Kangana Ranaut: బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తరచూ వివాదాల్లో చిక్కుకుంటోంది. ఇటీవల భారత స్వాతంత్య్రంపై స్పందించిన కంగనా.. 1947లో దేశానికి వచ్చిన స్వాతంత్య్రం ఓ భిక్ష అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. అయితే, ఈ విషయంపై ఓ వైపు రాజకీయనాయకులతో పాటు, నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కంగనా రనౌత్ నాటి స్వాతంత్య్ర ఉద్యమాన్ని అవమానించారని శివసేన అధికారపత్రిక సామ్నా సంపాదకీయంలో విరుచుకుపడింది. స్వాతంత్య్ర పోరాటంలో ప్రాణాలను త్యాగం చేసిన అమరవీరులను అవమానించేలా కంగనా వ్యాఖ్యలు చేసిందని.. వెంటనే ఆమెకు ప్రదానం చేసిన పద్మశ్రీని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది.
దేశానికి 1947లో వచ్చిన స్వాతంత్య్రాన్ని ఓ భిక్షగా అభివర్ణించిన కంగనా.. నిజమైన స్వాతంత్య్రం నరేంద్ర మోదీ దేశ ప్రధాని అయినప్పుడు 2014లో వచ్చిందంటూ వ్యాఖ్యానించింది. 150 ఏళ్ల పోరాటం తర్వాత విదేశీ బానిసత్వం నుంచి దేశానికి విముక్తి లభించిన సంగతి తెలిసిందే. అయితే ఎంతో మంది త్యాగాలు చేసి సాధించిన స్వాతంత్రాన్ని ఓ భిక్షగా పేర్కొనడం.. స్వాతంత్య్ర వీరులను అవమానించడమేనంటూ సామ్నా సంపాదకీయం అభ్యంతరం వ్యక్తంచేసింది.
కాగా, కంగనాకు ఇటీవల పద్మశ్రీ పురస్కారం లభించింది. దేశానికి ఆమె చేసిన సేవలను గుర్తించి ఈ అవార్డును ప్రదానం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఆ సమయంలోనూ పలు వివాదాస్పద వ్యాఖ్యలతో నెట్టింట హాట్‌టాపిక్‌గా నిలిచింది కంగనా. కంగనకు ఈ వివాదాలు కొత్తేం కాదు. గతంలోనూ అనేక మార్లు రాజకీయ, సినీ పరిశ్రమ అంశాలపై అనేక వ్యాఖ్యలు చేసింది. వాటిని సమర్థించిన వారు కొందరుంటే.. మరికొందరు తప్పుబట్టారు.