Samantha Yashoda : యశోద రిజల్ట్ సమంతకు చాలా కీలకం. ఆమె నటించిన లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో ఇది చాలా ప్రత్యేకం. పాన్ ఇండియా మూవీగా విడుదలవుతున్న సమంత మొదటి చిత్రం. అదే సమయంలో సమంత మార్కెట్ కి మించి భారీ ఖర్చుతో తెరకెక్కించారు. హీరోయిన్ ప్రధానంగా తెరకెక్కిన మూవీ రూ. 20 కోట్ల షేర్ రాబడితే గొప్ప. బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న ఓ బేబీ రూ. 12 నుండి 13 కోట్ల షేర్ రాబట్టినట్లు సమాచారం. ఆ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ కేవలం రూ. 10 కోట్లు. కానీ యశోద ఏకంగా రూ. 55 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు తెలుస్తుంది. అంటే కనీసం రూ. 56 కోట్ల షేర్ రాబడితే మూవీ సేవ్ అయినట్లు.

కాబట్టి సమంత యశోద మూవీతో పెద్ద బాధ్యత నెత్తిన పెట్టుకుంది. అలాగే అనారోగ్యంతో సమంత యశోద షూట్ పూర్తి చేశారు. చికిత్స తీసుకుంటూ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో పాల్గొన్నారు. చివరికి ప్రమోషన్స్ కూడా చేశారు. సినిమా కోసం కఠిన యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొన్న సమంత బ్లడ్ పెట్టి ఈ మూవీ చేశారని చెప్పొచ్చు. మరి అంత కష్టపడినప్పుడు మూవీ సక్సెస్ కావాలని కోరుకోవడంలో తప్పులేదు.
నవంబర్ 11న విడుదలైన యశోద హిట్ టాక్ సొంతం చేసుకుంది. విన్నూతమైన కథ, కథనాలు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా సమంత నటన, యాక్షన్ సినిమాకు హైలెట్ గా నిలిచాయి. యశోద ప్రతి ఒక్కరూ చూడాల్సిన చిత్రంగా ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. క్రిటిక్స్ యశోద చిత్రం పట్ల పాజిటివ్ గా స్పందించారు. యశోద మూవీ ఫలితం కోసం గత 24 గంటలుగా సమంత ఎదురుచూస్తున్నారు. మూవీ హిట్ టాక్ సొంతం చేసుకున్న క్రమంలో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇంస్టాగ్రామ్ లో యశోద చిత్రానికి వస్తున్న స్పందనపై సమంత కామెంట్ చేశారు. ఇది అద్భుతమైన రోజు. మీ ప్రోత్సాహానికి, ప్రశంసలకు కృతఙ్ఞతలు. మీ స్పందన మరింత కష్టపడడానికి ప్రేరణ ఇచ్చింది. జీవితాంతం రుణపడి ఉంటాను, అని సమంత కామెంట్ పోస్ట్ చేశారు. ప్రేక్షకుల ఆదరణకు ఆమె ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకున్నారు. దర్శక ద్వయం హరి-హరీష్ యశోద చిత్రాన్ని తెరకెక్కించారు. శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మాతగా ఉన్నారు. మణిశర్మ సంగీతం అందించారు. వరలక్ష్మీ, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ కీలక రోల్స్ చేశారు.