దేశంలో కరోనా నివారణకు కేంద్రం 21రోజుల లాక్డౌన్ ప్రకటించింది. కరోనా ప్రభావంతో ఇప్పటికే షూటింగ్ వాయిదా పడ్డాయి. థియేటర్ల మూతపడటంతో చిత్రపరిశ్రమ ఇబ్బందులు ఎదుర్కొంటుంది. రోజువారీ షూటింగ్లో పాల్గొనే సినీ కార్మికులకు ఉపాధి దొరకక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో సినీ కార్మికులనే ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో ‘సీసీసీ(కరోనా క్రైసిస్ చారిటీ) మనకోసం ఏర్పాటైంది. ఇందులో సీని పెద్దలు సభ్యులుగా ఉంటారు. ఈ ఛారిటీ ఆధ్వర్యంలో సినీ కార్మికుల సంక్షేమానికి పలు సంక్షేమ కార్యక్రమాలను చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
‘సీసీసీ మనకోసం’ కమిటీకి ఇప్పటికే పలువురు సెలబెట్రీలు విరాళాలను ప్రకటించారు. ఈ జాబితాలో యంగ్ హీరో శర్వానంద్ చేరారు. సినీ కార్మికుల కోసం శర్వానంద్ 15లక్షల విరాళాన్ని ప్రకటించారు. ఆదివారం ‘ఐయామ్ శర్వానంద్’ అంటూ ట్వీటర్లో అడుగుపెట్టారు. ఆ వెంటనే సినీ కార్మికులను ఆదుకునేందుకు ‘సీసీసీ’కి 15లక్షల విరాళాన్ని ఇస్తున్నట్లు ప్రకటించారు.
దినసరి వేతనంతో పని చేసే కార్మికులు సినిమా కోసం అందరికంటే ఎక్కువగా కష్టపడుతుంటారని శర్వానంత్ తెలిపారు. కరోనా ఎఫెక్ట్ తో షూటింగ్ లు వాయిదా పడటంతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో కార్మికులను ఆదుకునేందుకు ఏర్పడిన ‘కరోనా క్రైసిస్ చారిటీ’కి తనవంతు సాయంగా రూ. 15లక్షలు ఇస్తున్నట్లు ట్వీటర్లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా కరోనా కట్టడికి ప్రజలంతా స్వీయనియంత్రణ పాటించాలని కోరారు. వైద్యులు అందించే సూచనలను పాటించి కరోనాను దూరంగా ఉండాలని శర్వానంద్ సూచించారు.