Sankranthiki Vasthunam: ఓటీటీ రాజ్యం ఏలుతున్న ఇలాంటి రోజుల్లో రీమేక్ సినిమాలు వర్కౌట్ కావడం లేదు అనే విషయాన్నీ కళ్లారా చూస్తూ కూడా ఎందుకు మన మేకర్స్ రీమేక్ సినిమాలపై ఇంకా మొగ్గు చూపిస్తున్నారో అర్థం కావడం లేదు. ముఖ్యంగా మన మార్కెట్ ని చదివేసి, అవపోసన పట్టేసేలా కనిపించే దిల్ రాజు లాంటోళ్ళు కూడా ఇంకా రీమేక్ సినిమాలపై నమ్మకం పెట్టుకున్నారంటే అసలు వీళ్లకు మతి స్థిమితం ఉందా అని విశ్లేషకులు అంటున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే రీసెంట్ గా సంక్రాంతి కానుకగా విడుదలై ‘సంక్రాంతికి వస్తున్నాం'(Sankranthiki Vastunnam) చిత్రం ఎంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సుమారుగా 300 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించిన ఈ సినిమా ఇప్పటికీ థియేటర్స్ లో విజయవంతంగా నడుస్తుంది. అలాంటి సినిమాని బాలీవుడ్ లో రీమేక్ చేయడానికి సిద్దమయ్యాడు నిర్మాత దిల్ రాజు(Dil Raju).
ప్రముఖ బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్(Akshay Kumar) ఈ చిత్రంలో హీరో గా నటించబోతున్నాడట. డైరెక్టర్ ఎవరు అనేది ఇంకా ఖరారు కాలేదు కానీ, ఒక హీరోయిన్ క్యారక్టర్ కి పూజా హెగ్డే ని ఎంచుకున్నట్టు తెలుస్తుంది. అయితే ‘సంక్రాంతికి వస్తున్నాం’ లాంటి సినిమాలు కేవలం సంక్రాంతి సీజన్ కోసం తయారుచేయబడేవి. ఆ సీజన్ లో తప్ప వేరే ఏ సీజన్ లో విడుదలైన గొప్ప రెస్పాన్స్ వచ్చి ఉండకపోవచ్చు. అంతే కాదు మన తెలుగు ఆడియన్స్ కామెడీ టేస్ట్ వేరు, హిందీ ఆడియన్స్ కామెడీ టేస్ట్ వేరు. కేవలం వెంకటేష్ కి మాత్రమే సూట్ అయ్యే సినిమా ఇది. అలాంటి సినిమాని హిందీ రీమేక్ చేయాలనే ఆలోచన దిల్ రాజు కి ఎలా వచ్చిందో అర్థం కావడం లేదంటూ ట్రేడ్ పండితులు సైతం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే దిల్ రాజు కి నేచురల్ స్టార్ నాని ‘జెర్సీ’ చిత్రాన్ని హిందీ లో షాహిద్ కపూర్ తో రీమేక్ చేసి చేతులు కాల్చుకున్న అనుభవం ఉంది.
ఒకసారి రీమేక్ వర్కౌట్ అవ్వలేదనే విషయం తెలిసి కూడా ఎందుకో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నాడు. అంతే కాదు రీసెంట్ గా తమిళం లో సూపర్ హిట్ గా నిల్చిన ‘తేరీ’ చిత్రాన్ని హిందీ లో బేబీ జాన్ గా రీమేక్ చేసారు. ఈ సినిమా కూడా కమర్షియల్ గా ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. కళ్ళ ముందు ఇన్ని ఉదాహరణలు కనిపిస్తున్నాయి, అయినప్పటికీ దిల్ రాజు తగ్గడం లేదు. ఈమధ్య కాలం లో మన సినిమాలు ఓటీటీ లో తెలుగు, హిందీ తో పాటు ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. హిందీ ఆడియన్స్ అయితే మన తెలుగు మూవీస్ ని ఎగబడి చూసేస్తున్నారు. అందుకే రీమేక్ సినిమాలు అక్కడ అసలు వర్కౌట్ అవ్వడం లేదు. చూడాలి మరి దిల్ రాజు చేస్తున్న డేరింగ్ స్టెప్ ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది.