Tandel : నాగ చైతన్య, సాయి పల్లవి కాంబినేషన్ లో చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ‘తండేల్’ చిత్రం ఇటీవలే షూటింగ్ కార్యక్రమాలను మొత్తం పూర్తి చేసుకొని, మూవీ టీం ప్రొమోషన్స్ లో ఫుల్ బిజీ గా మారిన సంగతి తెలిసిందే. పాటలు ఇప్పటికే బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి, మొన్న విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ కి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దేశభక్తిని జోడించిన అద్భుతమైన ప్రేమకథ గా ఈ ట్రైలర్ ని చూసినప్పుడు ప్రేక్షకులకు అనిపించింది. సముద్రం లో వేటకు వెళ్లిన తన వాళ్ళు తిరిగి రాకపోవడంతో, వాళ్ళ కోసం గుజరాత్ కి పయనమైన హీరో నాగ చైతన్య, మధ్యలో పాకిస్తాన్ నేవీకి చిక్కి ఎన్ని చిత్రహింసలకు గురి అయ్యాడో, తిరిగి తన దేశానికీ చేరుకున్నాడా లేదా అనే అంశాలను హృదయానికి హత్తుకునేలా ఈ చిత్రాన్ని తీసినట్టు ట్రైలర్ ని చూస్తేనే అర్థమవుతుంది.
నేడు ఈ సినిమాకి సంబంధించిన ప్రొమోషన్స్ కోసం మూవీ టీం తమిళనాడు కి వెళ్ళింది. టీం మొత్తం తమిళనాడు లో ఉండగానే సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి. సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి UA సర్టిఫికేట్ ని జారీ చేసారు. సున్నితమైన అంశాలతో తెరకెక్కిన సినిమా కావడంతో సెన్సార్ బోర్డు అనేక కట్స్ పెడుతుందని అందరూ అనుకున్నారు కానీ, కేవలం 5 సన్నివేశాల్లో మాత్రమే కట్స్ విధించినట్టు తెలుస్తుంది. కొన్ని చోట్ల మ్యూట్ కూడా చేశారట. ఇక ఈ సినిమా ఎలా ఉంది అనే విషయానికి వస్తే, ఎదో ఎమోషనల్ సినిమా తీసాము, జనాలు బలవంతంగా ఆ ఎమోషన్ ని ఫీల్ అవ్వాలి అనే విధంగా ఈమధ్య కొన్ని సినిమాలు వస్తున్నాయని, కానీ ‘తండేల్’ చిత్రాన్ని చూసిన తర్వాత చాలా కాలానికి ఒక భావోద్వేగ పూరితమైన సినిమాని చూసిన అనుభూతి కలిగిందని, కచ్చితంగా ఈ చిత్రం ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందని, బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లను కొల్లగొడుతుందని బల్ల గుద్ది మరీ మూవీ టీం కి చెప్పారట సెన్సార్ సభ్యులు.
కథ, కథనం, పాటలు, స్క్రీన్ ప్లే, ఇలా ప్రతీ ఒక్కటి కూడా అద్భుతంగా కుదిరాయని, ఈమధ్య కాలం లో ఇలాంటి సినిమాలు రావడం చాలా అరుదని మూవీ టీం ని పొగడ్తలతో ముంచి ఎత్తారట. సాయి పల్లవి, నాగ చైతన్య నటన కూడా అద్భుతంగా ఉందని, సినిమాటోగ్రఫీ కూడా చాలా రిచ్ గా ఉందని చెప్పారట. ట్రైలర్ ని చూసిన తర్వాత అందరికీ అనిపించింది ఒక్కటే, సినిమా స్టోరీ బలంగానే ఉంది కానీ, హీరో హీరోయిన్లకు శ్రీకాకుళం యాస సరిగా రాలేదు, వీళ్ళిద్దరే సినిమాకి మైనస్ అయ్యేలా ఉన్నారంటూ కామెంట్స్ చేసారు. కానీ సినిమా చూస్తే అలా అనిపించదట. ఇద్దరు కూడా తమ పాత్రల్లో జీవించేశారని, వాళ్ళ కెరీర్ లోనే ది బెస్ట్ గా నిలుస్తుందని సెన్సార్ నుండి వినిపిస్తున్న టాక్. మరి ఆడియన్స్ నుండి కూడా ఇలాంటి రియాక్షన్ వస్తుందా లేదా అనేది తెలియాలంటే ఫిబ్రవరి 7 వరకు ఆగాల్సిందే.