Salaar Records: అనుకున్నట్లే సలార్ మూవీతో ప్రభాస్ రికార్డుల ఊచకోత స్టార్ట్ చేశాడు. మొదటి రోజే సలార్ ఓ రికార్డు తన ఖాతాలో వేసుకుంది. దర్శకుడు ప్రశాంత్ నీల్-ప్రభాస్ ల కాంబోలో వచ్చిన సలార్ చిత్రంపై విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. ట్రైలర్స్ కూడా ఆకట్టుకోగా హైప్ పీక్స్ కి చేరింది. సలార్ టికెట్స్ కోసం థియేటర్స్ ఎదుట జనాలు క్యూ కట్టారు. వీకెండ్ వరకు సలార్ టికెట్స్ మొత్తంగా అమ్ముడుపోయాయని సమాచారం. ప్రేక్షకుల్లో సలార్ మూవీ అంటే ఎంత హైప్ ఉందో… ఓపెనింగ్ కలెక్షన్స్ తో స్పష్టం అవుతుంది.
సలార్ 2023కి గానూ హైయెస్ట్ ఓపెనర్ గా రికార్డులకు ఎక్కింది. డిసెంబర్ 22న విడుదలైన సలార్ చిత్రం రూ.178.7 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ రాబట్టింది. సలార్ ఈ ఏడాదికి హైయెస్ట్ ఓపెనింగ్ రికార్డు సొంతం చేసుకుంది. సలార్ తర్వాత విజయ్ లియో నిలిచింది. దర్శకుడు లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన లియో రూ. 146 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ అందుకుంది. అయితే లియో కలెక్షన్స్ ఫేక్ అంటూ కొందరు ట్రేడ్ వర్గాలు ఆరోపణలు చేశారు.
మూడో స్థానంలో మరలా ప్రభాస్ ఉన్నాడు. ఆదిపురుష్ నిరాశపరిచినప్పటికీ రికార్డు స్థాయిలో ఓపెనింగ్ డే వసూళ్లు అందుకుంది. ఆదిపురుష్ రూ. 137 కోట్ల గ్రాస్ అందుకుంది. ఇక నాలుగో స్థానంలో జవాన్ ఉంది. షారుఖ్ ఖాన్ హీరోగా దర్శకుడు అట్లీ తెరకెక్కించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ రూ. 126 కోట్లు ఓపెనింగ్స్ రాబట్టింది. ఇక టాప్ 5లో యానిమల్ నిలిచింది.
సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రన్బీర్ కపూర్ నటించిన యానిమల్ ఫస్ట్ డే రూ.115.60 కోట్ల గ్రాస్ వసూళ్లు అందుకుంది. ఇక సలార్, లియో, ఆదిపురుష్, జవాన్, యానిమల్ 2023 టాప్ 5 ఓపెనింగ్ గ్రాసర్స్ నిలిచాయి. రెండో రోజు కూడా సలార్ వసూళ్లు సాలిడ్ గా ఉన్నాయి. మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకుని కూడా బాక్సాఫీస్ షేక్ చేస్తుంది. పోటీగా విడుదలైన షారుఖ్ ఖాన్ డంకీ అంతగా ప్రభావం చూపలేదు.