Kaikala Satyanarayana: ఎస్వీ రంగారావు 57 ఏళ్ల వయసులో గుండెపోటుతో మరణించారు. ఆయన హఠాన్మరణం తెలుగు చిత్ర సీమకు తీరని లోటు అయ్యింది. నటనలో లెజెండ్ గా పేరు తెచ్చుకున్న ఎస్వీఆర్ గంభీరమైన పాత్రలకు పెట్టింది పేరు. ఏ పాత్రనైనా ఆయన అవలీలగా పోషించే వారు. మాయాబజార్ మూవీలో ఆయన చేసిన ఘటోత్కచుడు పాత్రలో మరో నటుడుని ఊహించుకోలేము. రావణాసుర, భక్త ప్రహ్లాద పాత్రల్లో ఆయన చూపించిన రాజసం, విలనిజం వెలకట్టలేనివి. ఎస్వీఆర్ కన్నుమూశాక ఆ తరహా పాత్రలకు కైకాల సత్యనారాయణ దిక్కు అయ్యారు.

1974లో ఎస్వీఆర్ మరణించారు. అప్పుడే కైకాల నటుడిగా పరిశ్రమలో నిలదొక్కుకుంటున్నాడు. ఎస్వీఆర్ కి ప్రత్యామ్నాయంగా కైకాల సత్యనారాయణను పరిశ్రమ చూసింది. దర్శక నిర్మాతలకు ఆయన బెస్ట్ ఛాయిస్ అయ్యారు. ఆ విధంగా ఎస్వీఆర్ లేని లోటు తీర్చిన నటుడిగా కైకాల సత్యనారాయణను చెప్పుకోవచ్చు. కరుడుగట్టిన విలన్ పాత్రల్లో కైకాల నటన అద్భుతం. ఆ రోజుల్లో వెండితెర విలన్ అంటే ప్రేక్షకుల్లో నిజంగానే నెగిటివ్ భావన ఉండేవి. ఒకటి రెండు పబ్లిక్ వేదికల్లో కైకాల ఆడవాళ్లతో తిట్లు తిన్నారట.
ఒక దశకు వచ్చాక కైకాల సత్యనారాయణ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా సెటిల్ అయ్యారు. ఏకంగా నాలుగు తరాల హీరోలతో నటించిన ఘనత కైకాల సొంతం. ఎన్టీఆర్,కృష్ణ, చిరంజీవి, మహేష్ ఇలా నాలుగు తరాల స్టార్స్ ని ఆయన కవర్ చేశారు. కైకాలకు పరిశ్రమలో సౌమ్యుడిగా పేరుంది. అయితే ఎన్టీఆర్ కి వ్యతిరేకంగా కృష్ణ తెరకెక్కించిన నా పిలుపే ప్రభంజనం మూవీలో సీఎం గా విలన్ రోల్ చేశారు కైకాల. ఆయన టీడీపీ పార్టీలో కొన్నాళ్లు కొనసాగారు.

కైకాల పాత్రలు, సినిమాలు తెలుగు సినిమా ఉన్నంత కాలం ఉంటాయి. తరతరాలు ఆయన గురించి మాట్లాడుకుంటారు. వెండితెర యముడు అంటే కైకాలనే. యమగోల చిత్రంతో ఆ పాత్రకు బెంచ్ మార్క్ సెట్ చేసిన కైకాల తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు. 87ఏళ్ల కైకాల సత్యనారాయణ చాలా కాలంగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఏడాది కాలంగా ఆయన మంచానికే పరిమితం అయ్యారు. ఇంట్లోనే ఆయనకు చికిత్స అందిస్తున్నారు. 2019లో విడుదలైన మహర్షి ఆయన చివరి చిత్రం. నేడు ఉదయం ఆయన కన్నుమూశారు.