
Sobhan Babu: అలనాటి అందాల నటుడు ‘శోభన్ బాబు’ ఇప్పటికీ తెలుగు ప్రేక్షకుల మదిలో అందాల సోగ్గాడుగా శాశ్వతంగా తెలుగు వెండితెర పై నిలిచిపోయారు. అది ఆయన కల. అందుకే, చివరి దశలో ఎన్నో పెద్ద సినిమాల్లో అవకాశాలు వచ్చినా.. ఆయన ఏ అవకాశాన్ని అంగీకరించలేదు. నిర్మాతలు బ్లాంక్ చెక్ లు ఇచ్చి.. అధితి పాత్రలు చేయమని ప్రాధేయ పడినా.. ఆయన ఎన్నడూ చలించలేదు.
అయితే, ఇదే విషయం పై దర్శకుడు కోదండరామిరెడ్డికి శోభన్ బాబుకు మధ్య ఒక చర్చ జరిగింది. వీరిద్దరూ మంచి స్నేహితులు. అందుకే, వీరి మధ్య ఎటువంటి దాపరికాలు ఉండేవి కావు. ఆ రోజుల్లో శోభన్ బాబుతో ప్రతి నటుడు.. ఆ మాటకొస్తే ప్రతి సినిమా వ్యక్తి స్నేహంగా ఉండటానికి ఎక్కువ ఆసక్తి చూపించేవారు.
కానీ శోభన్ బాబు మాత్రం నలుగురు ఐదుగురుతోనే చనువుగా అతి దగ్గరగా ఉండేవారు. ఆ వ్యక్తుల్లో దర్శకుడు కోదండరామిరెడ్డి కూడా ఒకరు. అందుకే, కోదండరామిరెడ్డి తనకు ఎటువంటి సమస్య వచ్చినా శోభన్ బాబును కలిసి తన సమస్య చెప్పుకుని ఆయన సలహా తీసుకునేవాడు. అయితే సినిమా ఇండస్ట్రీ మొత్తం హైదరాబాద్ వచ్చేసింది. అయినా శోభన్ బాబు మాత్రం మద్రాసులోనే ఉండిపోయారు.
కానీ వీరి మధ్య స్నేహబంధం చెక్కుచెదరలేదు. కోదండరామిరెడ్డి ఎప్పుడు మద్రాసు వెళ్లినా.. మొదట వెళ్ళేది శోభన్ బాబు వద్దకే. అందుకు తగ్గట్టుగానే శోభన్ బాబు కూడా కోదండరామిరెడ్డిని ప్రత్యేకంగా ఆహ్వానిచేవాడు. స్నేహితుడు వచ్చాడని రకరకాల స్వీట్లు చేయించి.. ‘తినవయ్యా.. మేం ఎలాగూ తినలేం, నువైనా తినురా’ అని బలవంతంగా తినిపించేవారట.
ఇక ‘అప్పుడప్పుడన్నా గెస్ట్ రోల్స్ లోనైనా సినిమాల్లో నటించవచ్చుగా ?’ అంటే.. ఒక నిముషం ఆలోచించి.. ‘ఆ శోభన్‌బాబు ఇక లేడురా.. జుట్టు ఊడిపోయింది. వయసు పెరిగి దవడలు జారిపోయాయి. అందుకే సినిమాలకు దూరం అయ్యాను’ అని శోభన్‌బాబు ఎమోషనల్ గా చెప్పేవారట.