
RRR : దేశవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎదురు చూస్తున్న సినిమాల్లో RRR ముందు వరసలో ఉంటుంది. ఈ మోస్ట్ అవైటెడ్ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా? ఎప్పుడు చూసేద్దామా అని మెగా, నందమూరి ఫ్యాన్స్ ఆరాటపడుతున్నారు. అయితే.. రాజమౌళి సినిమా అంటే ఎంత పకడ్బందీగా ఉంటుందో తెలిసిందే. సినిమాకు సంబంధించి ఎలాంటి లీకులు రాకుండా చూస్తాడు జక్కన్న. బయటి వ్యక్తులు షూటింగ్ లోకి అడుగు పెట్టకుండా పటిష్టమైన బందోబస్తు నిర్వహించడంతోపాటు సిబ్బందికి ప్రత్యేకమైన ఐడీ కార్డులు తయారు చేయించడం వరకు అన్నీ చేస్తాడు. అందుకే.. ఆయన సినిమాలకు లీకులు బెడద తక్కువగా ఉంటుంది. కానీ.. RRR విషయానికి వచ్చే సరికి లెక్క తప్పుతోంది. ఈ చిత్రానికి సంబంధించి తాజాగా కీలకమైన సన్నివేశం లీకైంది.
ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ పాత్రలు ఏంటన్నది అందరికీ తెలుసు. కానీ.. కథ ఏంటన్నది మాత్రం ఎవ్వరికీ తెలియదు. బ్రిటీష్ సైన్యాన్ని వణికించిన అల్లూరి సీతారామరాజు, నిజాం రాజును గడగడలాడించిన కొమరం భీమ్ జీవిత చరిత్రలో కొంత భాగం ఇప్పటికీ అందుబాటులో లేదు. ఆ సమయంలో వారు ఏం చేశారో..? ఎక్కడున్నారో ఎవ్వరికీ తెలియదు. ఆ గ్యాప్ ను సెలక్ట్ చేసుకొని తన సినిమా కథ అల్లుకున్నాడు దర్శకుడు రాజమౌళి. ఆ సమయంలో వీరిద్దరూ కలిసి, స్నేహితులుగా మారితే ఎలా ఉంటుందన్నదే సినిమా. ఆసక్తిని రేకెత్తించే ఈ కథాంశంతో సినిమాపై అంచనాలు పెంచేశాడు.
ఇలాంటి సినిమాకు సంబంధించి కీలక విషయాలు లీకవుతూనే ఉన్నాయి. ఆ మధ్య ఒక ఆర్టిస్టు యూట్యూబ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… రామ్ చరణ్ – జూనియర్ మధ్య ఫైట్ సీన్ గురించి లీక్ చేశాడు. దీంతో.. వెంటనే జక్కన్న టీమ్ రంగంలోకి దిగి ఆ ఇంటర్వ్యూను డెలీట్ చేయించింది. కానీ.. అప్పటికే చాలా మంది ఆ ఇంటర్వ్యూను చూశారు. ఆ తర్వాత అందరికీ కఠిన ఆదేశాలు ఇచ్చారు. సినిమాకు సంబంధించి ఎవ్వరూ బయట చెప్పొద్దని వార్నింగ్ ఇచ్చారు.
ఇప్పుడు లేటెస్ట్ గా సుజాత అనే ఓ క్యారెక్టర్ ఆర్టిస్టు అనుకోకుండా ఇంటర్వ్యూలో మరో కీలక విషయాన్ని చెప్పారు. తాను ఈ సినిమాలో నటించానని చెప్పిన ఆమె.. తన పాత్రతో పాటు సన్నివేశాన్ని కూడా లీక్ చేసింది. కొమరం భీమ్ నివసించే ప్రాంతంలో ఉండే మహిళగా తాను నటించానని ఆ నటి తెలిపింది. కథలో భాగంగా.. రామ్ చరణ్ ఎన్టీఆర్ ను కట్టేసి, కొరడాతో కొట్టే సన్నివేశం ఉందట. రియలిస్టిక్ గా ఉండడం కోసం నిజంగానే ఎన్టీఆర్ ను కొట్టాలని దర్శకుడు సూచించాడట. దీంతో.. చెర్రీ సిద్ధమై, రెండు దెబ్బలు కొట్టి, వెంటనే జూనియర్ ను హత్తుకొని భావోద్వేగానికి గురయ్యాడట. ఇది చూసిన సెట్ లోని వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారని సుజాత తెలిపింది.
ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినిమా లీకులను అరికట్టేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. ఏదో విధంగా బయటకు వస్తూనే ఉన్నాయి. మరి, జక్కన్న ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాడో చూడాలి. ఇదిలాఉంటే.. ఈ సినిమా విడుదలపై ఇంకా స్పష్టత రాలేదు. దాదాపు దసరాకు రావడం అనుమానమే. సంక్రాంతికి వరుసగా పవన్, మహేష్, ప్రభాస్ సినిమాలు స్లాట్ బుక్ చేసుకున్నాయి. మరి, జక్కన్న తన సినిమాను ఎప్పుడు వదులుతాడో చూడాలి.