
అల్లరి నరేష్ ఒకప్పుడు, అంటే.. పదేళ్ల కిందట. హిట్ కి కేరాఫ్ అడ్రస్. కలెక్షన్స్ లో మినిమమ్ గ్యారంటీ హీరో. కానీ ఫేట్ మారింది. గత కొన్నేళ్లుగా వరుస పరాజయాలతో సతమతమవుతూ మొత్తానికి ‘నాంది’ అంటూ ఒక ప్రయోగాత్మక చిత్రంతో చిన్న హిట్ కొట్టాడు. కెరీర్ ను మళ్ళీ ఎలాగోలా నిలబెట్టుకున్నాడు. అందుకే ప్రస్తుతం కొత్త సినిమాలను సెట్స్ పైకి తీసుకువెళ్తున్నాడు.
ఎప్పుడో ఈ ఏడాది ప్రారంభంలో అల్లరి నరేష్ హీరోగా ఒక సినిమా అనౌన్స్ చేశారు. సినిమా పేరు ‘సభకు నమస్కారం’. టైటిల్ తో ఆకట్టుకున్న ఈ సినిమా ఈ రోజు గ్రాండ్ గా మొదలైంది. తనదైన కామెడీ సినిమాలు చేసి చాలా కాలం అయింది కాబట్టి, ఈ సినిమాతో అల్లరి నరేష్ మళ్ళీ తన శైలి కామెడీ చిత్రాల పరంపరను మొదలుపెట్టాడు.
అయితే, నరేష్ ప్రస్తుతం చేస్తోన్న నాలుగు సినిమాల్లో మూడు సీరియస్ సినిమాలే. పూర్తిగా ఎమోషనల్ డ్రామాల వైపే తన పయనం సాగించినా ప్రేక్షకులకు తన సినిమాల పట్ల బోర్ కొడుతుంది కాబట్టి.. లేటెస్ట్ గా ‘సభకు నమస్కారం’ అంటూ ఈ పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ సినిమా చేస్తున్నాడు. సినిమాలో నేచురల్ కామెడీ ఉంటుందట. ఎక్కడ తెచ్చిపెట్టిన కామెడీ కాకుండా కథలో నుండే కామెడీ జనరేట్ అవుతుందట.
నిర్మాత మహేష్ కోనేరు నిర్మిస్తున్న ఈ సినిమాకి దర్శకుడు సతీష్ మల్లంపాటి దర్శకత్వం వహించబోతున్నాడు. మొదట ఈ సినిమా మంచు మనోజ్ హీరోగా చేయాలనుకున్నారు. కానీ, కొన్ని కారణాల వల్ల ఈ కథ అల్లరి నరేష్ దగ్గరకు వచ్చింది. అన్నట్టు ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటించబోతున్నారు. కాకపోతే ఇంకా హీరోయిన్స్ ను ఫైనల్ చేయలేదు. అబ్బూరి రవి ఈ సినిమాకి డైలాగ్ లు రాస్తున్నారు.