Thaman: తమన్.. ‘బాయ్స్’ సినిమాలో చిన్న డ్రమ్స్ వాయించే ప్లేయర్ గా నటించిన ఈ లడ్డూ లాంటి కుర్రాడు.. టాలీవుడ్ లో సెన్షేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదుగుతాడని ఎవ్వరూ ఊహించలేదు. కానీ రాత అలా మారింది. అతడిని తెలుగులోనే పాపులర్ సంగీత దర్శకుడిగా మార్చింది.
‘కిక్’ సినిమాతో మొదలైన తమన్ సంగీత ప్రవాహం.. ‘అల వైకుంఠపురంలో’ సినిమాతో పతాకస్థాయికి చేరింది. గురువు త్రివిక్రమ్ పర్యవేక్షణలో ఆ సినిమాకు అందించిన పాటలు తెలుగులోనే కాదు జాతీయ స్థాయిలో ప్రతిధ్వనించింది.
తన గురువు మణిశర్మకు పోటీగా సినిమాలు చేయకుండా ఒకప్పుడు గురు దక్షిణ చాటుకున్న తమన్.. ఇప్పుడు మణిశర్మను మించి పోయేలా గురువును మించిన శిష్యుడిగా ఎదిగాడు. ఎంతో మంది సంగీత దర్శకుల వద్ద కీబోర్డు ప్లేయర్ గా పనిచేసి ఇప్పుడు తెలుగులోనే వారందరినీ వెనక్కి నెట్టి అగ్రస్థానానికి చేరుకున్నాడు. తాజాగా జాతీయ స్థాయిలో తమన్ సంగీతం అందించిన ‘అల వైకుంఠపురంలో’ సినిమాకు ఉత్తమ సంగీత చిత్రంగా అవార్డు రావడం తమన్ కు దక్కిన గొప్ప గౌరవంగా చెప్పొచ్చు.
-అసలు ఎవరీ తమన్..
తమన్ అసలు పేరు ‘ఘంటసాల సాయి శ్రీనివాస్ తమన్ శివకుమార్’. కానీ తమన్ గానే ఫేమస్ అయ్యాడు. ఘంటసాల ఇంటి పేరుతో ఆ మహనీయుడి సంగీతాన్ని నిలబెట్టాడు. తెలుగు, తమిళం సహా పలు భాషల్లో సంగీత అందించి గుర్తింపు పొందాడు. తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో తమన్ పుట్టాడు. ఏపీలోని నెల్లూరు జిల్లా పొట్టేపాళెం స్వగ్రామం. సంగీత కళాకారుల కుటుంబానికి చెందిన వాడు. నిర్మాత ఘంటసాల బలరామయ్య మనవడు. తండ్రి ఘంటసాల శివకుమార్, తల్లి ఘంటసాల సావిత్రి. ఈయన అత్త వసంత కూడా గాయనీ కావడం విశేషం. నేపథ్య గాయని శ్రీవర్ధినిని తమన్ వివాహం చేసుకున్నాడు.
తెలుగులో తమన్ సంగీతం అందించిన ‘అల వైకుంఠపురంలో’ సినిమాకు జాతీయ స్థాయిలో ఉత్తమ సంగీత చిత్రంగా నిలవడంతో తమన్ ప్రతిభ ఎల్లలు దాటింది. అతడి సంగీతానికి తొలిసారి ఇలాంటి అవార్డు దాసోహం కావడం విశేషం.