spot_img
Homeఎంటర్టైన్మెంట్Biker Movie Review: బైకర్.. రేసింగ్ లు నచ్చేవారికి ఓకే

Biker Movie Review: బైకర్.. రేసింగ్ లు నచ్చేవారికి ఓకే

Biker Movie Review: రివ్యూ: బైకర్
నటీనటులు: శర్వానంద్, డా. రాజశేఖర్, మాళవిక నాయర్, బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి తదితరులు.
సంగీతం: జిబ్రాన్
ఛాయాగ్రహణం: జె. యువరాజ్
ఎడిటర్: అనిల్ పసల
దర్శకత్వం: అభిలాష్ రెడ్డి
నిర్మాతలు: ప్రమోద్ ఉప్పలపాటి, వంశీకృష్ణా రెడ్డి

చాలా కాలంగా ఒక సాలిడ్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న శర్వానంద్ కు సంక్రాంతి సీజన్ లో నారీ నారీ నడుమ మురారి సినిమాతో కాస్త ఊరట దక్కింది కానీ భారీ సక్సెస్ అయితే దక్కలేదు. దీంతో రూటు మార్చి ‘మోటోక్రాస్ రేసింగ్’ అనే సరికొత్త నేపథ్యంలో తెరకెక్కిన బైకర్ ఆనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మోటోక్రాస్ రేసింగ్ అనగానే అదేదో బ్రహ్మ పదార్థం అనుకోవాల్సిన అవసరం లేదు. మన మోటు భాషలో చెప్పుకుంటే బైక్ రేసింగ్ కాంపిటీషన్. మనకు బైక్ రేసింగ్ అనగానే చప్రీలు బైకులను నిర్లక్ష్యంగా నడపడం, యాక్సిడెంట్లు కావడం, చనిపోవడం ఆనే న్యూసులే మన మనసులో మెదులుతాయి. కానీ ఇదే రేసింగ్ ను ప్రొఫెషనల్ గా చేసేవారు ఎంతో విభిన్నంగా ఉంటారు. ఎంతో బాధ్యతగా వ్యవహరిస్తారు. దాని వెనక ఎంతో టెక్నాలజీ కూడా ఉంటుంది. బైకర్ సినిమా ఆసాంతం ఈ బైక్ రేసింగ్ చుట్టూనే తిరుగుతుంది. ఇలాంటి విభిన్న నేపథ్యంతో తెరకెక్కిన ఈ స్పోర్ట్స్ డ్రామా ప్రేక్షకులను ఏ మేరకు అలరించిందో రివ్యూలో చూద్దాం.

వికాస్ నారాయణ్(శర్వానంద్) కోయంబత్తూర్ లో ఒక బైక్ రేసర్. తనకు బైక్ రేసింగ్ లో గురువు ఎవరో కాదు..తన తండ్రి సునీల్ నారాయణ్(డా. రాజశేఖర్). సునీల్ నారాయణ్ గతంలో బైక్ రేసింగ్ లెజెండ్, ఆయనను బుల్లెట్ సునీల్ అని పిలుస్తారు. ఎన్నో ఛాంపియన్ షిప్ లు, టైటిల్స్ గెలిచినప్పటికీ కొన్ని కారణాల వల్ల ఆయనకు రావాల్సినంత గుర్తింపు, సక్సెస్ రాదు. దీంతో తన కొడుకుని బైక్ రేసింగ్ ఛాంపియన్ గా తీర్చిదిద్దాలని తపన పడుతుంటాడు. వ్యక్తిగత విజయం కంటే ఆట గొప్పదని నమ్ముతాడు ఆయన. తన కొడుకుని ఛాంపియన్ గా చూడాలని కఠినమైన ట్రైనింగ్ ఇస్తున్నప్పటికీ, ఒక్కోసారి టైమ్ కలిసిరాదు కదా.. తానొకటి తాలిస్తే దైవమొకటి తలచినట్టుగా ఆయన అనుకున్నట్టుగా కాకుండా వికాస్ తన స్నేహితురాలు అనన్య(మాళవిక నాయర్) తో ప్రేమలో పడడంతో పాటూ చాలా దూరం వెళ్ళడంతో అమ్మాయి ప్రెగ్నెంట్ అవుతుంది. ఇవి చాలదన్నట్టు శర్వానంద్ తన తండ్రికి తెలియకుండా వెంటనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. అదే సమయంలో ఒక ఇంటర్నేషనల్ కాంపిటీషన్ లో ఐయన్ జీ కంపెనీ తరఫున పాల్గొనే అవకాశం వస్తుంది. ఆ కంపెనీ ఓనర్ ఇంద్రనీల్(అతుల్ కులకర్ణి) ఎలాగైనా రేసింగ్ కాంపిటీషన్ లో శర్వా ద్వారా కప్ గెలవాలనుకుంటాడు. కానీ కొన్ని కారణాల వల్ల శర్వానంద్ కప్ గెలవలేకపోతాడు. దీంతో శర్వానంద్ ను స్పాన్సర్ చేసిన కంపెనీ పూర్తిగా వ్యతిరేకం అవుతుంది. పైగా తండ్రి కొడుకులు కూడా దూరం అవుతారు. ఇలాంటి పరిస్థితి నుంచి బైటపడి శర్వానంద్ తన తండ్రి ఆకాంక్షను ఎలా నెరవేర్చాడు అనేది మిగతా కథ.

స్పోర్ట్స్ డ్రామాలలో అతి ముఖ్యమైన అంశం ఏంటంటే ఎమోషన్. ఈ సినిమాలో చాలావరకూ ఆ ఎమోషన్ వర్క్ అవుట్ అయింది. తన తండ్రి ఎంతో టాలెంటెడ్ అయినప్పటికీ తగిన గుర్తింపు రాలేదు. తన తండ్రి కోల్పోయిన దాన్ని సాధించాలనే కొడుకు తపన ఈ సినిమాకు ఆయువుపట్టు. ఆ ప్రయత్నంలో తనకు ఎదురైన అడ్డంకులు, వాటిని ఎలా అధిగమించాడనేది చూపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. అయితే ఇండియాలో బైక్ రేసింగ్ అనేది పెద్దగా గుర్తింపు పొందిన ఆట కాదు. డానికితోడు స్పాన్సర్స్ దొరకడం కూడా కష్టం. సాధారణ ప్రజల్లో పెద్దగా పాపులారిటీ కూడా లేదు. ఇలాంటి వాటి చుట్టూ అల్లుకున్న కథలో కొన్ని లోటుపాట్లు ఉన్నప్పటికీ దర్శకుడు తను అనుకున్న పాయింట్ ను చెప్పగలిగాడు. లవ్ స్టోరీ వల్ల, ఫ్యామిలీ డ్రామా వల్ల కొంత డౌన్ అయినప్పటికీ ఓవరాల్ గా చూస్తే మాత్రం దర్శకుడి ప్రయత్నం మెచ్చుకోదగ్గది. ముఖ్యంగా బైక్ రేసింగ్ సీన్స్ చాలా బాగున్నాయి. అయితే ఇలాంటి స్పోర్ట్స్ డ్రామాలతో వచ్చిన చిక్కేంటంటే.. బైక్ రేసింగ్ లు, ఆ స్పీడ్ షాట్స్ అలవాటు లేనివాళ్లకు మాత్రం కాస్త ఇబ్బందిగా ఉంటుంది.

దర్శకుడు అభిలాష్ రెడ్డి ‘లూజర్’ వెబ్ సిరీస్‌తోనే స్పోర్ట్స్ డ్రామాలను డీల్ చేయడంలో తన ప్రతిభను నిరూపించుకున్నాడు. ఈ సినిమాలో బైక్ రేసింగ్ ను ఎంతో సహజంగా చూపించాడు. ముఖ్యంగా యువరాజ్ సినిమాటోగ్రఫీ, జిబ్రాన్ సంగీతం ఈ సినిమాకు ప్లస్ అయ్యాయి. అయితే రైటింగ్ డిపార్ట్మెంట్ మాత్రం కొంత మేరకు నిరాశపరిచింది. లవ్ స్టోరీ, ఫాదర్ సెంటిమెంట్ విషయంలో కొంత తడబడ్డారు. రొటీన్ ఫార్మాట్ కథనం ఎంచుకోవడం వల్ల, నేపథ్యం కొత్తది అయినప్పటికీ సినిమా అద్భుతంగా అయితే అనిపించదు.

శర్వానంద్ తన పాత్ర కోసం పడ్డ కష్టం ప్రతి ఫ్రేమ్‌లో కనిపించింది. ఒక యువ బైక్ రేసర్ పాత్రలో కనిపించడానికి బరువు తగ్గి సన్నబడం వల్ల పాత్రకు ఎంతో సహజత్వం వచ్చింది. చాలా కాలం తర్వాత రాజశేఖర్ ఒక పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించి మెప్పించారు. తండ్రీకొడుకుల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను మెప్పిస్తాయి. హీరోయిన్ మాళవిక పాత్ర బాగానే ఉంది కానీ ప్రతి స్పోర్ట్స్ డ్రామాలో లవర్ వల్ల, వైఫ్ వల్ల కెరీర్ పోతుంది ఆనే రకంగా ఉండడం మాత్రం ఒక రొటీన్ ఫార్మాట్ లాగా అనిపించింది. విలన్ ఇంద్రనీల్ పాత్రలో అతుల్ కులకర్ణి మెప్పించాడు. మచ్చా గా బ్రహ్మాజీ సహజంగా నటించాడు. శర్వానంద్ తో పోటీపడుతూ నటించిన అన్వర్ పాత్ర క్లైమాక్స్ కు ముందు ట్విస్ట్ బాగుంది.

ఈ సినిమా అందరూ ఆడియన్స్ ఎంజాయ్ చేసే రొటీన్ కమర్షియల్ సినిమా కాదు. బైక్ రేసింగ్, కార్ రేసింగ్ లాంటి వాటి గురించి కాస్తైనా అవగాహన ఉన్నవారు, ఆ స్పోర్ట్స్ ను ఎప్పుడైనా టీవీలలో చూసి ఎంజాయ్ చేసిన వారికి నచ్చుతుంది. అలా కాకుండా వెండితెరపై బైకులు అలా గాల్లో లేస్తూ, పడుతూ యాక్సిడెంట్లు అవుతూ ఉంటే టెన్షన్ పడేవారు, బోరింగ్ గా ఫీల్ అయ్యేవారికి అసలు సెట్ కాదు. వాళ్ళందరూ ఈ సినిమాకు దూరంగా ఉండడం మంచింది. ఇంకా చెప్పాలంటే F1 సినిమా నచ్చిన వారికి ఇది తెలుగులో ఒక మంచి ప్రయత్నం అనిపిస్తుంది. F1 అంటే అనిల్ రావిపూడి F2 సీరీస్ లో సినిమానా అని అడిగే వారు మాత్రం తూర్పు తిరిగి దణ్ణం పెట్టి సినిమాకు దూరంగా ఉండడం అందరికీ మంచిది.

సినిమాలో బాగోలేనివి ఇవీ:

1. స్పోర్ట్స్ డ్రామాల్లో ఉండే రొటీన్ సీన్స్
2. అనవసరమైన పాటలు

ఇందులో ఏం బాగున్నాయో తెలుసా?

1. శర్వానంద్, రాజశేఖర్ పెర్ఫార్మెన్స్.
2. టెక్నికల్ వాల్యూస్ & విజువల్స్.
3. ఉత్కంఠభరితమైన మోటోక్రాస్ రేసింగ్ సీక్వెన్సులు.
4. జిబ్రాన్ నేపథ్య సంగీతం.

రేటింగ్: 2.5/5

ఫైనల్ వర్డ్: జెన్యూన్ అటెంప్ట్

 

 

Ramu Kovuru
Ramu Kovuruhttps://oktelugu.com/
Ramu Kovuru is a writer having 10 plus years of experience. He has worked for websites writing movies content. He is also woriking in Telugu film industry as a writer for the past 5 years. He has good knowledge in cinema across the languages. He contributes to movie reviews.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular