Allu Arjun Arrested: కేటీఆర్ ట్వీట్ చేసిన కొద్దిసేపటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. అక్కడ విలేకరులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసినప్పుడు.. అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారాన్ని ప్రస్తావించినప్పుడు..”అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారంలో చట్టం తన పని తాను చేసుకుపోయింది. కేసు దర్యాప్తులో నా జోక్యం ఉండదు. తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోవడం.. ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడటంతో పోలీసులు ఆ విధంగా చర్యలు తీసుకొని ఉంటారు. ఇందులో నేను ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేదు. అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసే కంటే ముందు పోలీసులు నోటీసులు ఇచ్చారు. నోటీసు ఇచ్చిన తర్వాతే ఆయనను అరెస్టు చేశారు. ఇందులో కుట్ర కోణం అనే మాటకు తావులేదు. ఆ లెక్కకొస్తే ప్రభుత్వం పుష్ప సినిమా టికెట్ ధరలను పెంచడానికి అనుమతి ఇవ్వదు కదా.. సినిమా పరిశ్రమను బాగు చేయాలనే ఉద్దేశంతోనే టికెట్ ధరలను పెంచడానికి అనుమతి ఇచ్చాం. ఆ విషయాన్ని మీరు గుర్తించాలి. అంతేతప్ప ఇష్టానుసారంగా విమర్శలు చేయొద్దు. ముఖ్యమంత్రిగా ఈ కేసులో నా ప్రమేయం లేదు. పోలీసులు తమ నిబంధనలకు అనుగుణంగానే నడుచుకుంటున్నారు. ఇందులో వారిని తప్పుపట్టాల్సిన అవసరం లేదని” రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.. రేవంత్ రెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో అల్లు అర్జున్ వెనుక కుట్ర కోణం లేదని తెలుస్తోంది..
తెరపైకి సరికొత్త చర్చ
వాస్తవానికి తెలుగు రాష్ట్రాలలో పెద్ద హీరోల సినిమా విడుదల వేడుకలు.. విజయోత్సవ సంబరాల సమయంలో తొక్కిసలాటలు జరుగుతుంటాయి. అభిమానులు చనిపోతూనే ఉంటారు. ఈ ఘటనల సమయంలో గతంలో కేసులు నమోదు కాలేదు. పోలీసులు పెద్దగా చర్యలు తీసుకోలేదు. కానీ ఈసారి అల్లు అర్జున్ పై మాత్రం కేసు నమోదయింది. పుష్ప సినిమా ప్రీ రిలీజ్ సమయంలో హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ చనిపోయింది. అతని కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం అతడు అపస్మారక స్థితిలో ఉన్నాడు. కొద్దిరోజులుగా హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో రేవతి భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఆ తర్వాత అతడికి నోటీసులు జారీ చేశారు. ఈరోజు ఉదయం అల్లు అర్జున్ నివాసానికి వెళ్లి అరెస్ట్ చేస్తున్నామని ప్రకటించి.. భారీ బందోబస్తు మధ్య చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. అక్కడ అతడి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఆ తర్వాత వైద్య పరీక్షలు నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచారు. అయితే ఇటీవల పుష్ప సినిమా సక్సెస్ మీట్ లో అల్లు అర్జున్ మాట్లాడారు. టికెట్ ధరలు పెంచినందుకు తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు చెప్పడం ఆయన మర్చిపోయారు. దీంతో అల్లు అర్జున్ పై కాంగ్రెస్ నాయకుల విమర్శలు చేశారు. సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్ వ్యవహార శైలిని దుయ్యబట్టారు. “పుష్ప టిక్కెట్ రేట్లను తెలంగాణ ప్రభుత్వం పెంచేసింది. ప్రీ రిలీజ్ కు కూడా బందోబస్తు ఏర్పాటు చేసింది. అయినప్పటికీ ఏమాత్రం కృతజ్ఞత లేకుండా వ్యవహరిస్తున్నావ్. ఇది సరైన పద్ధతి కాదు. తెలంగాణలో ఉంటూ.. తెలంగాణ ముఖ్యమంత్రి పేరు తెలియదా.. అంత పొగరా? అంతకండ కావరమా” అంటూ కాంగ్రెస్ నాయకులు సోషల్ మీడియా వేదికగా విమర్శించారు. ఇది జరిగిన కొద్ది రోజులకే అల్లు అర్జున్ అరెస్ట్ కావడం విశేషం. దీని వెనుక తన ప్రమేయం లేదని రేవంత్ రెడ్డి చెప్పినప్పటికీ.. ముంజేతి కంకణానికి అద్దం అవసరం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.