Sankranthi Telugu Movies 2026: గత కొన్నేళ్లుగా సంక్రాంతికి విడుదలయ్యే మొదటి సినిమాల పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. ప్రీ ఫెస్టివల్ సీజన్ లో ఒక సినిమాని విడుదల చేయడమే పెద్ద సాహసం అన్నట్టుగా తయారైంది పరిస్థితి. పాజిటివ్ టాక్ వస్తే పర్వాలేదు. పొరపాటున నెగిటివ్ టాక్ వస్తే మాత్రం మొదటి రోజు మ్యాట్నీ షోస్ కే కలెక్షన్స్ డౌన్ అయిపోతున్నాయి. 2018 వ సంవత్సరం నుండి బాగా గమనిస్తే, జనవరి 9 లేదా జనవరి 10 న వచ్చిన సినిమాలు దారుణమైన ఫలితాలను సొంతం చేసుకున్నాయి. ముందుగా మనం అజ్ఞాతవాసి చిత్రం గురించి మాట్లాడుకోవాలి. జల్సా, అత్తరిందికి దారేది వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్స్ తర్వాత పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా పై విడుదలకు ముందు కనీవినీ ఎరుగని రేంజ్ భారీ అంచనాలు ఉండేవి. అలా భారీ అంచనాల నడుమ 2018 వ సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా అభిమానులను తీవ్ర స్థాయిలో నిరాశకు గురి చేసింది.
ఫలితంగా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిల్చింది ఈ చిత్రం. ఇక ఆ తర్వాత 2019 వ సంవత్సరం లో విడుదలైన బాలయ్య బాబు ప్రతిష్టాత్మక చిత్రం ఎన్టీఆర్ కథానాయకుడు, రెండు రోజుల గ్యాప్ తో విడుదలైన రామ్ చరణ్ వినయ విధేయ రామ సినిమాలు కూడా డిజాస్టర్ ఫ్లాప్స్ అయ్యాయి. కేవలం 2020 వ సంవత్సరం మాత్రమే బాగా కలిసొచ్చింది. సంక్రాంతి బరిలో ముందుగా ‘సరిలేరు నీకెవ్వరూ’ సినిమా విడుదలైంది. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది, కమర్షియల్ గా పెద్ద హిట్ అయ్యింది. ఇప్పటికీ మహేష్ బాబు కెరీర్ హైయెస్ట్ వసూళ్లను రాబట్టిన సినిమా ఇదే. ఇక ఆ తర్వాత 2023 వ సంవత్సరం లో ‘గుంటూరు కారం’ చిత్రం జనవరి 10 న విడుదలై ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. ఈ సినిమా విడుదలైన మరుసటి సంవత్సరం 2024 లో రామ్ చరణ్ గేమ్ చేంజర్ చిత్రానికి కూడా ఇదే పరిస్థితి.
ఇక నేడు విడుదలైన రెబల్ స్టార్ ప్రభాస్ ‘రాజా సాబ్’ కి కూడా అదే గతి పట్టింది. ఇవన్నీ చూసిన తర్వాత సంక్రాంతి బరిలో మొదట తమ సినిమాలను విడుదల చేయాలంటేనే భయపడిపోతున్నారు నిర్మాతలు. ఈ సెంటిమెంట్ ని ప్రభాస్ లాంటి బిగ్గెస్ట్ సూపర్ స్టార్ నే బ్రేక్ చేయలేకపోతే, ఇక సాధారణ హీరోల పరిస్థితి ఏంటో అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. రాజా సాబ్ చిత్రం సంక్రాంతి , భోగి , కనుమ రోజున బాగా ఆడే అవకాశాలు ఉండొచ్చు కానీ , ఓపెనింగ్ మాత్రం భారీ గా నష్టపోయింది. కనీసం 30 కోట్ల షేర్ కూడా వచ్చేలా కనిపించడం లేదు, ఇది ప్రభాస్ కి చాలా పెద్ద షాక్ అనే చెప్పొచ్చు.