
టాలీవుడ్ లో ట్రెండ్స్ ఎప్పటికప్పుడు మారుతున్నాయి. గతంలో ఆడియో రిలీజ్ ముందు పోస్టర్లు, ఫస్ట్ లుక్స్ రిలీజ్ చేసేవారు. సినిమాలు మొదలు పెట్టేప్పుడు కూడా వదిలేవారు. ఇప్పుడు ట్రెండ్ ఏమంటే.. హీరోల బర్త్ డేస్. అంతకు మించిన బెస్ట్ అకేషన్ లేదన్నట్టుగా మారిపోయింది పరిస్థితి. ఇక, స్టార్ హీరో పుట్టిన రోజు అంటే.. ఆ హంగామానే వేరు. ఖచ్చితంగా ఆ రోజు ఆ హీరో అప్ కమింగ్ సినిమాకు సంబంధించి ఏదో ఒక అప్డేట్ ఫ్యాన్స్ కోసం ఇవ్వాల్సిందే అన్న ట్రెండ్ ప్రస్తుతం కొనసాగుతోంది. వచ్చే నెలలో పవర్ స్టార్ బర్త్ డే ఉంది. అయితే.. ఈ సారి ఒక్కటి కాదు.. ఏకంగా ఆరు అప్డేట్స్ రాబోతున్నాయన్న వార్త ఫిల్మ్ నగర్లో మోత మోగుతోంది.
రీ-ఎంట్రీలో.. లేడీ ఓరియంటెడ్ స్టోరీతో వచ్చినప్పటికీ.. పవర్ స్టార్ లేపిన దుమ్ము అంతా ఇంతా కాదు. వకీల్ సాబ్ గా విశ్వరూపం చూపించిన పవన్.. తన రేంజ్ ఏంటన్నది మరోసారి చాటి చెప్పాడు. ఇక, ఇప్పుడు పవర్ స్టార్ కిట్ లో ఐదు సినిమాలు ఉన్నాయి. ఇందులో ముందుగా రాబోతున్నది అయ్యప్పనుమ్ కోషియం రీమేక్. భళ్లాల దేవ రానా – పవన్ ఢీకొనబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేయబోతున్నారు. ఆగస్టు 15న ఉదయం 10.45 గంటలకు ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. పవన్ ఫ్యాన్స్ కు ఇది మొదటి సర్ ప్రైజ్.
ఆ తర్వాత పవన్ బర్త్ డే. సెప్టెంబర్ 2వ తేదీ పవర్ స్టార్ పుట్టిన రోజు. ఈ సారి పవన్ బర్త్ డే సెలబ్రేషన్స్ దుమ్ము లేచిపోయేలా నిర్వహించాలని ఫ్యాన్స్ చూస్తున్నారు. ఈ రోజునే.. పవన్ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ వరుస కట్టబోతున్నాయి. అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ టైటిల్ ను ‘భీమ్లా నాయక్’గా ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఫస్ట్ లుక్ తో పాటు ఫస్ట్ సింగిల్ ను కూడా రిలీజ్ చేయబోతున్నట్టు సమాచారం.
ఇక, మూడో అప్డేట్ హరిహర వీరమల్లు నుంచి రాబోతోంది. క్రియేటివ్ దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న హిస్టారికల్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి సంబంధించిన టైటిల్ ను ఇదివరకే ప్రకటించారు. ఇప్పుడు.. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మేకింగ్ వీడియోను రిలీజ్ చేయబోతున్నట్టు టాక్. దీంతోపాటు హరీష్ శంకర్ దర్శకత్వంలో రాబోతున్న చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నట్టు సమాచారం.
ఈ నాలుగింటితోపాటు మరో రెండు అప్డేట్స్ కూడా ఉన్నాయని ప్రచారం సాగుతోంది. పవర్ స్టార్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతోపాటు పవన్ భక్తుడు బండ్ల గణేష్ నిర్మాతగా మరో సినిమాకు సైతం గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ రెండు చిత్రాలకు సంబంధించిన వివరాలను కూడా పవన్ బర్త్ డే సందర్భంగా రివీల్ చేయనున్నట్టు ప్రచారం సాగుతోంది. ఈ విధంగా.. పవర్ స్టార్ పుట్టిన రోజున ఫ్యాన్స్ కు పూనకాలేనని అంటున్నారు.