Thandel Movie: సినిమా అనేది కేవలం ఒక్క మనిషి కష్టం కాదు, ఎన్నో వందల మంది నెలల తరబడి ఎండల్లో, వానల్లో వందల కోట్ల రూపాయిలు ఖర్చు పెట్టి తీస్తుంటారు. అలాంటి సినిమాని ఒకప్పుడు పైరసీ భూతం ఎలా వణికించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆ తర్వాత ఓటీటీ వచ్చాక పైరసీ తగ్గింది. కానీ ఇప్పుడు మళ్ళీ హెచ్చు మీరింది. రీసెంట్ గా విడుదల అవుతున్న సినిమాలు HD ప్రింట్ ఆన్లైన్ లోకి వచ్చేస్తున్నాయి. ‘గేమ్ చేంజర్’ చిత్రం నుండి ఇలా జరుగుతుంది. ఒకప్పుడు పైరసీ ఇంత దారుణంగా ఉండేది కాదు. థియేటర్ లో రికార్డు చేసిన ప్రింట్ మాత్రమే అందుబాటులో ఉండేది. వాటిని ఆడియన్స్ చూసేందుకు పెద్దగా ఆసక్తి చూపించరు. కానీ ఇప్పుడు జరుగుతున్న పైరసీ మాత్రం దారుణం అనే చెప్పాలి. HD క్వాలిటీ తో సినిమా బయటకి వచ్చేస్తే ఇక జనాలు థియేటర్ కి వెళ్లి ఎందుకు చూస్తారు?.
థియేటర్ కి వెళ్లి సినిమా చూడాలంటే కనీసం మూడు నుండి నాలుగు గంటల సమయం పడుతుంది. అంత సమయం వెచ్చించే ఓపిక లేక ఇలాంటి HD ప్రింట్ వచ్చినప్పుడు ఆడియన్స్ ఇంట్లోనే కూర్చొని చూసేస్తున్నారు. రీసెంట్ గా విడుదలైన సూపర్ హిట్ టాక్ తో థియేటర్స్ లో విజయవంతంగా నడుస్తున్న ‘తండేల్’ చిత్రానికి కూడా అదే జరిగింది. ఈ సినిమాకి సంబంధించిన HD ప్రింట్ ఆన్లైన్ లో లీక్ అవ్వగా, దీని పై ఆ చిత్ర నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ ‘తండేల్ చిత్రాన్ని పైరసీ చేసిన వాళ్ళను, అదే విధంగా ఆ సినిమాని డౌన్లోడ్ చేసిన వాళ్ళను ఊరికే వదిలి పెట్టము. గీత గోవిందం సమయంలో కూడా ఇలాగే చేసారు. వాళ్ళు అరెస్ట్ అయ్యి జైలు జీవితాన్ని గడిపి ఇప్పుడిప్పుడే బయటకి వస్తున్నారు. మళ్ళీ అలాంటి పరిస్థితి కల్పిస్తాము..’ అంటూ చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు.
ప్రస్తుతం సినిమా సక్సెస్ మూడ్ లో ఉన్నామని, మూడు రోజుల తర్వాత పైరసీ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం మొదలు పెడుతామని, పైరసీ లో ఎవరైనా సినిమా చూస్తూ నాకు కనిపిస్తే కచ్చితంగా వాళ్లపై కేసులు వేస్తానని చెప్పుకొచ్చాడు బన్నీ వాసు. ఇంతకు ఈ సినిమాల HD ప్రింట్ ఎలా బయటకి వస్తుంది?, ఎడిటింగ్ రూమ్ నుండి లీక్ అవుతున్నాయా?, లేకపోతే థియేటర్ లో క్యూబ్ లో అప్లోడ్ అయ్యినప్పుడు రికార్డు చేసి ఆన్లైన్ లో పెడుతున్నారా..?, దీనిని నిర్మాతలు వెంటనే పసిగట్టి కఠినమైన చర్యలు తీసుకోకుంటే భవిష్యత్తులో ఘోరమైన నష్టాలను చూడాల్సి ఉంటుంది. త్వరలోనే పవన్ కళ్యాణ్ నటించిన భారీ బడ్జెట్ పీరియడ్ చిత్రం ‘హరి హర వీరమల్లు’ మన ముందుకు రాబోతుంది. ఈ రేంజ్ స్పన్ ఉన్న సినిమాలు HD ప్రింట్ లో అందుబాటులోకి వస్తే నిర్మాతలు వందల కోట్ల రూపాయిలు నష్టపోయే అవకాశాలు ఉంటాయి.