RRR: కరోనా రాకతో ప్రపంచానికి ప్రశాంతత కరువైంది. రెండేళ్లుగా ఈ మహమ్మారి మానవజాతిని పట్టిపీడిస్తోంది. వరల్డ్ వైడ్ గా లక్షల మంది కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయారు. ఈ వైరస్ ను ఎదుర్కొనేందుకు ఎంత కృషి చేస్తున్నా… అది తన రూపం మార్చుకుంటూ సవాల్ విసురుతుంది. కరోనా వైరస్ లో డెల్టా వేరియంట్ హడల్ పుట్టించగా… కొత్తగా వచ్చిన ఒమిక్రాన్ ముచ్చెమటలు పట్టిస్తుంది.

ఇప్పటికే ప్రపంచ దేశాలు ఒమిక్రాన్ వైరస్ పట్ల అప్రమత్తమయ్యారు. చూస్తూ ఉండగానే ఇది మన దేశంలోకి, మెల్లగా ఆంధ్ర రాష్ట్రానికి కూడా వచ్చేసింది. వైజాగ్ లో మొదటి ఒమిక్రాన్ కేసు నమోదైనట్లు వార్తలు వస్తున్నాయి. ఐర్లాండ్ నుంచి ఆంధ్రప్రదేశ్ కి వచ్చిన ఓ వ్యక్తికి ఒమిక్రాన్ సోకినట్లు వైద్యులు అనుమానిస్తున్నారు. అతన్ని ఐసోలేట్ చేయడంతో పాటు చికిత్స అందిస్తున్నారు.
కరోనా కంటే ఒమిక్రాన్ వైరస్ వేగంగా వ్యాపిస్తుండగా వివిధ రాష్ట్రాల నుండి 30కి పైగా కేసులు నమోదైనట్లు సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో ఒమిక్రాన్ రూపంలో థర్డ్ వేవ్ రావచ్చనే భయం మొదలైపోయింది. దేశంతో పాటు రాష్ట్రాలు ఇప్పటికే ముందస్తు చర్యలు చేపట్టాయి. లాక్ డౌన్ ప్రకటించే అవకాశం కూడా కలదన్న ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. ఈ వార్తలు ఆర్ఆర్ఆర్ టీమ్ కి నిద్రలేకుండా చేస్తున్నాయి.
మరో 20 రోజుల్లో ఆర్ఆర్ఆర్ విడుదల కానుంది. ఈ 20 రోజుల్లో దేశంలో నెలకొనే పరిస్థితులపై సినిమా భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఒకవేళ నిజంగా లాక్ డౌన్ ప్రకటిస్తే అది ఆర్ఆర్ఆర్ టీం కి కోలుకోలేని దెబ్బ అవుతుంది. పూర్తి లాక్ డౌన్ ప్రకటించకున్నా… 50 శాతం సీటింగ్ వంటి ఆంక్షలు విధించినా కూడా వసూళ్ల పై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఆర్ఆర్ఆర్ విడుదల చేయాలా? మరలా వాయిదా వేయాలా? అనే సందిగ్ధం మేకర్స్ లో మొదలవుతుంది.
Also Read: Bheemla Nayak: రానాకు భీమ్లానాయక్ బర్త్డే ట్రీట్..డేనియల్ శేఖర్ వచ్చేది అప్పుడేనంటూ ట్వీట్
ఇప్పటికే ఏడాదికి పైగా ఆర్ఆర్ఆర్ విడుదల లేట్ అయ్యింది. దీంతో అనుకున్న బడ్జెట్ కంటే పది నుండి ఇరవై శాతం అధికంగా భరించాల్సి వచ్చింది. మరోసారి విడుదల వాయిదా పడితే ఆర్ఆర్ఆర్ టీమ్ కి అంతకంటే పెద్ద తలనొప్పి మరొకటి ఉండదు. సినిమా ప్రోమోలకు ఊహకు మించిన రెస్పాన్స్ దక్కడంతో మూవీ విజయంపై యూనిట్ ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఈ తరుణంలో ఒమిక్రాన్ వార్తలు జక్కన్నతో పాటు ఆర్ఆర్ఆర్ నిర్మాతలలను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
Also Read: Bangarraju Movie: మరో సర్ప్రైజ్ ఇచ్చేందుకు సిద్ధమైన నాగార్జున బంగర్రాజు టీం…