Tandel Movie : అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి కాంబినేషన్ లో తెరకెక్కిన ‘తండేల్’ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. నాగ చైతన్య కి గతంలో ఏ సినిమాకి కూడా ఈ చిత్రానికి ఉన్నంత హైప్ రాలేదు. కారణం ఇది ఒక యదార్ధ సంఘటనలను ఆధారంగా తీసుకొని తెరకెక్కించిన సినిమా కావడం, అదే విధంగా పాటలు, ట్రైలర్ పెద్ద హిట్ అవ్వడమే. సుమారుగా 80 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో నిర్మాత అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. ‘మగధీర’, ‘బద్రీనాథ్’ వంటి చిత్రాల తర్వాత ఆయన భారీ బడ్జెట్ తో తీసిన చిత్రమిదే. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అన్ని ప్రాంతాల్లో మొదలయ్యాయి. కేవలం బుక్ మై షో నుండి ఈ చిత్రానికి ఇప్పటి వరకు 50 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి. ఇది ఇలా ఉండగా దుబాయి లో ఈ సినిమాకి సంబంధించిన ప్రీమియర్ షోని కాసేపటి క్రితమే ప్రదర్శించారు.
అక్కడి బయ్యర్స్ తో పాటు పలువురు ముఖ్య ప్రముఖులు ఈ ప్రీమియర్ షోలో పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని చూసిన తర్వాత వాళ్ళు చెప్పిన టాక్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఫస్ట్ హాఫ్ డైరెక్టర్ చందు మొండేటి హీరో హీరోయిన్ల మధ్య తీసిన లవ్ సీన్స్ రెగ్యులర్ లవ్ స్టోరీస్ కి భిన్నంగా ఉందని, చాలా ఎంగేజింగ్ గా తీసారని ఆయన చెప్పుకొచ్చాడు. ఇక సెకండ్ హాఫ్ అయితే అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించారని, ఇంత ఎమోషనల్ కనెక్ట్ ఉన్న సినిమా ఈమధ్య కాలం లో రాలేదని చెప్తున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ ఊహించని విధంగా ఉందని, ఈ ట్విస్ట్ కి ఆడియన్స్ కనెక్ట్ అయితే బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల సునామీని చూడొచ్చు అంటూ చెప్పుకొచ్చారు.
మరి దుబాయి ప్రీమియర్ షో నుండి వచ్చిన టాక్, ఇక్కడి ఆడియన్స్ నుండి కూడా వస్తుందా లేదా అనేది తెలియాలంటే ఎల్లుండి వరకు ఆగాల్సిందే . ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా 40 కోట్ల రూపాయలకు జరిగింది. నెల్లూరు, సీడెడ్ మినహా, దాదాపుగా అన్ని ప్రాంతాల్లో సొంతంగానే రిలీజ్ చేసుకుంటున్నారు. ఓవర్సీస్ లో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే రెండు మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు రావాలి. అందులో నార్త్ అమెరికా నుండి 1.4 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు రావాలి. ప్రస్తుతానికి అడ్వాన్స్ బుకింగ్స్ కేవలం లక్ష డాలర్లకు మాత్రమే జరిగింది. పాజిటివ్ టాక్ వస్తే మూడు లక్షల డాలర్ల వరకు వెళ్లొచ్చు. ఇక ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లో ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే 10 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి.