Krishnamma Movie: సత్యదేవ్ హీరోగా నటించిన చిత్రం కృష్ణమ్మ. అనిత రాజ్, అర్చన ఇతర ప్రధాన పాత్రలు చేశారు. మే 10న థియేటర్లో విడుదల అయింది. రిలీజ్ అయిన వారం రోజులకే ఓటీటీ లోకి వచ్చేసింది. ఒక సినిమా ఇంత త్వరగా ఓటిటీ లో అందుబాటులోకి రావడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ సినిమా డిజిటల్ హక్కులు ఏ డిజిటల్ ప్లాట్ ఫార్మ్ సొంతం చేసుకుందో చూద్దాం. వాస్తవానికి థియేట్రికల్ రిలీజ్ అనంతరం ఓటీటీలోకి రావాలంటే కనీసం నెల రోజుల సమయం పడుతుంది.
లేదంటే ఆ సినిమా థియేట్రికల్ రన్ ని బట్టి నాలుగు వారాల లోపు కూడా ఓటీటీలో స్ట్రీమింగ్ కి రావచ్చు. కానీ సత్యదేవ్ హీరోగా నటించిన కృష్ణమ్మ మే 17న సైలెంట్ గా ఓటీటీ లోకి వచ్చేసింది.వారం రోజుల్లోనే స్ట్రీమింగ్ అవడం ఊహించని పరిణామం. కృష్ణమ్మ డిజిటల్ హక్కులు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఈ చిత్రం ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది.
తెలుగు ఆడియో, ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో ప్రసారం అవుతుంది. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ లేకపోవడంతో కృష్ణమ్మ టీం కు నిరాశ ఎదురైంది. అందుకే ఇంత తక్కువ వ్యవధిలో ఓటీటీలో రిలీజ్ చేసినట్లు సమాచారం. నిజానికి ఈ సినిమా లో సత్యదేవ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. కథ పరంగా కూడా సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ ఆడియన్స్ థియేటర్ కి వెళ్లడానికి ఆసక్తి చూపలేదు.
కృష్ణమ్మ మూవీలో లక్ష్మణ్ మీసాల, కృష్ణ, అర్చన, రఘు కుంచె, నంద గోపాల్ కీలక పాత్రల్లో నటించారు. కాల భైరవ ఈ సినిమాకి సంగీతం అందించారు. వీవీ గోపాలకృష్ణ దర్శకత్వం వహించారు. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పణ లో అరుణాచల క్రియేషన్స్ బ్యానర్ పై కృష్ణ కొమ్మాలపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. చేయని నేరానికి కేసులో ఇరుక్కున్న ముగ్గురు వ్యక్తుల కథే ఈ చిత్రం.