Telugu Bhasha Dinotsavam: “తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తెలుగు గురించి, తెలుగు సినిమాల గురించి చాలా గొప్పగా మాట్లాడుతున్నారు, మంచిది. కానీ.. అసలు తెలుగు సినిమాల్లో భాషను ఏ బాష అంటారు ?, మన తెలుగు సినిమాల్లో తెలుగు పరిస్థితి చూస్తే.. తెలుగు భాషా ప్రేమికులు కుమిలిపోతారు. తెలుగు విషయంలో మన దర్శకులు రచయితలు ఎంతగా దిగజారిపోరారో గమనిస్తే.. మనసు ఆవేదనతో తెగ బాధ పడిపోతుంది.
పైగా ఇప్పుడు పాన్ ఇండియా సినిమా అనే కొత్త కాన్సెప్ట్ వచ్చింది. ఈ పాన్ ఇండియా మోజులో పడి, తెలుగుకి పూర్తిగా అన్యాయం చేస్తున్నారు. అయినా మన తెలుగు చిత్రసీమ దౌర్భగ్యం ఏమిటంటే.. తెలుగు రాని, సరిగ్గా పలకలేని వాళ్ళు స్టార్లు. దీనికి తోడు ఈ మధ్య మరో ట్రెండ్ మొదలైంది. అసలు తెలుగు రాని, తెలుగు తెలియని గాయకుల చేత తెలుగు పాటలు పాడిస్తున్నారు. అలాగే, చాలామంది సంగీత దర్శకులకు కూడా తెలుగు రాదు.
వీరంతా అందించే పాటలు సూపర్ హిట్ అయిపోతున్నాయి. అసలేం జరుగుతుంది ?, ఇవన్నీ చూస్తే, కొన్నాళ్ళకు మనం తెలుగు పూర్తిగా మర్చిపోతామా అని భయం కలుగుతుంది. కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడితే.. ప్రేక్షకుల్లో కూడా తెలుగు భాష పూర్తిగా తెలిసిన వాళ్ళు చాలా తక్కువగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో సినిమాలో వాడే పిచ్చి పిచ్చి అర్ధం పర్ధం లేని పదాలనే తెలుగు అని వారు నమ్ముతున్నారు.
మరీ ముఖ్యంగా ఈ మధ్య వస్తున్న తెలుగు సినిమాల్లో తెలుగు పదాలకు బదులు ఏవేవో పరభాషా పదాలు తగిలిస్తున్నారు. ఎందుకయ్యా అంటే ?.. మా సినిమా పాన్ ఇండియా సినిమా అని గొప్పగా చెబుతున్నారు. అంటే అర్థం ఏమిటి ?.. తెలుగు సినిమాల్లో డైలాగ్ లు అర్థం కాకపోతే అది పాన్ ఇండియా సినిమా అనా ?, అంతకంటే చేతకాని తనం ఏముంటుంది ?,
రీసెంట్ గా రిలీజ్ అయిన ఒక సినిమాలో డైలాగ్స్ ను గమనిస్తే.. ఇది అసలు తెలుగేనా ? అనుమానం కలుగుతుంది. పైగా ఎవరు ఏమి మాట్లాడుతున్నారో తెలీదు.. ఏమైనా అంటే ‘వాట్ లగా దేంగే’ అని పదే పదే చెప్పిస్తున్నారు. పంచ్ డైలాగ్స్ పేరుతో ఏవేవో చిత్రవిచిత్ర పదాలు చొప్పించి జనాలని చంపుతున్నారు. వీళ్ళేదో ఇప్పుడు కొత్తగా పదాలు కనిపెట్టినట్టు ఫోజులు కొడుతున్నారు. ఉన్న సరళమైన తెలుగు పదాలకు వీళ్ల పైత్యం తగిలించి.. వాటి రూపురేఖలు మార్చేస్తున్నారు.
ఇక్కడ ఓ విచిత్రం గురించి చెప్పుకోవాలి. ప్రస్తుతం ఓ పెద్ద తెలుగు సినిమాకి డైలాగ్స్ రాసే రచయితకు సరిగ్గా తెలుగే రాదు. ఆయనగారు ఇంగ్లీష్ లో తెలుగు డైలాగ్స్ ను రాస్తాడు. అసలు తెలుగు రాకుండా, అతగాడు తెలుగు మాటలు ఏం రాస్తాడు ?, ఇలాంటి వారిని ప్రోత్సహించకూడదు అని మనకైనా బుద్ధి ఉండక్కర్లా ?. అందుకే.. తెలుగు రాని వారి సినిమాలను తెలుగు ప్రేక్షకులు అస్సలు చూడకూడదు అని ఒక నియమం పెట్టుకోవాలి. అప్పుడే తెలుగు సినిమాతో పాటు తెలుగు భాష కూడా పది కాలాల పాటు చల్లగా ఉంటుంది. అప్పుడే సినిమాల్లో తెలుగు మళ్లీ ఒక వెలుగు వెలుగుతుంది.