Superstar Krishna Records: సూపర్ స్టార్ కృష్ణ మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటు. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు సినీ రంగంలో అనేక సేవలు చేసిన ఆయన మంగళవారం తుదిశ్వాస విడిచారు. తెలుగు చిత్ర సీమలో ఎవరూ చేయలేని రికార్డులు సూపర్ స్టార్ కృష్ణ సృష్టించారు. మిగతా హీరోల కంటే ఎక్కువ సినిమాలు తీసిన హీరో కృష్ణ కు మాత్రమే దక్కుతుంది. ఒక సంవత్సరంలో 18 సినిమాల్లో కృష్ణ నటించి ప్రత్యేకంగా నిలిచారు. అలా కేవలం 8 ఏళ్లలో 100కు పైగా సినిమాల్లో నటించి సంచలనం గా మారాడు. హాలీవుడ్ లో కృష్ణ సినిమా రిలీజై మొదటి ఇండియన్ సినిమాగా రికార్డు నెలకొల్పారు. ఇలా చెప్పుకుంటూ పోతే కృష్ణ జీవితంలో అన్నీ రికార్డులే.

సూపర్ స్టార్ కృష్ణ పూర్తి పేరు ఘట్టమనేని శివరామకృష్ణ మూర్తి. 1942 మే 31న గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెం లో జన్మించారు.డిగ్రీ పూర్తి చేసి ఇంజనీరింగ్ సీటు రాకపోవడంతో సినిమాల కోసం ప్రయత్నాలు ప్రారంభించాడు. అయితే తన తండ్రి రాఘవయ్య చౌదరి కృష్ణను సినిమాల్లోకి తీసుకోవాలని తనకు తెలిసిన వారికి ఉత్తరాలు రాసేవాడు. కొంతకాలం తరువాత మద్రాసు వెళ్లిన ఆయన ‘చేసిన పాపం కాశీకి వెళ్లనా..?’ అనే నాటకంలో శోభన్ బాబుతో కలిసి నటించాడు. ఆ తరువాత ఎల్వీ ప్రసాద్ తీసిన ‘కొడుకులు కోడళ్లు’ అనే సినిమాల్లో ఓ పాత్రలో నటించారు. కానీ ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. కొన్ని రోజుల తరువాత 1962లో ‘పదండి ముందుకు’ అనే సినిమాలో చిన్న పాత్రలో నటించారు. ఆ తరువాత వరుస అవకాశాలు వచ్చాయి.
1964లో ఆదుర్తి సుబ్బారావు అందరూ కొత్తవాళ్లతో సినిమా తీయాలని నిర్ణయించారు. అయితే అప్పటికీ చిన్న చిన్న పాత్రల్లో నటించిన కృష్ణ కు గుర్తింపు రాలేదు. దీంతో పలు వడపోతల తరువాత కృష్ణకు ‘తేనె మనసులు’ అనే సినిమాలో అవకాశం ఇచ్చారు. ఇందులో ఇద్దరు హీరోల్లో కృష్ణ ఒకరు. ఈ సినిమాల్లో తన ప్రతిభ చాటడంతో కృష్ణ కు తిరుగు లేకుండా పోయింది. ఆ తరువాత గూడచారి 116 లో కృష్ణ నటించిన పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఎందుకంటే ఆయన కెరీర్ ను మలుపు తిప్పిన సినిమా ఇది.

ఇలా కృష్ణ తీరిక లేకుండా సినిమాలు తీశారు. ఇలా 8 ఏళ్లలో 100కు పైగా సినిమాల్లో నటించారు.
1968లో 10 సినిమాలు,
1969లో 19 సినిమాలు,
1970లో 16 సినిమాలు,
1971లో 11 సినిమాలు,
1972లో 18 సినిమాలు,
1973లో 15 సినిమాలు,
1974లో 13 సినిమాలు,
1975లో 8 సినిమాల్లో నటించారు.
రోజుకు మూడు షిప్టుల చొప్పున షూటింగులకు వెళ్తూండేవారు. ఏ సినిమా అవకాశం వచ్చినా.. వద్దనకుండా అన్నింటలోనూ కృష్ణ నటించారు. అప్పటి వరకు కేవలం నటుడుగానే కొనసాగిన కృష్ణ ఆ తరువాత నిర్మాతగా, దర్శకుడిగా ఆకట్టుకున్నారు.