కళకు సరిహద్దుల్లేవ్. కళాకారుడికీ ఏ హద్దుల్లేవ్. ఏ నటుడు ఏ భాషలోనైనా నటించొచ్చు.. ఏ ఇండస్ట్రీలోనైనా పాదం మోపొచ్చు. కానీ.. ఒకేఒక ప్రధాన సమస్య ఉంటుంది. అదే మార్కెట్. ప్రతీ ఇండస్ట్రీలో అక్కడి స్టార్లు ఉంటారు. వారితో పోల్చినప్పుడు.. ఇతర పరిశ్రమలకు చెందిన వారికి తక్కువగానే మార్కెట్ ఉంటుంది. కానీ.. సరైన హిట్లు రెండు, మూడు పడితే చాలు. క్రమంగా వారి మార్కెట్ కు జోరందుకుంటుంది. ఇప్పుడు ఇదే ఫార్ములాతో తెలుగు ఇండస్ట్రీలో జెండా పాతేందుకు సిద్ధమవుతున్నారు తమిళ స్టార్లు.
తమిళ టాప్ హీరోలుగా ఉన్న సూర్య, విజయ్, విశాల్ వంటి వారికి తెలుగులో ఓ మోస్తరు మార్కెట్ ఉంది. రజనీకాంత్ ది స్పెషల్ కేటగిరీ. ఆయన మినహా.. మిగిలిన వారికి ఓ స్థాయి మార్కెట్ ఉంది. మొన్న విడుదలైన విజయ్ ‘మాస్టర్’ మంచి కలెక్షన్సే సాధించింది. సూర్య, విశాల్ వంటి వారి మూవీస్ కూడా విషయం ఉంటే ఆడుతూనే ఉన్నాయి. అయితే.. పాన్ ఇండియా సినిమాల విస్తృతి పెరిగిన తర్వాత.. సౌత్ హీరోలంతా మార్కెట్ ను పెంచుకునే పనిలోపడ్డారు. ఇందులో భాగంగానే.. తమిళ తంబీలు టాలీవుడ్ కు పయనమవుతున్నారు.
తెలుగులో విజయ్, ధనుష్ స్ట్రయిట్ సినిమాల ప్రకటనలు వచ్చేశాయి. ఇక, సూర్య సినిమా అనేది ఎప్పటి నుంచో ప్రచారంలో ఉంది. అది త్వరలో సాధ్యమవుతుందేమో చూడాలి. అటు విశాల్ కూడా డైరెక్ట్ మూవీ చేయాలని, చేస్తానని చెబుతూనే ఉన్నాడు. ఇలా ఒకరి తర్వాత ఒకరుగా కోలీవుడ్ ను దాటి ఇతర ఇండస్ట్రీలకు వెళ్తున్నారు. వాళ్లు రావాలని చూస్తుండడం ఒకెత్తయితే.. ఇక్కడ అవకాశాలూ కూడా పుష్కలంగా కనిపిస్తుండడం మరో ఎత్తు.
తెలుగులో స్టార్ హీరోల సినిమాలు ఏడాదికి ఒకటికి మంచి రావట్లేదు. మీడియం హీరోలు రెండు దించుతున్నా.. సక్సెస్ విషయం తేడా కొడుతోంది. దీంతో.. భారీగా ఉన్న బ్యానర్లు తమ వంతు వచ్చేదాకా వెయిట్ చేయాల్సి పరిస్థితి. వాళ్లు పెద్ద హీరోలతో ఏడాదికి ఒక్క సినిమా కూడా చేయలేకపోతున్నారు. డైరెక్టర్ల పరిస్థితి కూడా ఇదేవిధంగా ఉంది. వీళ్లు కూడా ఏడాదికి మించి సినిమా చేయలేకపోతున్నారు. ఉదాహరణకు వంశీ పైడిపల్లిని తీసుకుంటే.. అప్పుడెప్పడో వచ్చిన మహర్షి తర్వాత ఇప్పటి వరకూ సినిమా చేయలేకపోయాడు. ఇలాంటి దర్శకులు చాలా మందే ఉన్నారు.
ఈ విధంగా అటు నిర్మాతలు, ఇటు దర్శకులు సిద్ధంగా ఉన్నా.. హీరోలే అందుబాటులో ఉండట్లేదు. ఇలాంటి పరిస్థితి కూడా కోలీవుడ్ స్టార్లు టాలీవుడ్ కు రావడానికి అవకాశం ఇస్తున్నాయి. ఇలాంటి పరిస్థితి కూడా ఒకందుకు మంచిదే. తెలుగు సినిమా స్థాయి మరింతగా పెరగడంతోపాటు.. మార్కెట్ విస్తృతి కూడా పెరుగుతుంది. ఇటు నిర్మాతలకు, అటు దర్శకులతోపాటు టెక్నీషియన్లకు అవకాశాలు పెరుగుతాయి. మన తెలుగు హీరోలు కూడా పాన్ ఇండియా సినిమాలతో ఇతర భాషల్లో మార్కెట్ పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. మొత్తానికి కళకు, కళాకారులకు హద్దులు చెరిగిపోతున్న విషయం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ మార్పు ద్వారా ప్రేక్షకుడికి సరైన వినోదం అందితే.. అంతకు మించి కావాల్సింది ఏముందీ?