యంగ్ హీరో ‘సిద్ధు జొన్నలగడ్డ’ హీరోగా ఎంట్రీ ఇచ్చి ఎనిమిది సంవత్సరాలు దాటింది. కానీ, మనోడ్ని ఒక హీరోగా గుర్తించింది మాత్రం ఒక్క సితార ఎంటర్ టైన్ మెంట్స్ మాత్రమే . పోనిలే కనీసం సితార అయినా సిద్ధులో హీరో ఉన్నాడు అని నమ్మింది. అదే మిగిలిన బడా నిర్మాణ సంస్థలు ఏవి సిద్దుని ఎంకరేజ్ చేయలేదు. పైగా సిద్ధూ అతి కష్టం మీద చేసిన ‘కృష్ణ అండ్ హీజ్ లీలా’ లాంటి మోడ్రన్ రొమాంటిక్ సినిమాని కూడా రిలీజ్ చేయడానికి ముందుకు రాలేదు.
ఆహాలో కూడా అతి కష్టం మీద ఆ సినిమాని రిలీజ్ చేశారు. కానీ తాజాగా సిద్ధూకు అవకాశాలు వస్తున్నాయి. సిద్దు జొన్నలగడ్డ, తమిళంలో ఇటీవల బాగా పేరు తెచ్చుకున్న నటుడు అర్జున్ దాస్ కలయికలో ఒక సినిమా రాబోతుంది. అర్జున్ దాస్, సిద్దు జొన్నలగడ్డ కాంబినేషన్ అంటే.. ఈ సినిమా రెండు భాషల్లో క్రేజ్ ఉండే అవకాశం ఉంది.

కాగా సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ రోజు ఘనంగా ప్రారంభమైంది. త్రివిక్రమ్, నిర్మాత ఎస్.రాధాకృష్ణ (చినబాబు) ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా హాజరవ్వడం విశేషం. ఇక నూతన దర్శకుడు శౌరి చంద్రశేఖర్ టి. రమేష్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమా గ్రామీణ నేపథ్యంలో సాగే పూర్తి ప్రేమ కథా చిత్రమని తెలుస్తోంది.
ఆగస్టు నెలలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుందని నిర్మాతలు చెప్పుకొచ్చారు. “కప్పేలా” అనే మలయాళ సినిమాకి ఇది రీమేక్ అని సమాచారం. అన్నట్టు ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కీలకం అని, ఇద్దరు హీరోలు ఆ హీరోయిన్ తో ప్రేమలో పడి చివరకు ఏమి చేశారు అనేదే సినిమా మెయిన్ పాయింట్ అని టాక్. మరి ఈ సినిమాతో సిద్దుకి భారీ బ్రేక్ వస్తోందేమో చూడాలి.