Chhaava Movie : కొద్దీ రోజుల క్రితమే భారీ అంచనాల నడుమ విడుదలైన ‘చావా'(Chhaava Movie) చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టిస్తున్న వసూళ్ల సునామీని మనమంతా కళ్లారా చూస్తూనే ఉన్నాం. చరిత్ర పుటల్లో కనుమరుగైన ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత చరిత్రని ఆధారంగా తీసుకొని తెరకెక్కించిన ఈ చిత్రం మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. హిందుత్వ మతం కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వదిలేసినా మహాయోడిది చరిత్రను వెండితెర పై ఎంతో అద్భుతంగా చూపించాడు డైరెక్టర్. విడుదలైన నాలుగు రోజుల్లో దేశవ్యాప్తంగా 150 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ఓవర్సీస్ లో కూడా 4 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. ఇకపోతే ఈ చిత్రానికి సంబంధించిన మేకింగ్ వీడియో ని కాసేపటి క్రితమే మేకర్స్ విడుదల చేసారు.
ఈ మేకింగ్ వీడియో కి ప్రేక్షకుల నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా హీరో విక్కీ కౌశల్(Vicky Kaushal) ఈ సినిమా కోసం పడిన కష్టాన్ని ఈ మేకింగ్ వీడియో లో చూస్తే చేతులెత్తి దండం పెట్టకుండా ఉండలేరు. చిన్నపాటి షాట్స్ కి కూడా డూప్స్ ని వాడే హీరోలు ఉన్న ఈ కాలంలో, విక్కీ కౌశల్ ఈ ప్రతీ ఫైట్ సన్నివేశాన్ని డూప్ సహాయం లేకుండా చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. సినిమా షూటింగ్ మొదలయ్యే ముందు, ఈ పాత్ర కోసం ఆయన అనేక విద్యలు నేర్చుకోవడాన్ని ఈ వీడియో లో చూపించారు. అదే విధంగా సినిమాలోని యాక్షన్ సన్నివేశాల కోసం ముందుగానే విక్కీ కౌశల్ రిహార్సల్స్ చేసేవాడట. రోజుకి 8 గంటలపాటు ఆయన ఈ రిహార్సల్స్ సెషన్ లో పాల్గొనే వాడట. అలా షూటింగ్ ని పూర్తికి అయ్యే వరకు ఆయన ఈ కష్టాన్ని అనుభవించాడు.
రిహార్సల్స్ సెషన్ లోనే విక్కీ కౌశల్ కి ఎన్నో గాయాలయ్యాయి. ఆ గాయాలతోనే ఆయన షూటింగ్ లో పాల్గొనేవాడు. ఈ మేకింగ్ వీడియో లోని ప్రతీ షాట్ ఒళ్ళు గగురుపొడిచే విధంగా ఉన్నాయి. ఈ రేంజ్ లో కష్టపడ్డాడు కాబట్టే, ఆ కష్టానికి తగ్గ ఫలితం దక్కింది. ఫుల్ రన్ లో ఈ చిత్రం కచ్చితంగా 500 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లను రాబడుతుందని బలమైన నమ్మకంతో చెప్తున్నారు ట్రేడ్ పండితులు. బ్యాడ్ లక్ ఏమిటంటే ఈ చిత్రం తెలుగు, తమిళం కన్నడ భాషల్లో కూడా విడుదల అవ్వకపోవడమే. హిస్టరీ కి సంబంధించిన ఇలాంటి సినిమాలను చూసేందుకు ప్రతీ ఒక్కరు ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. ఇతర భాషల్లో విడుదల చేయకపోవడం వల్ల నిర్మాతలకు దాదాపుగా 150 కోట్ల రూపాయిల గ్రాస్ నష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నారు. రాబోయే రోజుల్లో అయినా డబ్ చేసి విడుదల చేస్తారో లేదో చూడాలి.
