Samantha Yashoda: యశోద చిత్ర విడుదలకు మరో రోజు సమయం మాత్రమే మిగిలి ఉంది. మూవీపై పాజిటివ్ బజ్ నడుస్తుంది. ట్రైలర్ ఆకట్టుకోగా యశోద విజయం సాధిస్తుందనే నమ్మకం ఏర్పడింది. అన్నిటికీ మించి సమంతపై ఉన్న సింపతీ సినిమాకు బాగా వర్క్ అవుట్ అవుతుందనే ప్రచారం నడుస్తుంది. ప్రస్తుతం సమంత ప్రాణాంతక మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని సమంత కొద్దిరోజుల ముందు ప్రకటించారు. ఇటీవల ఇంటర్వ్యూలో సమంత తన ఆరోగ్యం గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. కన్నీరు పెట్టుకున్నారు.

మంచి రోజులు ఉన్నాయి చెడు రోజులు ఉన్నాయి. ఒక్కో రోజు కనీసం అడుగు కూడా ముందుకు వేయలేనేమో అనిపిస్తుంది. మరొక రోజు నేను ఇంత దూరం వచ్చానా, ఈ స్థాయికి చేరుకున్నానా అన్న భావన కలుగుతుంది. జీవితంలో అత్యంత క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్నాను. దీన్ని నేను పోరాడి గెలవాలి. అయితే పత్రికల్లో నేను చనిపోతున్నట్లు రాశారు. మరీ అంత దారుణ స్థితిలో లేను. ప్రమాదకరమైన వ్యాధి కాదు. అలా అని చిన్న సమస్య కూడా కాదు. ప్రస్తుతానికి నేను బాగానే ఉన్నానే. బ్రతికే ఉన్నాను. భవిష్యత్ ఎలా ఉంటుందో చెప్పలేను, అని వెల్లడించారు.
సమంత మాటలు ఒకింత ఆనందం అదే సమయంలో ఆందోళన కలిగించాయి. అనారోగ్యంతోనే సమంత యశోద మూవీ డబ్బింగ్ పూర్తి చేశారు. ప్రమోషన్స్ లో పాల్గొన్నారు. ఈ పరిణామాలు సమంత పై ఎక్కడలేని సింపతీ తెచ్చిపెట్టాయి. ప్రతి ఒక్కరికి సమంత మీద జాలి, గౌరవం ఏర్పడ్డాయి. ఈ పరిస్థితి యశోద చిత్రానికి బాగా కలిసి వస్తుంది అంటున్నారు. టాక్ తో సంబంధం లేకుండా యశోద చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించే ఆస్కారం కలదు. ఇక పాజిటివ్ టాక్ వస్తే రికార్డు వసూళ్లు రాబట్టడం ఖాయం.

యశోద విషయంలో నిర్మాతలు చాలా రిస్క్ చేశారు. సమంతపై నమ్మకంతో భారీ బడ్జెట్ తో నిర్మించారు. యశోద హిట్ కావాలంటే రూ. 40 కోట్లకు పైగా షేర్ రాబట్టాలని సమాచారం. ఇది మామూలు టార్గెట్ కాదు. మరి చూడాలి సమంత యశోద మూవీని ఎంత వరకు గట్టెక్కిస్తుందో. విడుదల సమయం దగ్గర పడుతుంటే చాలా ఆందోళనగా ఉందని సమంత సోషల్ మీడియా పోస్ట్ చేశారు. అందరికీ సినిమా నచ్చాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు.