Heroine Madhavi Biography: అదృష్టం అందరి తలుపూ తట్టవచ్చు. కానీ, ఆ పిలుపు వినగలిగే నేర్పు కొందరికే ఉంటుంది. ఆ కొందరిలో ఆ హీరోయిన్ కూడా ఒకరు. 13 ఏళ్ళ వయసులో రంగుల ప్రపంచంలో కాలు మోపి.. ‘చిరంజీవి, కమల్ హాసన్, రజినీకాంత్’ లాంటి హీరోలను సైతం వెయిట్ చేయించే స్థాయికి వెళ్లడం అంటే.. ఎంతో టాలెంట్ కావాలి, అంతకు మించిన దైర్యం ఉండాలి. ఇంతకీ ఎవరు ఆమె ? పేరు ‘మాధవి’.
ఒకప్పుడు స్టార్ హీరోయిన్ మాధవికి మొదటి నుంచి ముక్కు మీద కోపం ఎక్కువ. ఒక్కోసారి కన్నీళ్లు కూడా మేలే చేస్తాయి. కళ్ళకు కమ్మిన మసకలను అవి తొలగిస్తాయి. అలాగే మాధవి కోపం కూడా ఆమెకు మేలే చేసింది. గ్లామర్ లోకంలో ముప్పై ఏళ్ల క్రితమే బికినీ వేసినా.. ఆమె కోపానికి భయపడి, ఏ వంకర కన్ను ఆమె పై కన్ను ఎత్తి చూసే సాహసం కూడా చేయలేదు.
Also Read: Venu Swamy: వివాహాలైనా విడిపోవడమే.. హీరోయిన్ల జీవితాలపై జ్యోతిష్కుడి ఆసక్తికర వ్యాఖ్యలు
ఐతే, ఎగతాళి చెయ్యడం, వ్యంగ్యంగా మాట్లాడటం మాధవికి ఉన్న అలవాటు. అదే ఆమెను కొన్ని సందర్భాల్లో ఒంటరిని చేశాయి. పైగా తన పై చాటుగా అనేక విమర్శలు ఆమె వింది. బహుశా.. ఈ అనుభవాల రీత్యానే కావొచ్చు, నాలుకను అదుపులో పెట్టుకోవడమే నిజమైన యోగసాధన అని మాధవిలో పరివర్తన వచ్చింది. కానీ, కత్తి చేసే గాయం కన్నా, మాట చేసే గాయం లోతే ఎక్కువ అని మాధవి ఇప్పటికీ చెబుతూ ఉంటుంది అంటే.. ఆమె పై విమర్శలు ఎంతగా ప్రభావం చూపి ఉంటాయి !
అన్నిటికీ మించి మాధవి గురించి మరో ముఖ్య విషయం. పానకంలో మునిగినా గరిటెకు తీపి తెలియనట్టు.. శృంగార భరిత సన్నివేశాలతో పరిధి దాటినా.. మాధవి మాత్రం ఎన్నడూ సినిమా వాసనను వంటబట్టించుకోలేదు. నిజానికి ఇండస్ట్రీలో మరీ తియ్యగా ఉంటే మింగేస్తారు, మరీ చేదుగా ఉంటే ఉమ్మేస్తారు. ఇవ్వన్నీ మాధవికి చిన్న వయసులోనే అర్థమయ్యాయి. అందుకేనేమో మొదటి సినిమా నుంచే ఇండస్ట్రీ వ్యవహారాల పై మాధవి అయిష్టంగానే ఉంటూ వచ్చారు. మరి మాధవి గురించి ఇంకా అనేక విశేషాలు, విషయాలు తెలుసుకుందాం రండి.
మాధవి వ్యక్తిగత జీవితం :
గోవిందస్వామి – శశిరేఖ దంపతులకు 1965 సెప్టెంబర్ 4వ తేదీన ‘మాధవి’ హైదరాబాద్ లో జన్మించారు. నిజానికి ఆమెకు తల్లిదండ్రులు పెట్టిన పేరు ‘కనక మహాలక్ష్మి’. కనక మహాలక్ష్మి(మాధవి)కి ఒక అక్క, అన్నయ్య కూడా ఉన్నారు. చిన్నతనం నుంచే కనక మహాలక్ష్మి భరతనాట్యం పై ఇష్టం పెంచుకుంది. కూతురు ఆసక్తిని గమనించిన తల్లి శశిరేఖ, కూతురికి భరతనాట్యం నేర్పించింది. నాట్యం బాగా నేర్చుకున్న కనక మహాలక్ష్మికి తన 8 ఏళ్ళ వయస్సు నుంచే ప్రదర్శనలు ఇవ్వడం మొదలు పెట్టింది. దాదాపు 300కి పైగా ప్రదర్శనలు ఇచ్చింది. అయితే, కనక మహాలక్ష్మి అబిడ్స్ స్కూల్ లో 8వ తరగతి చదువుతున్న రోజులు అవి. ఆ స్కూల్ కి గెస్ట్ గా వెళ్లారు దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు. అక్కడ ‘కనకమహాలక్ష్మి’ నాట్యం చూసి మురిసిపోయిన ఆయన, తన సినిమాలో మాధవికి మొదటి అవకాశం ఇచ్చారు.
మాధవి సినీ రంగప్రవేశం :
దాసరి గారి ప్రోత్సాహంతో అనుకోకుండా స్కూల్ డేస్ లో కనక మహాలక్ష్మి.. మాధవిగా మారి తన 13వ ఏట సినీ రంగంలో అడుగు పెట్టారు. ఆమె మొదటి సినిమా ‘తూర్పు పడమర’. ఈ చిత్రం అప్పట్లో అద్భుత విజయం సాధించింది. దాంతో మాధవికి వరుస అవకాశాలు వచ్చాయి. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ ‘దొంగ మొగుడు’ ‘కోతల రాయుడు’ ‘ ప్రాణం ఖరీదు’ ‘కుక్క కాటుకు చెప్పు దెబ్బ’ ‘ఖైదీ’ ‘బిగ్ బాస్’ వంటి చిత్రాల్లో ఆమె నటించారు.
మాధవి కెరీర్ లోనే ఇవి ప్రత్యేకం !
అప్పటికే ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన మాధవి.. ఇక సినిమాలు తగ్గించాలని నిర్ణయించుకున్నారు. కానీ ఆమెకు ఏదో వెలితి. ఇన్నేళ్లు ఇన్ని వందల సినిమాలు చేసినా.. తనకు చెప్పుకునే సినిమా లేదు అని. ఆ సమయంలోనే ఆమెకు ‘మాతృదేవోభవ’ సినిమా వచ్చింది. ఆ ఎమోషనల్ డ్రామాలో ‘మాధవి’ అద్భుతంగా నటించి ప్రేక్షకుల కన్నీళ్లు పెట్టించింది.
సినిమా ఇండస్ట్రీలో మాధవి కెరీర్ 17 ఏళ్ల పాటు సాగింది. ఆమె తన సినీ జీవితంలో తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళం, ఒరియా భాషల్లో దాదాపు 300కి పైగా చిత్రాల్లో నటించి అలరించింది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి – మాధవి జోడీ అప్పట్లో ప్రేక్షక లోకాన్ని చాలా బాగా ఆకట్టుకుంది.
అదే విధంగా 1985 -90 మధ్య కాలంలో మాధవి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా వెలుగొందింది. అప్పట్లో శ్రీదేవి, విజయశాంతి లాంటి అగ్ర హీరోయిన్లు కూడా ఆమెకు పోటీ ఇవ్వడానికి చాలా కష్టపడ్డారు.
ఆధ్యాత్మిక గురువు – పెళ్లి :
ఆధ్యాత్మిక గురువు ‘రామస్వామి’కి మాధవి భక్తురాలు. ఆయనను ఆమె తరుచూ కలుస్తూ ఆశీస్సులు తీసుకుంటూ ఉండేవారు. రామస్వామి సలహా మేరకు బిజినెస్ మెన్ ‘రాల్ఫ్ శర్మ’ను మాధవి వివాహం చేసుకున్నారు. రాల్ఫ్ శర్మ తల్లి జర్మన్, ఆయన తండ్రి ఒక హిందూ.
సినీ నటి నుంచి బిజినెస్ విమెన్ వరకూ..
‘రాల్ఫ్ శర్మ’ను వివాహం చేసుకున్న తర్వాత మాధవి అమెరికాలో సెటిల్ అయ్యింది. ఈ దంపతులకు టిఫాని శర్మ, ప్రసిల్లా శర్మ, ఎవ్లీన్ శర్మ అనే ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక, మాధవికి బిజినెస్ పై ఆసక్తి కలిగింది. తన భర్తకు ఉన్న ఔషధ సంస్థను ప్రస్తుతం మాధవినే చూసుకుంటున్నారు. అలాగే యుఎస్ఎలో మాధవి స్థాపించిన ఫుడ్ రెస్టారెంట్స్ కూడా బాగా సక్సెస్ అయ్యాయి. ప్రస్తుతం వ్యాపారంలో మాధవి చాలా చురుగ్గా ఉన్నారు. బిజినెస్ విమెన్ గా మాధవికి చాలా మంచి పేరు వచ్చింది. ఆమె ఆస్తుల విలువ కొన్ని వేల కోట్లు. ఒక తెలుగు హీరోయిన్ ఈ స్థాయికి వెళ్లడం తెలుగు సినిమాకే గర్వకారణం. మాధవి ఇలాగే ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆశిద్దాం.
Also Read:Kangana Ranaut: బాబోయ్ విచ్చలవిడిగా రెచ్చిపోయింది కంగనా.. ఇదేం ఎక్స్ పోజింగ్ రా బాబు !