Jayam Ravi Divorce: ఈమధ్య కాలంలో సెలెబ్రెటీలకు ఏమైందో ఏమో తెలియదు కానీ, పెళ్లి చేసుకున్నానని రోజులు కూడా కలిసి ఉండడం లేదు. విడాకుల వార్తలను తరచూ వింటూనే ఉన్నాం. కొత్తగా పెళ్ళైన జంట ఒకరిని ఒకరు అర్థం చేసుకోలేక విడిపోవడంలో పెద్ద వింతేమీ లేదు. కానీ దశాబ్దాల తరబడి దాంపత్య జీవితం కొనసాగించిన దంపతులు కూడా విడిపోతుండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. నిన్న ప్రముఖ తమిళ హీరో జయం రవి తన భార్య ఆర్తి తో విడిపోతున్నట్టుగా ఒక అధికారిక ప్రకటన చేసాడు. 2009 వ సంవత్సరం లో వీళ్లిద్దరు పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు. ఇన్నేళ్లు దాంపత్య జీవితాన్ని ఎంతో ఆనందంగా సాగించిన వీళ్ళు ఇప్పుడు విడాకులు తీసుకోబోతున్నారని అనడం అభిమానులకు బాధను కలుగచేసింది. అయితే దీనిపై జయం రవి భార్య ఆర్తి రవి కూడా స్పందించింది.
ఆమె మాట్లాడుతూ ‘నా ప్రమేయం లేకుండా..నా భర్త నాకు విడాకులు ప్రకటించడం శోచనీయం’ అంటూ ఆమె వేసిన ఒక ట్వీట్ సంచలనం గా మారింది. ఇంకా ఆమె మాట్లాడుతూ ’18 ఏళ్ళ దాంపత్య జీవితం మాది. ఈ బంధాన్ని ఎంతో గౌరవంగా, గోప్యంగా ముగించడం ఉత్తమం. చాలా సందర్భాలలో నేను భర్తతో ఈ విడాకుల వ్యవహారం గురించి మాట్లాడి, సమస్యని పరిష్కరించుకుందాం అనుకున్నాను. కానీ నాకు అతనితో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు. ఏకపక్ష విడాకులు చెల్లదు, దీని వల్ల మా కుటుంబానికి ఎలాంటి ఉపయోగం లేదు. నేను ఇద్దరు బిడ్డలకు తల్లిని, నేను ఎల్లప్పుడూ వారికి ఆదర్శప్రాయంగానే ఉండాలి. కానీ నా మీద సోషల్ మీడియా లో జరుగుతున్న కొన్ని అసత్య ప్రచారాలను నేను ఉపేక్షించను. కచ్చితంగా దీనిపై నేను పోరాటం చేస్తాను. ఇలాంటి కష్ట సమయంలో నాకు తోడు ఉన్న అభిమానులకు, మీడియాకు శ్రేయోభిలాషులకు కృతఙ్ఞతలు’ అంటూ చెప్పుకొచ్చింది.
ఇంతకు ఆమె మీద వచ్చిన రూమర్స్ ఏమిటో తెలియడం లేదు. ఆర్తి ప్రముఖ టెలివిజన్ నిర్మాత సుజాత విజయ్ కుమార్ కుమార్తె. జయం రవి తో సుమారుగా మూడేళ్ళ పాటు డేటింగ్ చేసిన తర్వాత 2009 వ సంవత్సరం లో వీళ్లిద్దరు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఒకరికోసం ఒకరు పుట్టినట్టుగా, మేడ్ ఫర్ ఈచ్ అథర్ అనిపించేలా ఈ జంట ఉంటుంది. ఎక్కడికి వెళ్లినా వీళ్లిద్దరు కలిసే వెళ్తారు. సినిమా ఇండస్ట్రీ అన్న తర్వాత అఫైర్స్ గురించి ప్రచారాలు జరగడం సర్వసాధారణం. కానీ జయం రవి మీద ఇప్పటి వరకు ఒక్క ప్రచారం కూడా అలాంటిది జరగలేదు. అలా క్లీన్ క్యారక్టర్ ని మైంటైన్ చేస్తూ వచ్చిన ఆయన ఇప్పుడు ఈ విడాకుల వ్యవహారం లో చర్చల్లో నిలిచారు. జయం రవి కి విడాకులు తీసుకోవాలని ఉన్నా, ఆర్తి రవి కి విడాకులు తీసుకోవాలని లేదు. కాబట్టి మళ్ళీ వీళ్లిద్దరు కచ్చితంగా కలిసిపోతారని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.