Sankranti Movies 2025: తెలుగు సినిమాకు నైజాం గుండెకాయ వంటిది. ఏరియా వైజ్ చూస్తే తెలుగు రాష్ట్రాల్లో నైజాం అతిపెద్ద మార్కెట్ కలిగి ఉంది. ఈ మధ్య స్టార్ హీరోల సినిమాలు టాక్ తో సంబందం లేకుండా అక్కడ రూ. 30 కోట్లకు పైగా షేర్ అవలీలగా రాబడుతున్నాయి. పుష్ప 2 నైజాం రైట్స్ రూ. 100 కోట్లు పలికాయి. ఈ సినిమా అక్కడ దాదాపు బ్రేక్ ఈవెన్ కి దగ్గరైంది.
మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ప్రభాస్, ఎన్టీఆర్ వంటి హీరోలకు నైజాంలో పెద్ద మొత్తంలో మార్కెట్ ఉంది. నిర్మాతలు సేవ్ కావాలంటే నైజాం వసూళ్లు చాలా కీలకం. అలాగే ఒక్క హైదరాబాద్ నుండే కోట్లలో వసూళ్లు దక్కుతాయి. కాగా కొత్తగా తెలంగాణలో కొలుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం టాలీవుడ్ కి చుక్కలు చూపిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి తాజా నిర్ణయం నిర్మాతలను ఆందోళనకు గురి చేస్తుంది. పుష్ప 2 ప్రీమియర్స్ కి హాజరై రేవతి అనే మహిళ మృతి చెందిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. అల్లు అర్జున్ తో పాటు పరిశ్రమ ప్రముఖులపై అసెంబ్లీ సాక్షిగా విమర్శలు గుప్పించారు.
ఇకపై తెలంగాణ రాష్ట్రంలో బెనిఫిట్ షోలకు, టికెట్స్ ధరల పెంపుకు అనుమతి ఉండదు అంటూ ప్రకటన చేశారు. సీఎం రేవంత్ నిర్ణయం భారీ బడ్జెట్ చిత్రాలను తీవ్రంగా దెబ్బతీయనుంది. ముఖ్యంగా సంక్రాంతి సినిమాల వసూళ్లు ఎఫెక్ట్ అవుతాయి. గేమ్ ఛేంజర్ మూవీ బడ్జెట్ రూ. 300 కోట్లకు పైమాటే, అలాగే డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం.. పెద్ద చిత్రాలు. వెంకటేష్ సినిమా మినహాయించినా గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ చిత్రాలకు బెనిఫిట్ షోలు, టికెట్స్ ధరల పెంపు చాలా అవసరం.
మారిన సమీకరణాల రీత్యా హిట్ టాక్ తెచ్చుకున్న చిత్రాలు కూడా తెలుగు రాష్ట్రాల్లో రెండు వారాలకు మించి ఆడటం లేదు. బిజినెస్ లో 50 శాతం వీకెండ్ కల్లా రాబట్టాల్సిన పరిస్థితి. వర్కింగ్ డేస్ మొదలయ్యాక వసూళ్లు కుదేలవుతాయి. కాబట్టి మొదటి మూడు రోజులు చాలా కీలకం. ఫస్ట్ వీకెండ్ వరకు బెనిఫిట్ షోలు, టికెట్స్ ధరల పెంపు కారణంగా నిర్మాతలు సేఫ్ జోన్లో కి వస్తున్నారు. ఇకపై తెలంగాణలో ఈ వెసులుబాటు లేదు. సీఎం రేవంత్ నిర్ణయంతో జరిగే నష్టం క్లియర్ గా కనిపిస్తుంది. ఈ క్రమంలో ఇండస్ట్రీ పెద్దలు బేరసారాలు చేస్తారా? అనే సందేహాలు మొదలయ్యాయి.