అనుకున్నట్టే దర్శకధీరుడు రాజమౌళి అద్భుతమే తీస్తున్నట్టు ఉన్నాడు. బాహుబలి తర్వాత తీస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ మూవీ అంచనాలకు మించి రూపొందుతున్నట్టు ఉంది. తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా రెండు పాటలు మినహా పూర్తిగా కంప్లీట్ అయ్యింది. దీంతో సినిమా షూటింగ్ కు సంబంధించిన మేకింగ్ వీడియోను రాజమౌళి టీం విడుదల చేసింది.
తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచదేశాలకు చాటిన దర్శకుడు రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’తో కూడా షేక్ చేయబోతున్నాడని అర్థమవుతోంది. మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రధారులుగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ నేపథ్యంలో ‘ఆర్ఆర్ఆర్’ మేకింగ్ వీడియోని గురువారం ఉదయం చిత్రబృందం విడుదల చేసింది. ‘రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్’ పేరుతో బయటకు వచ్చిన ఈ వీడియో గూస్ బాంబ్స్ తెచ్చేలా ఉంది. ఆద్యంతం ఉత్కంఠగా ఆకట్టుకుంటోంది.
రాంచరణ్, తారక్, బ్రిటీష్ నటులు, శ్రియా, సముద్రఖని తదితరులు నటించిన మేకింగ్ వీడియో ఆద్యంతం కట్టిపడేస్తోంది. భారీ యాక్షన్ బ్యాక్ డ్రాప్ ను సైతం ఈ వీడియోలో చూపించారు. సినిమా ఎలా ఉంటుందో ఈ యాక్షన్లతో తెలిసింది. సినిమా అంచనాలు అందేలా ఉంది.
ఈ ఏడాది అక్టోబర్ 13న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ఈ వీడియోలో ప్రకటించింది.