మహేష్ బాబు సినిమా అంటే.. సీరియస్ మోడ్ లోనే సాగిపోతుందన్న ఫీలింగ్ ను తొలగించిన మొదటి సినిమా దూకుడు. ఆ చిత్రంలో సూపర్ స్టార్ చేసిన కామెడీ అద్దిరిపోయిందనే చెప్పాలి. మహేష్ కెరీర్లోనే ఎవర్ గ్రీన్ చిత్రంగా నిలిచిపోతుందని చెప్పడంలోనూ సందేహం లేదు. ఇలాంటి అద్భుతమైన కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్ ను అందించిన దర్శకుడు శ్రీనువైట్ల. అయితే.. ఈ బొమ్మ బ్లాక్ బస్టర్ అయిన తర్వాత.. మళ్లీ ఈ స్థాయి హిట్ దక్కలేదు ఈ దర్శకుడికి. ఇంకా చెప్పాలంటే.. తర్వాత వచ్చిన ప్రతి సినిమా నిరాశపరిచి, కెరీర్ నే డైలామాలో పడేశాయి.
ఈ నేపథ్యంలో ఏం చేసైనా మళ్లీ బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తున్నాడు శ్రీనువైట్ల. ఇందుకోసం మళ్లీ మహేష్ బాబునే సెలక్ట్ చేసుకున్నాడు. ఇందులో భాగంగా.. సూపర్ స్టార్ కోసం మరో సూపర్బ్ స్టోరీని సిద్ధం చేశాడట. త్వరలోనే మహేష్ బాబుకు స్టోరీ చెప్పి, మెప్పిస్తానని అంటున్నాడు. దూకుడుకు సీక్వెల్ అని కాదుగానీ.. అదే రేంజ్ లో ఒక స్టోరీ సిద్ధం చేశానని చెబుతున్నాడు శ్రీనువైట్ల.
అయితే.. కథపై ఇంకా కసరత్తు చేయాల్సి ఉందని, పూర్తిస్థాయిలో సంతృప్తి వచ్చిన తర్వాతే మహేష్ బబును కలిసి స్టోరీ చెబుతానని అంటున్నాడు. అంతేకాదు.. ఈ స్టోరీ వింటే.. ప్రిన్స్ కూడా ఎగ్జైట్ అవుతాడనే నమ్మకం తనకు ఉందని కూడా అంటున్నాడు. అంతేకాదు.. తనపై కామెడీ ముద్ర బాగా పడిపోయిందని, వేరే ప్రయత్నాలు చేసిన ప్రతిసారీ బెడిసికొడుతున్నాయని చెప్పాడు వైట్ల.
ఇక, ఆ తప్పు మళ్లీ చేయదలుచుకోలేదని చెప్పేవాడు. వినోదాత్మకమైన సినిమాలే తీస్తానని ప్రకటించాడు శ్రీను వైట్ల. ప్రస్తుతం ‘డీ అండ్ డీ’ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే పనిలో ఉన్న శ్రీనువైట్ల.. మూడు నెలల్లోనే ఫినిష్ చేయాలని పట్టుదలగా ఉన్నాడు. ఈ చిత్రం తర్వాత మహేష్ బాబుకు స్టోరీ సిద్ధం చేసి వినిపించాలని చూస్తున్నాడు. మరి, శ్రీనువైట్ల కోరిక నెరవేరుతుందా? మహేష్ ను మెప్పిస్తాడా? మళ్లీ దూకుడు కొనసాగిస్తాడా? అన్నది చూడాలి.