
టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వ్యవహారం ఎలా ఉందో అందరికీ తెలిసిందే. అహం, అధిపత్యం రాజ్యమేలుతున్న ఇండస్ట్రీలో.. ఎవరికి వారు తమదే పై చేయి కావాలని పడుతున్న తాపత్రయం అంతా ఇంతా కాదు. ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్న తీరు.. మీడియా ముందుకు వచ్చి రచ్చ చేస్తున్న పద్ధతి చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ కూడా ఇదే విధమైన అభిప్రాయం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది.
కొందరు సినీ మీడియా ప్రతినిధులు మంత్రి తలసాని శ్రీనివాస్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు విషయాలు మాట్లాడుతుండగా మధ్యలో ‘మా’ గొడవ కూడా చర్చలోకి వచ్చిందట. దీనిపై మంత్రి స్పందిస్తూ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. కనీసం వెయ్యి మంది కూడా లేని మూవీ ఆర్టిస్టు అసోసియేషన్లో ఇన్ని రాజకీయాలా? అని ఆశ్చర్యం వ్యక్తంచేశారట. అదే సమయంలో ఆగ్రహం కూడా వ్యక్తం చేశారని తెలుస్తోంది.
మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ భవన నిర్మాణం విషయమై స్పందిస్తూ.. ఇండస్ట్రీలో వందలు, వేల కోట్లకు పడగలెత్తిన వారు ఉన్నారని, వారంతా తలో చెయ్యి వేస్తే.. అది సమస్యే కాదని అన్నారట. దీంతో.. ‘మా’ బిల్డింగ్ కోసం సర్కారు స్థలం కేటాయించడం ఇప్పట్లో జరిగేట్టు కనిపించట్లేదని అంటున్నారు.
ఇదిలాఉంటే.. మా సంస్థలో రాజకీయాలు ఓ రేంజ్ లో సాగుతున్నాయని అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్దలు చెబితే వినే పరిస్థితుల్లో కూడా ఎవరూ ఉన్నట్టు కనిపించట్లేదు. ఎన్నికల ఊసే లేకుండా.. ఎవరికి వారు పోటీలో ఉన్నట్టు ప్రకటించుకోవడమే పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో మా బిల్డింగ్ గురించి చేస్తున్న ప్రకటనలు, ఇస్తున్న హామీలు కూడా సాధారణ రాజకీయ నేతలకు ఏ మాత్రం తీసిపోకుండా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి, మంత్రి తలసాని వ్యాఖ్యల నేపథ్యంలో ఇప్పటికైనా పద్ధతి మార్చుకుంటారో? లేదంటే.. అదే రచ్చ కొనసాగిస్తారో చూడాలి.