Sai Pallavi : చిత్ర పరిశ్రమలో క్లీన్ ఇమేజ్ ఉన్న హీరోయిన్ ఎవరంటే టక్కున సాయి పల్లవి పేరు చెప్తారు. నిర్మాతల ఫ్రెండ్లీ హీరోయిన్ గా సాయి పల్లవికి పేరుంది. సినిమా ఆడక నిర్మాత నష్టపోయారని తెలిస్తే డబ్బులు తిరిగి ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి.ఇన్నేళ్ల కెరీర్లో ఒక హీరో, నటుడు లేదా దర్శకుడు ఆమెపై కంప్లైంట్ చేసిన దాఖలాలు లేవు. అయితే ఆమె ముక్కుసూటితనం, మనసులో ఉన్నది ఉన్నట్లు మాట్లాడే తత్త్వం వివాదాలకు దారి తీస్తుంది. కాశ్మీర్ ఫైల్స్ మూవీ గురించి సాయి పల్లవి చేసిన కామెంట్స్ ని బీజేపీ వర్గాలు తప్పుబట్టాయి. బీజేపీ నేత విజయశాంతి సైతం సాయి పల్లవి పై విమర్శల దాడి చేసింది.

తాజాగా సాయి పల్లవి మరొక వివాదాస్పద కామెంట్ చేశారు. టెలివిజన్స్ లో ప్రసారమయ్యే డాన్స్ రియాలిటీ షోలన్నీ ఫేక్ అన్న అర్థంలో మాట్లాడారు. టెలివిజన్ ఛానల్స్ లో నిర్వహించే డాన్స్ రియాలిటీ షోలలో నిజాయితీ ఉండదు. అక్కడ డబ్బుకే ప్రాధాన్యత ఉంటుంది. ప్రముఖుల పిల్లలకు మాత్రమే గౌరవం, మర్యాద ఇస్తారు. అందుకే డాన్స్ రియాలిటీ షోలు నాకు నచ్చవు. అవి అంటే నాకు అసహ్యం అని సాయి పల్లవి అన్నారు. డాన్స్ రియాలిటీ షోస్ ద్వారా వెలుగులోకి వచ్చిన సాయి పల్లవి అలాంటి కామెంట్స్ చేయడం వెనుక ఆంతర్యం అర్థం కాలేదు.
నటి కాకముందు సాయి పల్లవి విజయ టీవీలో ప్రసారమైన ఒక డాన్స్ రియాలిటీ షోలో పాల్గొన్నారు. ఫైనల్ కి చేరిన సాయి పల్లవి సెకండ్ ప్లేస్ తో రన్నర్ గా నిలిచారు. ఈ జడ్జిమెంట్ పై సాయి పల్లవికి బహుశా విశ్వాసం ఉండకపోవచ్చు.ఫస్ట్ ప్లేస్ రావాల్సిన నాకు సెకండ్ ప్లేస్ ఇచ్చారనేది సాయి పల్లవి అసహనం, అందుకే డాన్స్ రియాలిటీ షోస్ అంటే అసహ్యమని చెబుతుంది అంటూ ఒక వాదన తెరపైకి వచ్చింది. డాన్స్ రియాలిటీ షోస్ మొత్తాన్ని తప్పుబడుతూ సాయి పల్లవి స్టేట్మెంట్ ఇవ్వడం వివాదాస్పదం అవుతుంది.
ఇక సాయి పల్లవి డాన్సింగ్ స్కిల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ తరం హీరోయిన్స్ లో టాప్ డాన్సర్స్ లో ఒకరు. సౌత్ లో సిమ్రాన్, శ్రీయా శరణ్ బెస్ట్ డాన్సర్స్ గా పేరు తెచ్చుకున్నారు. తర్వాత ఆ రేంజ్ లో పాపులర్ అయ్యింది సాయి పల్లవి మాత్రమే. ఫిదా, లవ్ స్టోరీ, మారి 2 చిత్రాల్లో సాయి పల్లవి నటించిన సాంగ్స్ యూట్యూబ్ ని షేక్ చేశాయి. వ్యూస్ లో ఎవరూ అందుకొని రికార్డ్స్ నమోదు చేశాయి. అంత గొప్ప డాన్సర్ రియాలిటీ షోలను తప్పుబట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది.