కరోనా సెకండ్ వేవ్ తర్వాత విడులైన మొత్తం సినిమాలు తొమ్మిది. థియేటర్లు తెరుచుకున్న తొలి (జూలై 30) వారంలో రెండు సినిమాలు విడుల కాగా.. గత వారం ఏకంగా ఒకే రోజు 7 సినిమాలు రిలీజ్ అయ్యాయి. అవన్నీ చిన్న చిత్రాలే. పైలట్ ప్రాజక్టుగా విడుదలైన మొదటి రెండు సినిమాలు పెద్దగా కలెక్షన్లు రాబట్టలేకపోయాయనే చెప్పాలి. అయితే.. సెకండ్ వీక్ లో వచ్చిన ఏడు సినిమాల్లోకూడా ఒక్క చిత్రం తప్ప.. మిగిలినవన్నీ సైలెంట్ అయిపోయాయి. ఆ ఒక్క చిత్రమే SR కల్యాణ మండపం. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ.. తొలి రోజు మంచి వసూళ్లు సాధించింది.
ఆగస్టు 6న విడుదలైన ఏడు సినిమాల్లో ముగ్గురు మొనగాళ్లు, మ్యాడ్, మెరిసే మెరిసే, క్షీర సాగర మథనం, రావణలంక, ఇప్పుడు కాక ఇంకెప్పుడు, SR కల్యాణ మండపం చిత్రాలున్నాయి. ఇందులో మొదటి నుంచీ జనాల్లో చర్చలో ఉన్న చిత్రం SR కల్యాణ మండపం మాత్రమే. పాటలతో మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ మూవీ.. టీజర్, ట్రైలర్ తోనూ హైప్ క్రియేట్ చేసింది. మిగిలిన వాటికి పెద్దగా ప్రమోషన్ దక్కలేదు.
అయితే.. సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా కల్యాణ మండపంలోకి వచ్చేందుకే ఆడియన్స్ ఆసక్తి చూపించారు. కథ కూడా బాగుందనే టాక్ రావడంతో.. జనాలు క్యూ కట్టారు. ఆ విధంగా తొలి రోజు మంచి కలెక్షన్లు రాబట్టిందీ చిత్రం. ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ 4.5 కోట్ల మేర సాగింది. ఇదే టార్గెట్ తో రెండు రాష్ట్రాల్లో 400 థియేటర్లలో అమెరికాలో 30 థియేటర్లలో రిలీజ్ అయ్యింది. అయితే.. మొదటి రోజు పాజిటివ్ టాక్ రావడంతో వరల్డ్ వైడ్ గా 1.4 కోట్ల షేర్ సాధించింది.
రెండో రోజు కూడా కలెక్షన్స్ పర్వాలేదనిపించింది. 1.25 కోట్ల షేర్ దక్కినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అంటే.. రెండు రోజుల్లో 2.66 కోట్ల షేర్ సాధించింది. ఇంకో 2.14 కోట్ల షేర్ సాధిస్తే.. సినిమా బయటపడిపోయినట్టే. మూడో రోజైన ఆదివారం కలెక్షన్స్ ఎలా ఉంటాయన్నదానిపైనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఆధారపడి ఉంటుంది. జనాలకు థియేటర్లకు వెళ్లక చాలా కాలమైంది కాబట్టి.. ఆదివారం కూడా కలెక్షన్స్ పెరిగే ఛాన్స్ ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కాగా.. ఏపీలో అనుకూల పరిస్థితులు లేకపోవడం సినిమాలకు మైనస్ గా మారింది. తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో మాత్రమే థియేటర్లకు అడ్డంకులు లేవు. ఏపీలో 50శాతం ఆక్యుపెన్సీ నిబంధన అమల్లో ఉంది. నైట్ కర్ఫ్యూను ఆగస్టు 14వరకు పొడిగించడంతో నైట్ షోలు లేవు. పైగా.. సినిమా టికెట్ రేట్ల విషయంలో ఏపీ సర్కారు తీసుకున్న నిర్ణయం కూడా ఇబ్బందిగా మారింది. ఇన్ని ఇబ్బందుల్లో ఈ చిత్రం ఆ మేరకు కలెక్షన్స్ రాబట్టింది. ఆంధ్రప్రదేశ్ లోనూ పరిస్థితులు అనుకూలంగా ఉంటే.. కలెక్షన్స్ రేంజ్ మరోలా ఉండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.