
తెలుగు వెండితెరకు డ్యాన్స్ ను పరిచయం చేసింది అక్కినేని అయితే, ఆ డ్యాన్స్ ను ప్రేక్షకులకు అలవాటు చేసింది మాత్రం చిరంజీవినే. అప్పట్లో చిరు స్టెప్స్ కోసం ఒక్కో సినిమాని రెండు మూడు సార్లు చూసేవారు. అంత గొప్పగా మెగాస్టార్ డ్యాన్స్ చేసేవారు. ఒక్క డ్యాన్సే కాదు, నటనలోనూ చిరు మెగాస్టార్ అనిపించుకున్నారు. అవి ‘అభిలాష’ సినిమా షూటింగ్ జరుగుతున్న రోజులు.
నంబర్ వన్ హీరోగా చిరంజీవి అప్పుడే ఎదుగుతున్న రోజులు అవి. వైజాగ్ లో ఓ జైలులో షూటింగ్ ప్లాన్ చేశారు. అయితే, ఆ జైలులో షూటింగ్ చేసుకోవడానికి కేవలం కొన్ని రోజులు మాత్రమే అనుమతి ఇచ్చారు. దాంతో ముందుగా అందరూ సమయం చూసుకోకుండా పని చేద్దాం అని నిర్ణయించుకున్నారు. అందుకే పొద్దున్నే ఏడు గంటల లోపు షూట్ మొదలుపెట్టేవారు.
సాయంత్రం ఏడు అవుతుంది, చిరంజీవి విశ్రాంతి కూడా తీసుకోవడం లేదు. తన షూటింగ్ పార్ట్ సాయంత్రమే అయిపోయింది. అయినా సెట్ లో చిరు అటు ఇటు తిరుగుతూ అందర్నీ ఎంకరేజ్ చేస్తున్నారు. రాత్రి పన్నెండు వరకు షూటింగ్ జరుపుతూనే ఉన్నారు. అప్పటి వరకు తోటి నటీనటులు పని చేయడానికి కారణం చిరంజీవి సెట్ లో ఉండటమే.
నిర్మాత గురించి, సినిమా గురించి అంత కష్టపడేవారు చిరు. పైగా అదే రోజు అర్ధరాత్రి దర్శకుడు కోదండరామిరెడ్డి ‘నవ్వింది మల్లెచెండు’ పాట షూటింగ్ ప్లాన్ చేద్దామని రిక్వెస్ట్ చేస్తే.. మరో మాట మాట్లాడుకుండా.. తన స్టెప్స్ ను తానే కంపోజ్ చేసుకుంటూ హీరోయిన్ కి కూడా స్టెప్స్ నేర్పుతూ ఆ పాట షూటింగ్ ను పూర్తి చేశారు చిరంజీవి. ఆ స్టెప్స్ ఎంత గొప్పగా హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఇక అప్పటికే సూర్యోదయం సమయం అయింది. అప్పుడు దర్శకుడు ఒక ఆలోచన వచ్చింది. సూర్యోదయన బీచ్ లో షాట్స్ తీయాలని. మరో హీరో అయితే, మరో రోజు పెట్టుకుందాం అనేవాడు. కానీ అక్కడ ఉన్నది మెగాస్టార్ కదా.. వెంటనే క్యాస్టూమ్స్ తో సహా బీచ్ దగ్గరకు వాలిపోయారు. రాత్రి అంతా షూటింగ్ లో ఉండి, ఉదయం కూడా షూటింగ్ అంటే నేను రాలేను అంటారు.
కానీ చిరు సినిమా కోసం బ్రేక్ లేకుండా వరుసగా రెండు రోజులు షూట్ లో పాల్గొన్నారు. పైగా తన స్టెప్స్ ను తానే కంపోజ్ చేసుకుని సాంగ్ ఫినిష్ చేశారు. అది చిరంజివి అంటే.