Superstar Krishna Birthday: సూపర్ స్టార్ కు నిర్వచనం ఇవ్వాల్సి వస్తే.. సింపుల్ గా ‘కృష్ణ’ అని ఒక పదం చెప్పొచ్చు. కృష్ణ గన్ పడితే జేమ్స్ బాండ్.. విల్లు ఎక్కుపెడితే అల్లూరి సీతారామరాజు.. పంచె కడితే పక్కా పల్లెటూరి మొనగాడు. గుర్రమెక్కితే కౌబాయ్.. ఇలా అనేక వైవిధ్యమైన పాత్రలతో తెలుగు చిత్రసీమను ఏలిన మకుటంలేని మహారాజు ‘సూపర్ స్టార్ కృష్ణ’. సాహసం కృష్ణ ఊపిరి.. ధైర్యం కృష్ణ చిరునామా. అందుకే.. ఆయన అపజయాలకు వెరవని హీరో అయ్యారు.
ఇంతకీ కృష్ణకి సినిమాలపై మోజు ఎలా కలిగింది అంటే ? తెనాలి రత్న టాకీస్‌లో పాతాళభైరవి సినిమా చూసాకే కృష్ణకు సినిమాలపై మోజు కలిగింది. అలాగే ఆయన చదువుకుంటున్న రోజుల్లో ఏలూరులో అక్కినేని నాగేశ్వరరావుకు జరిగిన సన్మానం, ప్రజాదరణ చూసి, ఆయన సినిమా రంగంలోకి రావాలని నిర్ణయించుకున్నారు. అలా సినిమాల్లోకి వచ్చారు. అయితే, అప్పటికే ‘ఎన్టీఆర్ – ఏఎన్నార్’ లాంటి దిగ్గజాలు ఫుల్ ఫామ్ లో ఉన్నారు. మరోపక్క అమ్మాయిల మానస చోరుడైన శోభన్ బాబు వరుస హిట్స్ కొడుతున్నాడు. దీనికితోడు కృష్ణ గొప్ప నటుడు కాదు, మంచి డాన్సర్ కూడా కాదు. అలాంటి కృష్ణ ఇక స్టార్ ఎలా అవుతాడు అనుకున్నారు అందరూ. కానీ, ఆ రోజుల్లో కృష్ణ సాధించింది అలాంటి ఇలాంటి స్టార్ డమ్ కాదు. ఊరూరా అభిమాన సంఘాలతో ప్రచండమైన స్టార్ డమ్.
Also Read: Pavan Kalyan Tirupati: పవన్ కల్యాణ్ ఇక అక్కడి నుంచే పోటీ..: తీర్మానం జరిగిపోయింది..
మరి సాధారణ టాలెంట్ తో కృష్ణ అంత గొప్ప సూపర్ స్టార్ గా ఎలా ఎదిగాడో నేటి తరం ప్రేక్షకులకు తెలియదు. నిజానికి ఈ సందేహం అప్పట్లో కూడా చాలా మందికి ఉండేది. కృష్ణ స్టార్ డమ్ వెనుక చాలా కారణాలే ఉన్నాయి. సినిమా వ్యాపారం మీద కృష్ణకు లోతైన అవగాహన ఉండేది. అలాగే ఎన్నుకునే కథల పై మంచి అభిరుచి ఉండేది. అందుకే, కృష్ణ సినిమాలు వ్యాపారంలో ఎప్పుడూ నష్టపోలేదు. పైగా కృష్ణకు ఉన్న అవగాహన కూడా చాలా లోతుగా ఉండేది. ఏ కథను ఏ దర్శకుడు బాగా తీస్తాడు ? ఒక సినిమాకి ఎంత బడ్జెట్ పెట్టాలి ? తీసిన సినిమా ఎన్ని కేంద్రాల్లో ఎన్నాళ్ళు ఆడి, ఏ మాత్రం సంపాదించ గలుగుతుంది ? లాంటి విషయాల్లో కూడా కృష్ణకు స్పష్టమైన సమాచారం ఉండేది.
కృష్ణకు ఇంతటి గొప్ప సినీ వ్యాపార అనుభవం ఉంది కాబట్టే.. ఆయన నిర్మాతలు ఎప్పుడు భారీగా నష్టపోలేదు. కానీ, ఆయన మంచితనమే ఆయనను నష్టపరిచింది. ఎందరో నిర్మాతలకు ఆయన ఉచితంగా సినిమాలు చేశారు. అన్నిటికి మించి తన బలం, బలహీనతల మీద స్పష్టమైన అవగాహన ఉండటం కూడా ఆయనకు బాగా ప్లస్ అయింది. తన ప్రేక్షకులను బాగా అర్థం చేసుకోవడంలో కృష్ణ ఎప్పుడు ముందు ఉండేవారు. పైగా ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు ఒక విభిన్నమైన అనుభవం ఇవ్వడం కోసం ఆయన ఎప్పుడు తపన పడేవారు.
అలాగే సాంకేతికత పై కూడా కృష్ణ ప్రత్యేక దృష్టి పెట్టేవారు. ఈ క్రమంలోనే 1974లో తొలి సినిమా స్కోప్ సినిమాగా అల్లూరి సీతారామరాజు, 1982లో తొలి ఈస్ట్‌మన్ కలర్ సినిమాగా ‘ఈనాడు’, 1986లో తొలి 70 ఎంఎం సినిమాగా ‘సింహాసనం’, చివరకి 1995లో తొలి డీటీఎస్ సినిమాగా ‘తెలుగు వీర లేవరా’ – ఇవన్నీ కృష్ణ తెచ్చిన సాంకేతిక మార్పులే. అందుకే సాధారణ కృష్ణ.. సూపర్ కృష్ణ అయ్యాడు.
ఆయన స్టార్ డమ్ కి తగ్గట్టు.. ఆస్ట్రేలియా ప్రభుత్వం కృష్ణను గౌరవిస్తూ ఓ పోస్టల్ స్టాంప్ కూడా విడుదల చేసింది. 1976లో కేంద్ర కార్మిక శాఖ మంత్రి కె.వి.రఘునాథరెడ్డి చేతుల మీదుగా కృష్ణ “నటశేఖర” బిరుదును అందుకున్నారు. నేడు ఆయన పుట్టినరోజు. ఈ తెలుగు సినీ కళామ్మ తల్లి ముద్దుబిడ్డకి మా ‘ఓకే తెలుగు’ ఛానల్ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.
Also Read:Telugu TV Actress Maithili: వీడియో కాల్ చేసి మరీ టీవీ సీరియల్ నటి ఆత్మహత్యాయత్నం