కరోనా ఫస్ట్ వేవ్ లో సినిమా ఇండస్ట్రీపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. కానీ.. ఇప్పుడు సినీ పరిశ్రమే స్వయంగా ఆంక్షలు ప్రకటించుకుంది! ఇది చాలు.. సెకండ్ వేవ్ ఎఫెక్ట్ చిత్ర పరిశ్రమపై ఏ స్థాయిలో పడిందో చెప్పడానికి. ఇప్పటికే థియేటర్లు మూసేశారు. షూటింగులు కూడా ఒకటి తర్వాత ఒకటి అన్నట్టుగా వాయిదా పడుతున్నాయి. ఈ పరిస్థితి ఎందాక పోతుంది? ఎన్నాళ్ల వరకు ఉంటుంది? దీనివల్ల కలిగి నష్టం ఎంత? ఇవే ఇప్పుడు ఇండస్ట్రీ వేసుకుంటున్న లెక్కలు!
జనవరి నుంచి ఒక్కొక్కటి సినిమాలు రావడం మొదలై.. ఫిబ్రవరి నాటికి ఊపందుకోవడంతో.. ఇక, అంతా సెట్టైపోయినట్టే అనుకున్నారు. వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి వచ్చేయడంతో.. ఇక, కరోనా పీడ విరగనట్టైనేనని సంబరపడ్డారు. ఇక సినిమా కష్టాలు తీరిపోయినట్టేనని భావించారు. కానీ.. మూణ్నెల్ల ముచ్చటగానే తయారైంది పరిస్థితి. సరిగ్గా మూడు మాసాలు సినిమాలు ఆడాయో లేదో.. ఏప్రిల్ నాటికి సెకండ్ ఉధృతి రానేవచ్చింది.
సమ్మర్ సీజన్ ను ఎంచుకున్న పెద్ద చిత్రాలన్నీ ఏప్రిల్ నుంచి వరుసకట్టాయి. ఏప్రిల్ 9న వకీల్ సాబ్ అరంగేట్రం తర్వాత.. మిగిలిన సినిమాలు కూడా రిలీజ్ కు ఏర్పాట్లు చేసుకోవడం మొదలు పెట్టాయి. ఏప్రిల్ లో మీడియం రేంజ్ సినిమాలు నాలుగైదు విడుదల కావాల్సి ఉండగా.. వెనక్కు వెళ్లిపోయాయి. ఇక, మేలో ఆచార్య, అఖండ, ఆ తర్వాత రాధేశ్యామ్, కేజీఎఫ్, పుష్ప వంటి చిత్రాలు ఉన్నాయి. దాదాపు వంద కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రాలివి.
ఇలాంటి సినిమాల విడుదల ఎన్ని రోజులు వాయిదా పడితే.. నిర్మాతలకు అంత నష్టం కలుగుతున్నట్టే. సినిమాల కోసం కోట్లాది రూపాయల ఫైనాన్స్ తెచ్చుకుంటారు. ఇవన్నీ విడుదల సమయంలో జరిగే ప్రీ-రిలీజ్ బిజినెస్ తో తిరిగి చెల్లిస్తుంటారు. మిగిలినవి ఏవైనా ఉంటే.. కలెక్షన్స్ తర్వాత సెట్ చేస్తారు. అయితే.. సినిమా విడుదల ఏకధాటిగా వాయిదా పడుతూపోతే.. తెచ్చిన అప్పులకు వడ్డీ కుప్పలు తెప్పలుగా పెరిగిపోతూ ఉంటుంది.
ఇప్పుడు.. ఈ పెద్ద చిత్రాలు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఈ చిత్రాలన్నీ కరోనా మొదటి దశకు ముందే మొదలయ్యాయి. కరోనా ఎఫెక్ట్ లేకపోతే.. గతేడాదే ఈ సినిమాలన్నీ రిలీజ్ కావాల్సి ఉంది. కానీ.. లాక్ డౌన్ ప్రకటించడంతో దాదాపు ఏడాది కాలం వృథాగాపోయింది. ఆ మేరకు ఖర్చుచేసిన మొత్తంపై వడ్డీ పెరిగినట్టే లెక్క. ఆ తర్వాత షూటింగులు మొదలై, సినిమాలు చివరి దశకు చేరుకుంటున్న తరుణంలో మరోసారి కొవిడ్ విజృంభించడంతో షూటింగులు ఆపేయాల్సిన పరిస్థితి వచ్చింది.
దీంతో.. ఇప్పటికే పెరిగిన వడ్డీలకు బారు, చక్రవడ్డీలు కూడా కలుపుకోవాల్సి వస్తోంది. ఈ పరిస్థితి ఎన్నాళ్లు కొనసాగుతుందో తెలియదు. పరిస్థితులు చక్కబడిన తర్వాత జనాలు థియేటర్లకు రావడానికి మళ్లీ ఎంత కాలం పడుతుందో చెప్పలేం. ఆక్యుపెన్సీ ఎంత ఉంటుందో తెలియదు. ఇన్ని పరిస్థితులను అధిగమించి, సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలి. భారీగా కలెక్షన్లు కొల్లగొడితే తప్ప.. లాభాల సంగతి అటుంచి, నష్టాలు తీరే పరిస్థితి కనిపించట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో పెద్ద సినిమాలు టైటానిక్ ట్రాజెడీని ఫేస్ చేయాల్సి వస్తోందని అంటున్నారు.