Soori comedian : రీల్ లైఫ్ లో చాలామంది హీరోలు ఉంటారు. కానీ, రియల్ లైఫ్ లో వారు హీరోలు కాలేరు. ఎందుకంటే పిల్లికి భిక్షం కూడా పెట్టరు.. ఎంగిలి చేత్తో కాకిని కూడా కొట్టరు. తెరమీద మాత్రం బిల్డప్పులు ఇవ్వమంటే బీభత్సంగా ఇస్తుంటారు. కానీ కొందరు సినిమాలలో హీరోలు కారు. కమెడియన్లు గా ఉంటారు. వచ్చే డబ్బుల్లో కొంత సమాజసేవ కోసం ఖర్చు పెడుతుంటారు. తాము చేసిన సహాయాన్ని చెప్పుకోరు. కుడి చేత్తో పెట్టిన దాన్ని ఎడమ చేతికి తెలియకుండా జాగ్రత్త పడతారు. అటువంటి వారిలో ఇతడు మొదటి స్థానంలో ఉంటాడు.
అది తమిళనాడు రాష్ట్రం.. మధురై ప్రాంతం.. అక్కడ ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఒక హోటల్ ఉంది. అక్కడ అత్యంత పరిశుభ్రమైన వాతావరణముంది. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన రోగులు ఆ హోటల్లోకి వస్తున్నారు. బ్రహ్మాండంగా తినేసి వెళ్తున్నారు. కొందరేమో డబ్బులు ఇస్తున్నారు. మరికొందరేమో ఉచితంగా తిని వెళ్తున్నారు. అలాగని అది ఆశ్రమం కాదు.. పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు విరాళం ఇస్తే నడుస్తున్న సంస్థ కూడా కాదు. ఒక మామూలు హోటల్ అది.. దానిని నడుపుతున్నది ఒక కమెడియన్.
తమిళనాడులో హాస్య నటుడు సూరి గురించి తెలియని వారు ఉండరు. సూరి ఎన్నో సినిమాలలో నటించాడు. సినిమాల్లో నటించగా వచ్చిన డబ్బును అడ్డగోలుగా ఖర్చు పెట్టలేదు. దాచుకున్నాడు. కొన్ని ఆస్తులను కొనుగోలు చేశాడు. డబ్బు లేని స్థితి నుంచి.. డబ్బులు సంపాదించే స్థితికి దాకా అతడు వచ్చాడు. డబ్బులు చూసిన తర్వాత అతడు మామూలు మనిషి లాగానే ఉన్నాడు. కాకపోతే తాను డబ్బు లేనప్పుడు పడిన ఇబ్బందులు గుర్తుకొచ్చి.. అటువంటివారిని ఆదుకోవాలని ముందుకు వచ్చాడు. అందువల్లే ఆస్పత్రుల్లో చికిత్స పొందేందుకు వచ్చే రోగులకు కడుపు నింపడం మొదలుపెట్టాడు. మధురై లో మొదలుపెట్టిన తన ప్రస్థానాన్ని పది బ్రాంచ్ లకు విస్తరించాడు. తమిళనాడులో అనేక ప్రాంతాలలో హోటల్స్ ఏర్పాటు చేశాడు. అవన్నీ కూడా ప్రభుత్వ ఆసుపత్రులకు ఎదురుగా ఉంటాయి.
సూరి ఏర్పాటు చేసిన హోటల్ లో అద్భుతమైన సౌకర్యాలు ఉంటాయి. ఇంటీరియర్ సూపర్ గా ఉంటుంది. వంటలు మహా రుచిగా ఉంటాయి. కానీ, ఇందులో నిర్ణీత రుసుము అనేది ఉండదు. ఎందుకంటే ఈ హోటళ్ళు ఏర్పాటు చేసింది కేవలం పేద రోగుల కడుపు నింపడానికి. అందులో భాగంగానే వారికి కడుపునిండా భోజనం పెడతారు. ఉదయం టిఫిన్.. మధ్యాహ్నం భోజనం.. సాయంత్రం భోజనం పెడతారు. కాఫీ, టీ, పాలు కూడా ఇస్తారు. ఉచితంగా పెడుతున్నామని రోగుల మీద అరవరు. నీచంగా చూడరు. చులకనగా వ్యవహరించరు. శుచి విషయంలో.. శుభ్రత విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కారు.. పైగా సూరి తన హోటళ్లకు అమ్మన్ అని పేరు పెట్టాడు. తమిళనాడులో అమ్మన్ అంటే అమ్మ అని అర్థం.. హైదరాబాద్ నగరంలో కూడా పెద్దపెద్ద ప్రభుత్వ ఆసుపత్రులు ఎదుట కొంతమంది వ్యక్తులు వ్యాన్లలో ఆహారాన్ని తీసుకొచ్చి రోగులకు పెడుతుంటారు. ఇది మంచి పద్ధతి అయినప్పటికీ.. సూరి మాదిరిగా హోటల్స్ ఏర్పాటు చేసి భోజనం పెట్టే వారు మాత్రం లేరు.
తమిళనాడులో సూరి ప్రయాణం కూడా అత్యంత స్ఫూర్తిదాయకమైనది. అడ్డా లో కూలిగా పనిచేశాడు. తొలి సినిమాలో తిండిపోతు పాత్రను పోషించాడు. అందులో అతను నిత్యం పరోటాలు తింటూనే ఉంటాడు. తిండి విలువ అతనికి తెలుసు. ఆకలితో బాధపడే వారి వేదన తెలుసు. అందువల్లే ఈ తరహా హోటల్స్ ఏర్పాటు చేశాడు. అన్నదాత సుఖీభవ అంటాం కదా.. సూరి హోటల్స్ లో తిన్న వారంతా అతడిని అదేవిధంగా దీవిస్తుంటారు. ఆ దీవెనలే తనకు కోట్ల రూపాయల బహుమానం అని సూరి భావిస్తుంటాడు. అదే విషయాన్ని గొప్పగా చెప్పుకుంటాడు.