Bollywood : ఓడలు బండ్లు బండ్లు ఓడలు అవుతాయనే సామెత ఉండనే ఉంది. ఒకప్పుడు బాలీవుడ్ దేశంలోనే అతిపెద్ద చిత్ర పరిశ్రమగా ఉండేది. వందల కోట్ల బడ్జెట్ చిత్రాలు అక్కడే తెరకెక్కేవి. హిందీ నేషనల్ లాంగ్వేజ్ కావడంతో ఇతర రాష్ట్రాల్లో కూడా ఆ చిత్రాలకు మార్కెట్ ఉంటుంది. అది వారికి కలిసొచ్చే అంశం. సాంకేతికంగా కూడా బాలీవుడ్ ఇతర చిత్ర పరిశ్రమల కంటే ముందుండేది. ఇప్పుడు పరిస్థితి మారింది. టాలీవుడ్ ఇండియన్ సినిమాను శాసిస్తుంది. అలాగే సౌత్ ఇండస్ట్రీస్ బాలీవుడ్ కి ధీటుగా ఎదిగాయి.
సౌత్ హీరోలు, వారు నటించిన చిత్రాలు నార్త్ లో సత్తా చాటుతున్నాయి. గతంలో పదేళ్లకో ఇరవై ఏళ్లకో ఒక చిత్రం హిందీలో ఆదరణ దక్కించుకునేది. ఇప్పుడా సంఖ్య పెరిగింది. చెప్పాలంటే బాహుబలి అనంతరం సినారియో మారిపోయింది. మూవీలో విషయం ఉంటే ప్రాంతీయ భాషా బేధాలు లేకుండా ప్రేక్షకులు ఆదరిస్తారనే స్పష్టత వచ్చింది. నిర్మాతలు వందల కోట్ల బడ్జెట్ తో చిత్రాలు నిర్మించేందుకు ఆసక్తి చూపుతున్నారు.
బాహుబలి 2 వరల్డ్ వైడ్ రూ. 1800 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఇండియా పరిధిలో ఈ చిత్ర వసూళ్లను అధిగమించిన మూవీ మరొకటి రాలేదు. వరల్డ్ వైడ్ దంగల్ అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ సినిమాగా ఉంది. బాహుబలి 2 అనంతరం కెజిఎఫ్ నార్త్ లో సత్తా చాటింది. దీనికి కొనసాగింపుగా వచ్చిన కెజిఎఫ్ 2 రికార్డు బ్రేకింగ్ వసూళ్లు రాబట్టింది. నార్త్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకర్షించింది. యష్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.
నార్త్ లో సత్తా చాటిన మరొక హీరో అల్లు అర్జున్. 2021లో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన పుష్ప ఏకంగా రూ. 100 కోట్ల మార్క్ చేరుకుంది. అల్లు అర్జున్ కి విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది. దీనికి కొనసాగింపుగా వస్తున్న పుష్ప 2 హిందీ రైట్స్ రికార్డు స్థాయిలో అమ్ముడుపోయాయి. పుష్ప 2 నార్త్ ఇండియాలో భారీ విజయం సాధించడం ఖాయం అంటున్నారు.
రాజమౌళి తెరకెక్కించిన మరొక విజువల్ వండర్ ఆర్ ఆర్ ఆర్. ఈ మూవీ నార్త్ లో రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఎన్టీఆర్, రామ్ చరణ్ లకు ఫేమ్ తెచ్చిపెట్టింది. దేవర మూవీతో ఎన్టీఆర్ సోలోగా సత్తా చాటాడు. దేవర హిందీ వెర్షన్ రూ. 60 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. చిన్న సినిమాలు సైతం కుమ్మేస్తున్నాయి. కాంతార, కార్తికేయ 2, సీతారామం హిందీలో చెప్పుకోదగ్గ ఆదరణ దక్కించుకున్నాయి.
సౌత్ ఇండియా ఫ్లేవర్ నార్త్ ఆడియన్స్ కి విపరీతంగా నచ్చేస్తుంది. అదే సమయంలో అక్కడి స్టార్స్ కనీస విజయాలు దక్కక ఊరూరు మంటున్నారు. ఒకప్పుడు వరుస హిట్స్ ఇచ్చిన అక్షయ్ కుమార్ పరిస్థితి దారుణంగా ఉంది. హృతిక్ సంగతి కూడా అంతే. ఫైటర్ మూవీతో ఫార్మ్ లోకి వచ్చాడు. సల్మాన్ ఖాన్, అమిర్ ఖాన్ ఒక్క హిట్ అంటూ విశ్వ ప్రయత్నం చేస్తున్నారు.
షారుఖ్ ఖాన్ మాత్రమే జోరుమీదున్నారు. అది కూడా దశాబ్దం తర్వాత 2023లో ఆయనకు పఠాన్ రూపంలో విజయం దక్కింది. అనంతరం విడుదలైన జవాన్ మరో భారీ హిట్. డంకీ పర్లేదు అనిపించుకుంది. రాజ్ కుమార్ రావ్, ఆర్యన్ కార్తీక్ వంటి చిన్న హీరోలు భారీ విజయాలు నమోదు చేయడం విశేషం..