
Shaakuntalam Release Date: శాకుంతలం మూవీ టీమ్ ముచ్చటగా మూడోసారి విడుదల తేదీ ప్రకటించారు. దీంతో ఈసారైనా చెప్పిన ప్రకారం విడుదల చేస్తారా? అని ఆడియన్స్ అడుగుతున్నారు. యశోద మూవీతో సమంత సూపర్ హిట్ కొట్టారు. ఓ బేబీ అనంతరం ఆమె సోలోగా మరో విజయం సాధించారు. సమంతకున్న స్టార్ డమ్ రీత్యా భారీ బడ్జెట్ తో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తున్నారు. దర్శకుడు గుణశేఖర్ సమంత ప్రధాన పాత్రలో శాకుంతలం మూవీ తెరకెక్కించారు. పౌరాణిక గాథగా తెరకెక్కిన శాకుంతలం మూవీలో సమంత శకుంతలగా కనిపించనున్నారు.
ఇక సమంత ప్రియుడు దుష్యంతుడిగా మలయాళ నటుడు దేవ్ మోహన్ నటిస్తున్నారు. కీలకమైన దుర్వాస మహర్షి పాత్ర విలక్షణ నటుడు మోహన్ బాబు చేస్తున్నారు. దిల్ రాజు నిర్మాతగా ఉన్న శాకుంతలం చిత్రాన్ని రూ. 60 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మించారని సమాచారం. ఒక లేడీ ఓరియెంటెడ్ చిత్రానికి ఇంత బడ్జెట్ అంటే సాహసమే. అదే సమయంలో శాకుంతలం ప్రోమోలపై మిక్స్డ్ టాక్ వినిపించింది. కొందరైతే డైలీ సీరియల్ అంటూ ఎగతాళి చేశారు.
శాకుంతలం విడుదల తేదీ రెండు సార్లు వాయిదా పడింది. మొదట 2022 నవంబర్ లో విడుదల చేయాలని భావించారు. కాదని 2023 ఫిబ్రవరి 17కి వాయిదా వేశారు. ఆ తేదీన కూడా విడుదల చేయలేకపోయారు. ఈ క్రమంలో కొన్ని నెగిటివ్ కామెంట్స్ తెరపైకి వచ్చాయి. శాకుంతలం చిత్రాన్ని కొనేందుకు బయ్యర్లు ముందుకు రావడం లేదని, అందుకే విడుదల పలుమార్లు వాయిదా పడిందంటున్నారు. ఈ వార్తల్లో నిజమెంతో తెలియదు కానీ ప్రముఖంగా వినిపించాయి.

దిల్ రాజు నిర్మాతగా ఉన్న సినిమాకు విడుదల కష్టాలు రావడం అంటే నమ్మడం కష్టం కదా. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ మొత్తం ఆయన చేతుల్లో ఉన్నాయి. కాబట్టి శాకుంతలం రిలీజ్ వాయిదాలకు కారణం తెలియదు. ఈసారి సమ్మర్ ని టార్గెట్ చేసిన శాకుంతలం టీం ఏప్రిల్ 14న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ప్రమోషన్స్ షురూ చేశారు. శాకుంతలం టీమ్ జూబ్లీ హిల్స్ పెద్దమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సమంత మూవీని ప్రమోట్ చేస్తూ సోషల్ మీడియా పోస్ట్స్ పెడుతున్నారు. ఇక శాకుంతలం సమంతకు ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి.