Tamannaah Bhatia: తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ సినిమా త్వరలోనే విడుదల కానుంది. అయితే ఈ సినిమా లోని ‘కావాలా’ పాట విడుదలైనప్పటి నుండి మిల్కీ బ్యూటీ తమన్నా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. ఈ సాంగ్ రీల్స్ ఇంస్టాగ్రామ్ లో తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఇక ఈ చిత్రంలో మోహన్ లాల్, శివరాజ్ కుమార్ లాంటి వారు కూడా నటించడం విశేషం. అయితే ఈ సినిమా ప్రమోషన్ సందర్భంగా తమన్నా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.
ప్రధానంగా దళపతి విజయ్ సినిమాపై ఆమె చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షించాయి. విజయ్ యొక్క సుర చిత్రం గురించి మాట్లాడుతూ, ఈ చిత్రంలో తన నటన తనకి నచ్చలేదని తమన్నా చెప్పింది. ఇక ఈ చిత్రం షూటింగ్ సమయంలోనే తనకు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అవుతుంది అని తెలుసు అని చెప్పింది. విజయ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ‘సుర’ ఒకటి అనే విషయం తెలిసిందే. ఇక అలాంటి సినిమా గురించి తమన్నా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
తమన్నా మాట్లాడుతూ, “నాకు సినిమా అంటే చాలా ఇష్టం, కానీ కొన్ని సన్నివేశాల లో నేను సరిగ్గా నటించలేదు లేదు నాకే అర్థమవుతుంది. ముఖ్యంగా విజయ్ ‘సుర’ సినిమాలో నేను అస్సలు బాగా నటించలేదు అని నాకు అర్థమైంది. అయితే ఈ చిత్రంలోని అన్ని పాటలు చార్ట్‌బస్టర్‌గా నిలిచాయి,” అని చెప్పుకొచ్చింది ఈ హీరోయిన్.
ఇక సినిమా పరాజయం గురించి ఆమె మాట్లాడుతూ.. “సినిమా షూటింగ్‌లో ఉన్నప్పుడే నాకు ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ ఎక్కడ వర్కవుట్ కాదనే బలమైన భావన కలిగింది. చాలా చిత్రాలకు మనకు ఇలా ముందుగానే తెలిసిపోతుంది. ముందుగా కమిట్మెంట్ ఇస్తాము కాబట్టి, అలా తెలిసినా సినిమాలను వదలలేము. ఎందుకంటే ప్రతిదీ సక్సెస్, ఫెయిల్యూర్ గురించి కాదు. సినిమాలు ఖరీదైన కళారూపం, కాబట్టి మనం ఒప్పుకున్న సినిమాకు మనం బాధ్యతగా వ్యవహరించాలి. ఇది వృత్తిలో భాగం.” అంటూ చెప్పుకొచ్చింది తమన్నా.
ఇక విజయ్ సుర సినిమాకి వస్తే, ఈ సినిమా SP రాజ్‌కుమార్ దర్శకత్వం వహించిన యాక్షన్ కామెడీ గ్రామ. ఈ చిత్రంలో విజయ్, తమన్నా, వడివేలు, దేవ్ గిల్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం విజయ్ కెరీర్‌లో 50వ చిత్రంగా వచ్చిన ప్రేక్షకుల అంచనాలు మాత్రం అందుకోలేకపోయింది. అయితే, ఈ చిత్రం బడ్జెట్‌ను రికవరీ చేసిందని నిర్మాత సంగిలి మురుగన్ అప్పట్లో వెల్లడించారు. ఇక సినిమా ఎలా ఉన్నా కానీ ఈ చిత్రానికి మణిశర్మ స్వరపరిచిన పాటలు పెద్ద హిట్ అయ్యాయి.