లు పెంచలేదన్నారు. ఇక గతంలో సమస్యలు వస్తే ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి హీరోలు రాలేదనని.. నిర్మాతలే పరిష్కరించేవారని.. కానీ ప్రస్తుత నిర్మాతల్లో స్థిరత్వం లేదంటూ అశ్వినీదత్ తెలిపారు.
మొత్తంగా ప్రేక్షకుడు థియేటర్ కు రాకపోవడానికి టాలీవుడ్ నే కారణం. వారు చేసిన పొరపాట్లే ఈ దుస్థితికి కారణం. అశ్వినీదత్ కూడా ఇదే చెప్పారు. చేసుకున్నవారికి చేసుకున్నంత అన్నట్టుగా సినీ పరిశ్రమ ఇలా దిగజారడానికి వారి చర్యలే కారణంగా చెప్పొచ్చు.
[…] […]
[…] […]