Sarkaru Vaari Paata Box Office Collections: ‘సర్కారు వారి పాట’ సినిమా ఫేక్ కలెక్షన్ల వివాదంలో చిక్కుకుని నలిగిపోతుంది. లేనిపోని గొప్పలతో తిప్పలు ఎందుకు అంటూ నలుగురు నాలుగు మాటలు అంటున్నారు. ఆడంబారాలలో మునిగినపుడు విచక్షణ మరచిపోవడం సహజం. కానీ, ప్లాప్ సినిమా, ఇండస్ట్రీ రికార్డులు కొల్లగొట్టింది అనడమే విడ్డూరం. ‘గింతలేడు పోరడు అవ్వల్ దర్జా పోతుండు’ అన్నట్టు ఉంది సర్కారు సినిమా వ్యవహారం.
రికార్డులతో పాపులారిటీ మరింత పెంచుకోవడానికి, లేనిపోని కలెక్షన్లతో అప్రతిష్టపాలు అవుతున్నారు మన స్టార్లు. నిజానికి కలెక్షన్ల ప్రకటన అనేది నిర్మాతలకు సంబంధించినది. కానీ, టాలీవుడ్ లో హీరోల ప్రమేయమే ఎక్కువగా కనిపిస్తోంది. సర్కారు విషయంలో మహేష్ ప్రమేయం ఎంత ఉందనేది పక్కన పెడితే.. సినిమా లెక్కల్లో మాత్రం అనేక బొక్కలు ఉన్నాయి.
Also Read: Child Marriages In AP: బాల్య వివాహాల్లో ఆంధ్రప్రదేశ్ టాప్.. తెలంగాణ స్థానం ఏంటో తెలుసా?
మహేషా.. మహేషా.. ఈ ఫేక్ కలెక్షన్స్ ఏంటి మహేషా ? అంటూ ట్రోలింగ్ కి దిగారు ట్రోలర్స్. తమ సినిమా ఆరు రోజుల కలెక్షన్స్ ఇలా వచ్చాయని నిర్మాతలు భారీ పోస్టర్లు డిజైన్ చేయించి వదిలారు. ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు 76 కోట్లు, రెండో రోజు 27.6 కోట్లు, మూడో రోజు 28.87 కోట్లు, నాలుగో రోజు 29.13 కోట్లు, ఐదో రోజు 9.39 కోట్లు, ఆరో రోజు 5.26 కోట్లు.. తమ సినిమా వసూలు చేసిందని మేకర్స్ సగర్వంగా ప్రకటించారు. మొత్తం ఆరు రోజులకు గానూ 175 కోట్ల మైలు రాయిని దాటిందని నిర్మాతలు గొప్పలు పోయారు.
కాకపోతే, ఆ గొప్పలు ఎక్కువ అయిపోయాయి. నిర్మాతల కలెక్షన్ల ప్రకటనలకు, బాక్సాఫీస్ వద్ద వాస్తవ లెక్కలకు సుమారు 43 శాతం వ్యత్యాసం కనిపిస్తుంది. ఎక్కడా పొంతన లేదు. పైగా ‘సర్కారు వారి పాట’ కలెక్షన్ల పై.. ఈ సినిమాని కొనుకున్న డిస్టిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లే పెదవి విరుస్తున్నారు. 175 కోట్ల కలెక్షన్స్ లో 43 శాతం ఫేక్ అని, అందులో జీఎస్టీ.. ఇతర ట్యాక్సులు మినహాయించలేదని, అలాగే ఎగ్జిబిటర్లు, డిస్టిబ్యూటర్ల కమిషన్లు కూడా మినహాయించలేదని.. మొత్తంగా ఈ సినిమా షేర్‌లో 43 శాతం మ్యానుపులేషన్ జరిగిందని డిస్టిబ్యూటర్లు బాహాటంగానే బయట పెడుతున్నారు. మొత్తంగా నిర్మాతల కలెక్షన్ల వివరాల్లో క్షవరం తప్ప వివరం లేదని వారు బలంగా వినిపిస్తున్నారు.
ఇప్పటి వరకు ఈ చిత్రం 59 కోట్ల షేర్ ను మాత్రమే వసూలు చేసిందనేది వాస్తవ లెక్కలు చెబుతున్నాయి. అందుకే, గతంలో ఏ సినిమాకి లేని విధంగా ‘సర్కారు..’ కలెక్షన్ల పై భారీగా ట్రోల్స్ జరుగుతున్నాయి. #SVPdisaster అనే హ్యాష్ ట్యాగ్ తో విపరీతంగా ట్రెండింగ్ చేస్తున్నారు. మరోపక్క ట్రోల్స్ కు ధీటుగా #SVPblackbuster అంటూ మహేష్ ఫ్యాన్స్ పోటీగా ట్రెండింగ్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఎన్నడూ లేని విధంగా ఈ సినిమా పై సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరో వారంలో వాస్తవ లెక్కలు కూడా వెల్లడి కానున్నాయి.
Also Read:Bigg Boss Non Stop Akhil: బిగ్ బాస్ నాన్ స్టాప్: అఖిల్ సార్థక్ విజేత కాకపోవడానికి 15 అసలు కారణాలివీ!