Balakrishna Aditya 999: ఈ మధ్య బాలయ్య జోరు మామూలుగా లేదు. అఖండ మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టడం, హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ షో భారీ ఆదరణ దక్కించుకోవడంతో ఫుల్ హ్యాపీగా ఉన్నారు. యువ హీరోల సినిమా ఫంక్షన్స్ లో గెస్ట్ గా సందడి చేస్తున్నారు. అల్లు అరవింద్ చిన్నబ్బాయి శిరీష్ నటించిన ఊర్వశివో రాక్షసివో చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాలయ్య మెరిశారు. తాజాగా ఆయన విశ్వక్ సేన్ లేటెస్ట్ మూవీ ధమ్కీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కి ఆయన అతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా ఆయన కీలక అప్డేట్ ఇచ్చారు. తన డైరెక్షన్లో నెక్స్ట్ ఇయర్ మూవీ ఉందని ప్రకటించారు.

గతంలో నేను నర్తనశాల మూవీకి దర్శకత్వం వహించాలి అనుకున్నాను. ఆ మూవీ పూర్తి చేయడం నా వల్ల కాలేదు. మధ్యలో ఆగిపోయింది. మళ్ళీ డైరెక్షన్ జోలికి వెళ్ళడానికి నేను ధైర్యం చేయలేదు. నాకు భయం వేసింది. అలాగే నాకు టైం దొరకకపోవడం, సబ్జక్ట్స్ నచ్చకవడంతో కుదర్లేదు. అయితే వచ్చే ఏడాది మూవీ ఉంది. ఆదిత్య 999 మాక్స్ మూవీ నా డైరెక్షన్ లో ఉంటుంది, అని బాలయ్య ధమ్కీ చిత్ర ట్రైలర్ విడుదల ఈవెంట్ వేదికపై ప్రకటించారు. బాలయ్య ప్రకటన ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
సౌందర్య ద్రౌపదిగా శ్రీకాంత్, శ్రీహరి, శరత్ కుమార్ వంటి స్టార్స్ తో బాలకృష్ణ నర్తనశాల షూటింగ్ మొదలుపెట్టారు. కొంత చిత్రీకరణ జరిగాక సౌందర్య ప్రమాదంలో మరణించారు. దీంతో బాలకృష్ణ నర్తనశాల ప్రాజెక్ట్ పక్కన పెట్టేశారు. ఆ మధ్య నర్తనశాల మూవీ కోసం చిత్రీకరించిన సన్నివేశాలు యూట్యూబ్ లో విడుదల చేశారు. ఇక 1991లో విడుదలైన ఆదిత్య 369 బాలకృష్ణ కెరీర్లో ఐకానిక్ చిత్రంగా నిలిచిపోయింది.

విలక్షణ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన సైన్స్ ఫిక్షన్ మూవీ ఆదిత్య 369 అద్భుత విజయం సాధించింది. బాలకృష్ణ శ్రీకృష్ణదేవరాయలు గా కనిపించారు. డ్యూయల్ రోల్ లో ఆయన అదరగొట్టారు. ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని చాలా కాలంగా ప్రచారం జరుగుతుంది. ఫైనల్ గా బాలకృష్ణ నోటి నుండి అధికారిక ప్రకటన వచ్చింది. కాగా మోక్షజ్ఞ డెబ్యూ మూవీ ఇదే కావచ్చనే వాదన కూడా ఉంది. మరి బాలయ్య తన డైరెక్షన్ లో మోక్షజ్ఞను ఆదిత్య 999 ద్వారా లాంఛ్ చేస్తాడేమో చూడాలి.