Super Star Krishna: ప్రముఖ దర్శకుడు విఠలాచార్య దర్శకత్వం వహించిన సినిమాలు తెలుగు చిత్ర సీమలో ఎంతో ప్రఖ్యాతి గాంచాయి. తరాలు మారినా తరగని ఆదరణ గల చిత్రాలను తెరకెక్కించారు విఠలాచార్య. ఆయన స్టైల్ ఆఫ్ మేకింగ్, సినీ ప్రయాణాన్ని ఈతరం ప్రేక్షకులకు సమగ్రంగా పరిచయం చేయాలని సీనియర్ జర్నలిస్ట్, రచయిత పులగం చిన్నారాయణ భావించారు. ఈ మేరకు విఠలాచార్య జీవితం ఆధారంగా రచించిన ‘ జై విఠలాచార్య ‘ పుస్తకం రచించారు. కాగా ‘మూవీ వాల్యూమ్’ షేక్ జిలాన్ బాషా ప్రచురిస్తున్న ఫస్ట్ లుక్‌ను సూపర్ స్టార్ కృష్ణ చేతుల మీదుగా విడుదల చేశారు.
ఈ సంధర్భంగా సూపర్ స్టార్ కృష్ణ మాట్లాడుతూ… కాంతారావు గారు హీరోగా విఠలాచార్య గారు చాలా జానపద చిత్రాలు చేశారు. కాలేజీ రోజుల్లో అవి చూసేవాడిని. హీరో అయిన తర్వాత ఆయన దర్శకత్వంలో నేను ‘ఇద్దరు మొనగాళ్లు’ చేయగా… అది సూపర్ హిట్ అయ్యిందన్నారు. విఠలాచార్య గారిలో గొప్ప విషయం ఏంటంటే… బడ్జెట్‌లో సినిమా పూర్తి చేసేవారు. దర్బార్ సెట్ వేస్తే… అందులో ఒకవైపు బెడ్ రూమ్, మరోవైపు కారిడార్ సెట్స్ వేసేవారు. త్వరగా షూటింగ్ పూర్తి చేసేవారు. ఆయనపై పుస్తకం తీసుకు వస్తుండటం సంతోషంగా ఉంది. సినిమా నిర్మాణంలో ఆయనో పెద్ద బాలశిక్ష అని కృష్ణ అన్నారు.
కరోనా టైమ్‌లో విఠలాచార్య గారి శత జయంతి సందర్భంగా ‘జై విఠలాచార్య’ పుస్తకానికి అంకురార్పణ చేశాం. ఆయన ఎంత వేగంగా సినిమాలు తీసేవారో, అంతే వేగంగా పుస్తకాన్ని పూర్తి చేశాం. రచయితగా నా 9వ పుస్తకం ఇది” అని రచయిత పులగం చిన్నారాయణ అన్నారు. కృష్ణ గారిది గోల్డెన్ హ్యాండ్. ఆయన చేతుల మీదుగా బుక్ ఫస్ట్ లుక్ విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. ఓ బుక్ ఫస్ట్‌లుక్ విడుదల చేయడం ఇదే తొలిసారి అని షేక్ జిలాన్ బాషా అన్నారు.