
టాలీవుడ్ లో ఇప్పుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల వ్యవహారం కాకరేపుతోంది. తెలుగు చిత్ర పరిశ్రమలో మూడు వర్గాలుగా విడిపోయి ఈ ఎన్నికను రసవత్తరం చేస్తున్నారు. ప్రస్తుతం తెలుగు చిత్రపరిశ్రమలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.
అధ్యక్ష పదవి కోసం పోటీ చేసేందుకు సిద్ధమైన ప్రకాష్ రాజ్ పై ఇప్పుడు టాలీవుడ్ లో ‘నాన్ లోకల్ ’ ముద్ర పడింది. దీనికి ప్రకాష్ రాజ్ గట్టి కౌంటర్ ఇచ్చాడు. దానికి తాను ఇండియన్ అని.. నటులకు భాష, పరతమ భేదం లేదన్నారు.
ఈ క్రమంలోనే ప్రకాష్ రాజ్ కు మద్దతుగా రాంగోపాల్ వర్మ కౌంటర్ విసిరారు. కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్ కు వచ్చిన ప్రకాష్ రాజ్ నాన్ లోకల్ అయితే తెలుగు రాష్ట్రాల నుంచి చెన్నై వెళ్లిన ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ ఎలా లోకల్ అవుతారని ప్రకాష్ రాజ్ కు మద్దతుగా వర్మ కౌంటర్లు వేశారు. తిరుపతి నుంచి మద్రాస్ వెళ్లి మోహన్ బాబు లోకలా? అని ప్రశ్నించారు. మహారాష్ట్ర నుంచి వచ్చిన రజినీకాంత్, యూపీ నుంచి వచ్చిన అమితాబ్ బచ్చన్ కూడా నాన్ లోకల్ అనా స్పష్టం చేశారు.
30 ఏళ్లుగా ఇక్కడే ఉండి తెలుగు నేర్చుకొని చలం పుస్తకాలని ముద్రించి భార్యపిల్లలతో ఉంటూ తెలంగాణలో ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని అక్కడున్న ఎంతో మంది మహిళలకు పని కల్పిస్తున్న ప్రకాష్ రాజ్ నాన్ లోకల్ అవుతారా? అని వర్మ ప్రశ్నించారు.
ప్రకాష్ రాజ్ లోని ప్రతిభ గుర్తించిన ఈ దేశం నాలుగుసార్లు ఆయనను సన్మానించిందని.. జాతీయ అవార్డు ఇచ్చిందని.. ఇప్పుడు అదే వ్యక్తిని నాన్ లోకల్ అంటున్న టాలీవుడ్ పై రాంగోపాల్ వర్మ విమర్శల వర్షం కురిపించారు.
టాలీవుడ్ ఎన్నికల్లో ప్రస్తుతం ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవితా రాజశేఖర్, హేమ బరిలో ఉన్నారు. ఈ క్రమంలోనే ఉదయం నటుడు ప్రకాష్ రాజ్ తన ప్యానెల్ ప్రకటించారు.