
దర్శక ధీరుడు రాజమౌళి చెక్కుతున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. తెలుగు స్టార్ హీరోలు ఎన్టీఆర్, రాంచరణ్ లు హీరోలుగా తెలుగు జాతి గర్వించే స్వాతంత్ర్య ిసమరయోధులు కొమురంభీం, అల్లూరి సీతరామరాజుల జీవిత కల్పనిక కథను రాజమౌళి తెరకెక్కిస్తున్నారు.
ఈ సినిమాకు తెలుగులోనే కాదు.. దేశవ్యాప్తంగా పిచ్చ క్రేజ్ ఉంది. నాన్ థియేట్రికల్ రైట్స్ ఇప్పటికే అమ్ముడుపోయాయి. వివిధ భాషల్లో ఏ భాషకు ఆ భాషకు టీవీ చానెల్స్ కు భారీ మొత్తంలో అమ్మేసుకున్నారు. జీ గ్రూప్ సంస్థ ఏకంగా ఈ సినిమా రైట్స్ అన్నింటిని 235 కోట్ల రూపాయలకు గంపగుత్తగా దక్కించుకున్నట్టు ప్రచారం జరిగింది. కానీ తాజాగా రాజమౌళి అండ్ టీం చాకచక్యంగా జీ గ్రూప్ కే కాదు.. ఏ భాషకు ఆ భాషలో విడివిడిగా నాన్ థియేట్రికల్ రైట్స్ అమ్మింది. ఈ మేరకు ప్రకటన చేసింది.
జీ గ్రూప్ కు కేవలం ‘ఆర్ఆర్ఆర్’ దక్షిణ భాషలకు సంబంధించిన డిజిటల్ రైట్స్ మాత్రమే దక్కించుకుంది. ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయిన రెండు నెలలకే జీ5లో ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయాలని కండీషన్ పెట్టారు. జీగ్రూప్ కు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో మాత్రమే రైట్స్ ఇచ్చారు.
ఇక హిందీ వెర్షన్ ను మాత్రం నెట్ ఫ్లిక్స్ కు కట్టబెట్టారు. భారీ మొత్తానికే నెట్ ఫ్లిక్స్ కు అమ్మినట్టు తెలుస్తోంది. ఇక తెలుగులో స్టార్ మాకు రైట్స్ ఇచ్చారు. జీ తెలుగు కంటే 5 కోట్లు ఎక్కువ ఇచ్చి తెలుగు శాటిలైట్ రైట్స్ స్టార్ మా దక్కించుకున్నట్టు సమాచారం. హిందీ శాటిలైట్ రైట్స్ జీ గ్రూప్ కే దక్కాయి. తమిళ, కన్నడ శాటిలైట్ రైట్స్ స్టార్ గ్రూప్ కే దక్కాయి.
ఇక హిందీతోపాటు ఇంగ్లీష్ సహా విదేశీ భాషల్లో స్ట్రీమింగ్ రైట్స్ మొత్తం అంతర్జాతీయ ‘నెట్ ఫ్లాక్స్’ ఓటీటీకే ఇచ్చారు. ఎంత భారీ మొత్తం అనేది తెలియరాలేదు.
ఇక పెన్ స్టూడియోస్ సంస్థ నార్త్ థియేట్రికల్ రైట్స్ ను 400 కోట్లకు దక్కించుకుంది. తాజా అమ్మకాలతో విడుదలకు ముందే ఆర్ఆర్ఆర్ కు డబుల్ లాభాలు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక థియేట్రికల్ రైట్స్ తో మరింత లాభాలు ఖాయంగా కనిపిస్తోంది.