SP Balu Death Anniversary: గాన గంధర్వుడు.. డాక్టర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం( Dr SP Balasubrahmanyam ). ఇండియన్ సినీ హిస్టరీలో తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న గొప్ప కళాకారుడు. పాటకు నూతన ఒరవడి నేర్పారు. తన గాత్రంతో శ్రోతల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించారు. స్వర చక్రవర్తిగా నీరాజనాలు అందుకున్నారు. భౌతికంగా దూరమై ఈరోజుకు ఐదేళ్లు అవుతోంది. కానీ ప్రతి చోట, ప్రతి నోటా ఆయన పాట వినిపిస్తూనే ఉంటుంది. ఆయన పాటకు లేదు మరణం. తన గాత్రంతో వీనుల విందుగా మధుర గానాలను ఆలపించి.. తన పని పూర్తి చేసుకుని సంగీత ప్రియులకు, అభిమానులకు కన్నీరు మిగులుస్తూ దివికే గారు బాలసుబ్రహ్మణ్యం.
కోట్లాదిమంది సంగీత ప్రియులకు ఆత్మానందాన్ని ఇచ్చిన మహా గాయకుడు డాక్టర్ ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం. తెలుగు,తమిళ, కన్నడ, హిందీ తదితర భాషల్లో వేల పాటలు పాడారు. ఆయన గలం నుంచి జాలువారే ప్రతి స్వరం ఈ దివిలో విరిసే పారిజాతమే. భౌతికంగా మన మధ్య లేకపోయినా.. ఆయన పాడిన వేలాది పాటలతో అందరి హృదయాల్లో చిరస్థాయిగా గుర్తుండిపోతారు. క్లాస్, మాస్, మెలోడీ అన్న తేడా లేకుండా తన గాత్రంతో ఆ పాటకు ప్రాణం పోసే సరస్వతీ పుత్రుడు బాలసుబ్రహ్మణ్యం. సామాన్య గాయకుడిగా వెండితెరపై అడుగుపెట్టి.. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ లాంటి భాషల్లో సుమారు 40 వేలకు పైగా పాటలు పాడిన ఘనత ఆయన సొంతం.
* కుటుంబ వివరాలు..
ఎస్పీ బాలు గా ఇండియన్ సినీ ఇండస్ట్రీకి( Indian cine industry ) సుపరిచితం. ఆయన పూర్తి పేరు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రమణ్యం. అభిమానులు ఆయనను ముద్దుగా బాలు అని పిలుస్తారు. ఎస్పీ బాలసుబ్రమణ్యం 1946 జూన్ 4న నెల్లూరులో సాంబమూర్తి, శకుంతలమ్మ దంపతులకు జన్మించారు. బాలుకి ఇద్దరు సోదరులు, నలుగురు చెల్లెల్లు ఉన్నారు. అందులో ఎస్పీ శైలజ, ఎస్పీ వసంత గాయకులుగా సుపరిచితులు. ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యానిది ప్రేమ వివాహం. ఆయన భార్య పేరు సావిత్రి. వీరికి పల్లవి, ఎస్పీ చరణ్ ఇద్దరు పిల్లలు. వెండితెరపై గాయకులుగా అడుగుపెట్టారు.
* తండ్రితో పాటు..
బాలసుబ్రమణ్యం తండ్రి సాంబమూర్తి( Samba Murthy ) హరికథ కళాకారుడు. భక్తి రస నాటకాలు కూడా వేస్తుంటారు. తండ్రిని చూస్తూ పెరిగిన బాలుకి చిన్నతనం నుంచి సంగీతంపై ఆసక్తి పెరిగింది. ఐదేళ్ల వయసులోనే తండ్రితో కలిసి భక్త రామదాసు అనే నాటకంలో నటించారు. ఆయన ప్రాథమిక విద్య నగరిలోని మేనమామ ఇంట సాగింది. తండ్రి కోరిక మేరకు ఇంజనీరింగ్ పూర్తి చేశారు బాలసుబ్రమణ్యం. అయితే సినిమాల్లో పాడాలన్న బలీయమైన కోరిక మాత్రం బాలులో ఉండేది. అలా ఇంజినీరింగ్ చదువుతున్న సమయంలోనే సంగీత దర్శకుడు కోదండపాణి శిష్యరికంలో.. 1966 డిసెంబర్ 15న శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న చిత్రంలో తొలిసారిగా పాట పాడే అవకాశం దక్కించుకున్నారు. తరువాత మరిన్ని అవకాశాలు తలుపు తట్టాయి. తెలుగులోనే కాకుండా తమిళ చిత్రాల్లో ఎక్కువగా అవకాశాలు వచ్చాయి. సినిమా హీరోల గాత్రానికి తగ్గట్టు పాడడం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రత్యేకత.
* బహుముఖ ప్రజ్ఞాశాలి
ఒకవైపు నేపథ్య గాయకుడిగా పాటలు పాడుతూనే మ్యూజిక్ డైరెక్టర్గా.. డబ్బింగ్ హోస్టుగా, నటుడిగా.. ఇలా బహుముఖంగా తనదైన నైపుణ్యాన్ని కనబరిచేవారు. 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానంలో ఆరు జాతీయ పురస్కారాలు, ఆరు ఫిలిం ఫేర్ దక్షిణాది పురస్కారాలు, ఒక ఫిలిం ఫేర్ పురస్కారం అందుకున్నారు. 11 భాషల్లో 40 వేల పాటలు పాడి.. 40 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించడం ఒక అరుదైన రికార్డ్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 29 సార్లు నంది అవార్డులు అందుకున్నారు. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్, డాక్టరేట్ వంటి అనేక బిరుదులు అందుకున్న ఘనత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానిది. 2020 ఆగస్టు 5న కరోనాతో మృతి చెందారు బాలసుబ్రహ్మణ్యం. ఆసుపత్రిలో వైద్య చికిత్సలు పొంది.. కోలుకొని తిరిగి వస్తారని అంతా భావించారు. కానీ అంతర్యామీ అలసితి సొలసితి అంటూ దివికే గారు. కానీ ఆ గానగంధర్వుడు భౌతికంగా దూరమై ఐదేళ్లు కావస్తున్నా.. ఇప్పటికీ తెలుగు ప్రజల గుండెల్లో పాటల రూపంలో మెదులుతూనే ఉన్నారు.